Kejriwal and Mamata : సీఎంల విదేశీ పర్యటనలకు మోకాలు అడ్డుతున్న కేంద్రం!

ABN , First Publish Date - 2022-07-23T17:15:38+05:30 IST

ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాల్లో జరిగే సదస్సుల్లో

Kejriwal and Mamata : సీఎంల విదేశీ పర్యటనలకు మోకాలు అడ్డుతున్న కేంద్రం!

న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు  అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీలకు విదేశాల నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ, ఆయా దేశాలకు వెళ్ళేందుకు వీరికి అనుమతిని కేంద్రం నిరాకరించింది. తాజాగా వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. 


అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) జూలై 31 నుంచి ఆగస్టు మూడు వరకు జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్‌ (World Cities Summit)లో పాల్గొనేందుకు సింగపూర్ (Singapore) వెళ్ళవలసి ఉంది. ఈ సదస్సులో ఆయన ఢిల్లీ పరిపాలనా విధానంపై మాట్లాడవలసి ఉంది. దీనికి ఆయనకు ఆహ్వానం కూడా అందింది. అయితే అక్కడికి వెళ్ళేందుకు ఆయనకు అనుమతి లభించలేదు. దీంతో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని ట్విటర్ వేదికగా వెళ్ళగక్కారు. 


దేశ ఔన్నత్యం పెరుగుతుంది

‘‘నేను క్రిమినల్‌ను కాదు. నేను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని. నేను స్వేచ్ఛాయుతమైన దేశ పౌరుడిని. నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ మోడల్‌ను వివరించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకంగా నన్ను పిలిచింది’’ అని సోమవారం ఆయన పేర్కొన్నారు. సింగపూర్ వెళ్ళేందుకు తనకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీలో తాను అమలు చేస్తున్న ఆరోగ్య సేవలు, పాఠశాలల అభివృద్ధి గురించి వివరించాలని సింగపూర్ ప్రభుత్వం తనను ఆహ్వానించిందన్నారు. తాను వీటి గురించి ఈ సదస్సులో వివరించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ఔన్నత్యం పెరుగుతుందని చెప్పారు. 


మోదీకి లేఖాస్త్రం

కేజ్రీవాల్ నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఓ లేఖ ద్వారా తన ఆవేదనను తెలిపారు. సింగపూర్ సదస్సుకు హాజరయ్యేందుకు అనుమతిని ఇవ్వకుండా తొక్కిపెట్టడం తప్పు అని తెలిపారు. ఢిల్లీ పరిపాలనా నమూనాను ప్రపంచ వేదికపై వివరించేందుకు ఇది గొప్ప అవకాశమని చెప్పారు. ఇటువంటి విశాలమైన వేదికను సందర్శించకుండా ఓ ముఖ్యమంత్రిని ఆపడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని చెప్పారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరారు.  దాదాపు ఓ నెల నుంచి ఆయన ఈ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. 


అనుమతులిచ్చే విధానం

ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు విదేశాల్లో పర్యటించాలంటే ముందుగా కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అనుమతి ఇవ్వవలసి ఉంటుంది. కేబినెట్ సెక్రటేరియట్‌కు వీరు తమ విదేశీ పర్యటనల గురించి తెలియజేయాలి. ఇక్కడి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలకు అనుమతుల  కోసం చేసే దరఖాస్తులను ప్రధాన మంత్రి కార్యాలయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. దరఖాస్తుదారులు ఏ దేశాన్ని సందర్శించాలనుకుంటున్నారో, ఆ దేశంలోని ఇండియన్ మిషన్‌కు ఈ దరఖాస్తులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపిస్తుంది. 


ఆ కార్యక్రమం జరిగే దేశంలోని ఇండియన్ మిషన్ క్షుణ్ణంగా విచారణ జరుపుతుంది. భారత దేశం నుంచి వెళ్లే ముఖ్యమంత్రి/రాష్ట్ర మంత్రికి ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరు? ఈ కార్యక్రమం స్వభావం, దానిలో పాల్గొనే ఇతర దేశాలు, ఆతిథ్య దేశంతో భారత దేశానికి గల సంబంధాలు వంటివాటిని పరిశీలిస్తుంది. అన్ని వివరాలతో ఓ సమగ్ర నివేదికను రూపొందించి, ఆ నివేదికను భారత దేశంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)కు పంపిస్తుంది. ఆహ్వానించేవారి ఉద్దేశం, విశ్వసనీయతపై అనుమానం వ్యక్తమైతే MEA ఈ దరఖాస్తుకు ప్రతికూలంగా అభిప్రాయాన్ని రాయవచ్చు. 


