డాక్టర్ల జోలికెళ్తే కేసులు పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం..

ABN , First Publish Date - 2021-06-20T04:25:20+05:30 IST

వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది...

డాక్టర్ల జోలికెళ్తే కేసులు పెట్టండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం..

న్యూఢిల్లీ: వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అలాంటి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు అంటువ్యాధుల నిరోధక చట్టం 2020ని ప్రయోగించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవాళ లేఖ రాశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటీవల వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందిపై జరిగిన దాడులను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ‘‘వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందిపై ఇలాంటి దాడులు ఏవైనా జరిగితే వారి మనోధైర్యం దెబ్బతినండంతో పాటు, తీవ్ర అభద్రతా భావం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది..’’అని భల్లా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘దాడులకు పాల్పడుతున్న వారిపై ఎఫ్ఐఆర్ నామోదు చేయడంతో పాటు.. ఆ కేసులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన విచారించాలి. అవసరమైతే వారిపై అంటువ్యాధుల నిరోధక చట్టం 2020ని కూడా ప్రయోగించవచ్చు...’’ అని ఆయన పేర్కొన్నారు. అంటువ్యాధుల నిరోధక చట్టం కింద ఎవరైనా దోషులుగా తేలితే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-06-20T04:25:20+05:30 IST