మృతదేహాలను గంగా నదిలో పడేయకుండా చర్యలు తీసుకోండి : కేంద్రం

ABN , First Publish Date - 2021-05-17T03:19:18+05:30 IST

గంగా నదిలో కోవిడ్-19 బాధితుల మృతదేహాలను పడేయకుండా

మృతదేహాలను గంగా నదిలో పడేయకుండా చర్యలు తీసుకోండి : కేంద్రం

న్యూఢిల్లీ : గంగా నదిలో కోవిడ్-19 బాధితుల మృతదేహాలను పడేయకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. గంగా నదిలో మృతదేహాలు ప్రవహిస్తుండటంపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొంది. 


కోవిడ్-19 బాధితుల మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని జల శక్తి మంత్రిత్వ శాఖ కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ గంగా నది నీటిని పరీక్షించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళను ఆదేశించింది.  గంగా నదిలో మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాని ఫిర్యాదులు అందడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ మే 13న స్పందించింది. జల శక్తి మంత్రిత్వ శాఖకు, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 


గంగా నదిలో మృతదేహాలను పడేయడాన్ని నిరోధించేందుకు గస్తీని ముమ్మరం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కోవిడ్-19 కారణంగా మరణించినవారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఖర్చులను భరిస్తామని బిహార్ ప్రభుత్వం తెలిపింది. 


Updated Date - 2021-05-17T03:19:18+05:30 IST