దరఖాస్తు నకలును ఆర్థిక వ్యవహారాల శాఖకు కూడా పంపిస్తారు. MEA నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తును ఆర్థిక వ్యవహారాల శాఖ పరిశీలిస్తుంది. ఆతిథ్య దేశం తగిన ప్రోటోకాల్‌ను పాటించవలసి ఉంటుంది. ఈ-పొలిటికల్ క్లియరెన్స్ అప్లికేషన్స్‌ను epolclearance.gov.in పోర్టల్‌ ద్వారా దాఖలు చేయడానికి 2016 నుంచి అవకాశం కల్పించారు. ఈ రిపోర్టుతోపాటు సిఫారసులను ఎంఈఏ ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిస్తుంది. పీఎంఓ తుది నిర్ణయం తీసుకుంటుంది. 


అనుమతుల నిరాకరణ కొత్త విషయం కాదు

ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతిని నిరాకరించడం తరచూ జరుగుతోంది. 2019లో డెన్మార్క్‌లో జరిగిన వాతావరణ సదస్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి లభించలేదు.  దీంతో ఆయన వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్నారు. దీనిపై అప్పటి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ, ఈ సదస్సు మేయర్ స్థాయికి సంబంధించినదని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మంత్రి ఒకరు ఈ సదస్సులో పాల్గొంటున్నారన్నారు. 


విదేశీ పర్యటనలకు మమత బెనర్జీ (Mamata Banerjee)కి చాలాసార్లు అనుమతి లభించలేదు. 2021 సెప్టెంబరులో రోమ్ (Rome) నగరంలో జరిగిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌కు వెళ్ళేందుకు ఆమెకు అనుమతి లభించలేదు. ఇది ముఖ్యమంత్రి స్థాయి నేత పాల్గొనే సదస్సు కాదని ఎంఈఏ తెలిపింది. నేపాలీ కాంగ్రెస్ (Nepali Congress) ఆహ్వానం మేరకు నేపాల్ వెళ్ళడానికి మమత బెనర్జీకి 2021 డిసెంబరులో అనుమతి లభించలేదు. 2018లో చికాగోలో జరిగిన ప్రపంచ హిందూ సభ (World Hindu Conference)కు హాజరయ్యేందుకు తనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మమత ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది. తనకు ఆమె దరఖాస్తు చేయలేదని వివరించింది. 


2011 జూన్‌లో బ్యాంకాక్‌లో ఇండియన్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ జరిగింది. దీనిలో పాల్గొనేందుకు బీజేపీ నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా, కొందరు సీనియర్ స్టేట్ గవర్నమెంట్ అఫిషియల్స్ హాజరుకావలసి ఉంది. అయితే అప్పట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వీరికి అనుమతులను నిరాకరించింది. 


2017లో చైనాలో జరిగిన టూరిజం కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు కేరళ టూరిజం మంత్రి కే సురేంద్రన్‌కు ఎంఈఏ అనుమతిని నిరాకరించింది. భారత దేశంలోని ముఖ్యమైన రాష్ట్రం నుంచి వెళ్లే మంత్రికి తగిన ప్రోటోకాల్‌ను చైనా పాటించడం లేదని తెలిపింది. 


2018 అక్టోబరులో కేరళ మంత్రులు విదేశాలకు వెళ్ళేందుకు కేంద్రం అనుమతించలేదు. విదేశాల్లో స్థిరపడిన భారతీయుల నుంచి కేరళ వరద బాధితులకు విరాళాలు సేకరించేందుకు 17 దేశాలకు వెళ్ళాలని వీరు ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 


యూపీఏ పాలనా కాలంలో అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలకు అనుమతి ఇవ్వలేదు. 


ఇదిలావుండగా, కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. 


Updated Date - 2022-07-23T17:15:38+05:30 IST