అధికారులను కుర్చీతో కొట్టిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-01-23T07:41:47+05:30 IST

కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తమను కుర్చీతో కొట్టారని ఇద్దరు ఒడిసా ప్రభుత్వ అధికారులు ఆరోపించారు. మ యూర్‌భంజ్‌ జిల్లాలోని ఆయన కార్యాలయంలో ఈ ఘటన జరిగిందన్నారు...

అధికారులను కుర్చీతో కొట్టిన కేంద్ర మంత్రి

భువనేశ్వర్‌, జనవరి 22: కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తమను కుర్చీతో కొట్టారని ఇద్దరు ఒడిసా ప్రభుత్వ అధికారులు ఆరోపించారు. మ యూర్‌భంజ్‌ జిల్లాలోని ఆయన కార్యాలయంలో ఈ ఘటన జరిగిందన్నారు. మయూర్‌భంజ్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ అశ్వినీ కుమార్‌ మాలిక్‌ తెలిపిన వివరాల మేరకు.. కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తన లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి చేతులు ఊపుకుంటూ వచ్చారని, సంబంధిత ఫైల్స్‌ తేలేదంటూ అశ్వినీ కుమార్‌ సహా జిల్లా ప్లానింగ్‌, మానిటరింగ్‌ యూనిట్‌ డైరెక్టర్‌ దేబాషిష్‌ మహాపాత్రలపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష జరుగుతున్న కార్యాలయానికి తాళం వేసి ఇద్దరిపైనా కేంద్రమంత్రి భౌతిక దాడికి దిగారు. వారిపై కుర్చీ కూడా విసిరేశారు. ఈ దాడిలో దేబాషిష్‌ మహాపాత్ర చెయ్యి విరిగిపోయింది. డిప్యూటీ కలెక్టర్‌ అశ్వినీ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు కేంద్ర మంత్రిపై ఐపీసీ సెక్షన్‌ 323, 325, 294, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఆరోపణను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. 

Updated Date - 2022-01-23T07:41:47+05:30 IST