మహిళల జన్ ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున జమ

ABN , First Publish Date - 2020-04-03T22:58:10+05:30 IST

మహిళల జన్ ధన్ ఖాతాలకు రూ.500 చొప్పున నిధులను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ

మహిళల జన్ ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున జమ

న్యూఢిల్లీ : మహిళల జన్ ధన్ ఖాతాలకు రూ.500 చొప్పున నిధులను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం క్రింద ఏప్రిల్ నెలకు ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ రెండున (గురువారం) ఈ నిధులను ఆయా బ్యాంకులకు  అందజేసినట్లు తెలిపింది. 


కరోనా వైరస్ మహమ్మారితో పోరాడేందుకు అష్ట దిగ్బంధనాన్ని విధించిన నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ క్రింద ప్రతి మహిళా జన్ ధన్ ఖాతాదారుకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మార్చి 26న ప్రకటించిన సంగతి తెలిసిందే. 


లబ్ధిదారులు ఒకరికొకరు దూరం పాటిస్తూ, క్రమబద్ధంగా నగదు ఉపసంహరించుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ  కోరింది. బ్యాంకుల శాఖలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఏటీఎంల వద్ద లబ్ధిదారులు సామాజిక దూరం, అష్ట దిగ్బంధనం నిబంధనలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. 


గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మహిళా జన్ ధన్ ఖాతా సంఖ్యలో చివరి అంకె సున్నా కానీ, ఒకటి కానీ అయితే ఏప్రిల్ 3న నగదును ఉపసంహరించుకోవచ్చు. ఖాతా సంఖ్యలో చివరి అంకె 2 లేదా 3 అయితే ఏప్రిల్ 4న నగదు తీసుకోవచ్చు. ఖాతా సంఖ్యలో చివరి అంకె  4 లేదా 5 అయితే నగదును ఏప్రిల్ 7న తీసుకోవచ్చు. ఖాతా సంఖ్యలో చివరి అంకె 6 లేదా 7 అయితే ఏప్రిల్ 8న విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతా సంఖ్యలో చివరి అంకె 8 లేదా 9 అయితే ఏప్రిల్ 9న నగదు తీసుకోవచ్చు. ఏప్రిల్ 9 తర్వాత కూడా లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్ళి, బ్యాంకు పని వేళల్లో నగదును ఉపసంహరించుకోవచ్చు.  ఈ సమాచారాన్ని ఖాతాదారులకు బ్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలి. 


బ్యాంకులు, బ్యాంకు కరస్పాండెంట్లు, ఏటీఎంల వద్ద తగిన భద్రత ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది. లబ్ధిదారులు పద్ధతి ప్రకారం నగదు ఉపసంహరించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని తెలిపింది.


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ, విదేశాల్లో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రజల ఆదాయాలపై పెను ప్రభావం పడింది. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై జీవించేవారు అష్టకష్టాలు పడుతున్నారు.





Updated Date - 2020-04-03T22:58:10+05:30 IST