రాజద్రోహం నిబంధన రద్దుపై స్పందించేందుకు సమయం కోరిన కేంద్రం

ABN , First Publish Date - 2022-04-27T20:16:55+05:30 IST

రాజద్రోహం నేరం గురించి చెప్తున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని

రాజద్రోహం నిబంధన రద్దుపై స్పందించేందుకు సమయం కోరిన కేంద్రం

న్యూఢిల్లీ : రాజద్రోహం నేరం గురించి చెప్తున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఈ వారాంతం వరకు గడువు ఇచ్చింది. మే 5న తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది. 


సెక్షన్ 124ఏ రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతుందా? అని ప్రశ్నిస్తూ, దీనిని రద్దు చేయాలని కోరుతూ రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబట్‌కేరే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కొహ్లి ధర్మాసనం విచారణ జరుపుతోంది. 


బ్రిటిష్ వలస పాలకులు భారత దేశ స్వాతంత్ర్య సమర యోధులను అణచివేసేందుకు ఉపయోగించిన నిబంధనను ఎందుకు రద్దు చేయడం లేదని సుప్రీంకోర్టు గత సంవత్సరం ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ నిబంధన దుర్వినియోగమవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. 


భారత దేశంలో చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించేందుకు ప్రయత్నించడం, లేదా, ప్రేరేపించడం లేదా విద్వేషాన్ని లేదా ధిక్కారాన్ని ప్రేరేపించడం లేదా అందుకు ప్రయత్నించడం నేరమని ఐపీసీ సెక్షన్ 124ఏ చెప్తోంది. ఇది నాన్ బెయిలబుల్ నేరం. ఈ నేరం రుజువైతే గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. 


గతంలో దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈ నేరారోపణలు రుజువవుతున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ సెక్షన్ ఎంతగా దుర్వినియోగమవుతోందంటే, ఓ వడ్రంగి చేతికి రంపం ఇస్తే, ఆయన చెట్టును కోయడానికి బదులుగా, మొత్తం అడవిని కోసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌‌‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కేసుల సంఖ్య 93, అంటే అంతకుముందు కన్నా 160 శాతం పెరుగుదల కనిపించింది. 2019లో 3.3 శాతం కేసులు మాత్రమే రుజువయ్యాయి. కేవలం ఇద్దరు నిందితులపై మాత్రమే నేరం రుజువైంది. 


బ్రిటిష్ పాలకుల చట్టం

రాజద్రోహం నిబంధనను 1870లో బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దీనిపై చర్చ జరిగింది. దీనిని ఉపసంహరించాలని 1948లో దాదాపు నిర్ణయించారు. 1949 నవంబరు 26న రాజద్రోహం పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు. అధికరణ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చారు. అయితే ఐపీసీలో సెక్షన్ 124ఏ కొనసాగుతోంది. 


స్వేచ్ఛకు కళ్లెం

1951లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం అధికరణ 19(1)(ఏ) ప్రకారం స్వేచ్ఛకు కళ్లెం వేస్తూ రాజ్యాంగాన్ని సవరించింది. వాక్ స్వాతంత్ర్యంపై సమంజసమైన ఆంక్షలను విధించేందుకు రాజ్యానికి అధికారం కల్పిస్తూ అధికరణ 19(2)ను తీసుకొచ్చింది. మరోవైపు ఐపీసీలోని రాజద్రోహం నిబంధనను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1962లో కేదార్‌నాథ్ కేసులో సమర్థించింది. శాంతిభద్రతలను దెబ్బతీసే లేదా హింసను రెచ్చగొట్టే ఉద్దేశాన్ని, లేదా, ధోరణిని వెల్లడించే పదాలను మాత్రమే ఈ సెక్షన్ శిక్షార్హమైనవని పేర్కొంటోందని తెలిపింది. అయితే ప్రభుత్వ చర్యలను విమర్శించే పౌరుల పట్ల రాజద్రోహం ఆరోపణలను నమోదు చేయరాదని తెలిపింది. అప్పటి నుంచి ఈ నిర్వచనాన్ని ఉపయోగించుకుంటున్నారు. 


పాత్రికేయులకు రక్షణ

ఆంధ్ర ప్రదేశ్‌లోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కూడా ఇదే సెక్షన్ క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన  ప్రముఖ పాత్రికేయుడు వినోద్ దువాపై ఇదే సెక్షన్ ప్రకారం నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేదార్‌నాథ్ సింగ్ కేసులో తీర్పు ప్రకారం ప్రతి పాత్రికేయుడు రక్షణ పొందేందుకు అర్హుడేనని తెలిపింది. 


Updated Date - 2022-04-27T20:16:55+05:30 IST