భారత కోచ్‌ల జీతాలపై గరిష్ఠ పరిమితి ఎత్తివేత

ABN , First Publish Date - 2020-07-05T08:45:09+05:30 IST

మాజీ ఆటగాళ్లను కోచింగ్‌ కెరీర్‌వైపు ఆకర్షించేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేటి అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్న

భారత కోచ్‌ల జీతాలపై గరిష్ఠ పరిమితి ఎత్తివేత

క్రీడాశాఖ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: మాజీ ఆటగాళ్లను కోచింగ్‌ కెరీర్‌వైపు ఆకర్షించేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేటి అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్న భారత కోచ్‌ల జీతాలపై ఇప్పటి వరకు విధించిన రూ. 2 లక్షల గరిష్ఠ పరిమితిని ఎత్తివేసింది. మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడాశాఖ చెబుతోంది. తాజాగా విదేశీ కోచ్‌ల కాంట్రాక్ట్‌లను వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఆ సమయంలోనే భారత కోచ్‌ల జీతాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ‘ఎంతో మంది భారత కోచ్‌లు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. వారికి తగిన ప్రతిఫలం అందాలి. మేటి అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించాలి. అందుకే వారి జీతాలపై గరిష్ఠ పరిమితులను విధించాలనుకోవడం లేదు’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. వారికి సుదీర్ఘ కాంట్రాక్టులు కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవాళీ, విదేశీ కోచ్‌లకు నాలుగేళ్ల కాంట్రాక్ట్‌లను ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ), జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎ్‌ఫఎస్‌) స్వాగతించాయి. ఇక.. 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణను క్రీడాశాఖ మళ్లీ ప్రారంభించింది. 

ఎంతో సంతోషంగా ఉంది: గోపీచంద్‌

పరిమితులు ఎత్తేయాలని ఎంతో కాలంగా కోరుతున్నాం. ఈ నిర్ణయం ఆనందం కలిగించింది. దేశ క్రీడలకు ఇదో పెద్ద మలుపు. ఎంతో మంది ప్రముఖ అథ్లెట్లు కోచింగ్‌వైపు చూసే అవకాశం ఉంది. 


Updated Date - 2020-07-05T08:45:09+05:30 IST