మరోసారి అధికారమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-22T18:48:56+05:30 IST

రాష్ట్రంలో మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉండే

మరోసారి అధికారమే లక్ష్యం

- బీజేపీలో భారీ మార్పులే  

- ఇతర పార్టీల అధ్యక్షుల తరహాలో ఫైర్‌బ్రాండ్‌లకు స్థానం 

- కేంద్రమంత్రి శోభాకరంద్లాజే వైపే మొగ్గు


బెంగళూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉండే అధిష్టానం రాష్ట్ర పార్టీ కమిటీలో భారీ మార్పులకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దక్షిణభారత్‌లో బీజేపీకి అనుకూలంగా ఉండేది కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే. మూడేళ్ళపాటు ప్రభుత్వం సాగిస్తున్న బీజేపీ చివరి ఆరునెలలు మాత్రం పూర్తిగా సంక్షేమాలు, ప్రజాకర్షక విధానాల వైపు వెళ్ళదలచారు. ప్రభుత్వం సజావుగానే సాగుతున్నా పార్టీ పరంగా మాత్రం బాగా వెనుకబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల విధానాలను పరిశీలిస్తే సమన్వయలోపంతో పాటు జిల్లాల వారీగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళేలాంటి విధానం నత్తనడకన సాగుతోందనే విమర్శలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీలు గడువు సమీపిస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీ అధ్యక్షుడు ఫైర్‌బ్రాండ్‌గా ఉండాలనే అధిష్టానం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితిలోను కటీల్‌ను మరింత కాలం కొనసాగించరాదనే ఆలోచనలో ఉండే అగ్రనేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న శోభాకరంద్లాజేను పార్టీ అధ్యక్షురాలిని చేయాలని తీర్మానించినట్లు సమాచారం. శోభాకరంద్లాజే సుధీర్ఘకాలంగా రాష్ట్ర రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. పదేళ్ళకిందట యడియూరప్ప కేబినెట్‌లో విద్యుత్‌శాఖామంత్రిగా వ్యవహరించి భారీ సంస్కరణలకు తెరలేపారు. పైగా శాఖపై ఎటువంటి విమర్ళలు లేకుండా మంత్రిగా మంచి పేరొందారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో ఉడుపి- చిక్కమగళూరు లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆతర్వాత ఆమె రాజకీయ ఆప్తుడైన యడియూరప్ప ముఖ్యమంత్రిగా వ్యవహరించినా పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయాల వైపు తొంగి చూడలేదు. రాష్ట్ర రాజకీయాలకు దూరంగా గడిపి అధిష్టానం పెద్దల ఆదేశాలు పాటించిన మేరకు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. సొంతనియోజకవర్గం, శాఖాపరమైన కార్యక్రమాలు, పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలకే పరిమితంగా కొనసాగుతున్నారు. సుమారు దశాబ్దన్నర కాలంగా శోభాకరంద్లాజే అంటే ఫైర్‌బ్రాండ్‌ అనే పేరు ఉంది. అందుకే ఆమెను అధ్యక్షురాలిని చేసి ఎన్నికలలోకి వెళ్ళాలనే అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. సామాజిక పరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన లింగాయతులు బీజేపీకు అనుకూలంగానే ఉన్నారు. రెండవ సామాజిక వర్గానికి చెందిన ఒక్కలిగలను అక్కున చేర్చుకోవాలని నిర్ణయిం చారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అదే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక జేడీఎస్‌ పార్టీకు అధ్యక్షుడిగా ఇబ్రహీం వ్యవహరిస్తున్నా ఆ పార్టీ పూర్తిగా వక్కలిగులదే పెద్దరికం అనేది తెలిసిందే. పార్టీలో జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ నుంచి మాజీ సీఎం కుమారస్వామి సహా ఏకైక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు ప్రజాప్రతినిధులు, కీలకులంతా అదే వర్గానికి చెందినవారే. ఇలా రెండు పార్టీలలోను ఒక్కలిగ సామాజికవర్గం పైచేయిగా ఉన్నందున బీజేపీ కూడా అదే బా టలోనే వెళ్ళదలచింది. దీనికి తోడు కుమారస్వామిని తండ్రి దేవేగౌడ ముఖ్యమంత్రిని చేశారని అదే తరహాలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి దక్కినందున అవకాశాన్ని సద్వినియోగం చేయాలని అందుకు వక్కలిగులంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ డీకే శివకుమార్‌ వ్యాఖ్యల వెనుక దాగి ఉండే రాజకీయాన్ని తిప్పికొట్టాలంటే బీజేపీ కూడా కీలక పదవి ఇవ్వాలని తలచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కలిగ వర్గానికి చెందిన వా రిలో కేంద్ర మంత్రి శోభాకరంద్లాజేతో పాటు పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, తమిళనాడు, గోవా రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్‌ సీటీ రవిలు ఉన్నారు. పార్టీలో జాతీయ స్థాయిలో ఉండే సీటీ రవిను రాష్ట్రానికే పరిమితం చేయరాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వక్కలిగ కార్డ్‌తో పాటు సంఘ్‌పరివార్‌ ద్వారా ఎదిగిన వారు, రాజకీయంగా అపార అనుభవం, మంత్రిగాను, పార్టీ పదవులలోను వివాదాలు లే కుండా వ్యవహరించినవారు. ప్రత్యేకించి మహిళ అన్ని వర్గాలను కలుపుకుపోయే సత్తా ఉందనే శోభా కరంద్లాజే వైపు అధిష్టానం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పైగా ఆమెకు కీలక పదవి అంటే రాష్ట్ర బీజేపీకి ఏకైక నాయకుడైన యడియూ రప్ప మరింత బాధ్యతగా వ్యవహరిస్తారనే ఆలోచన కూడా లేక పోలేదు. లింగాయత సామాజిక వర్గీయులతో పార్టీకు సంబంధాలు ఇదేవిధంగా ముందుకెళ్ళేందుకు యడియూరప్ప కుమారుడు, ప్రస్తుత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు ప్రధాన కార్యదర్శిని చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. విజయేంద్రతో పాటు ఎమ్మెల్సీ తుళసి మునిరాజగౌడ, కుడచి ఎమ్మెల్యే రాజీవ్‌లను ప్రధానకార్యదర్శులను చేయడం ద్వారా యువతకు ప్రాధాన్యత, వేగవంతంగా నిర్ణయాలు, అన్నింటి కంటే ప్రత్యర్థపార్టీల విమర్శలకు ధీటుగా జవాబు చెప్పగలరనే అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈనెల 28న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పాలనకు ఏడాది సంబరాల తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శోభాకరంద్లాజే ద్వారా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల అధ్యక్షులకు బీజేపీ సవాల్‌ విసిరేందుకు సిద్దమైంది.

Updated Date - 2022-07-22T18:48:56+05:30 IST