తెలంగాణ వస్తే మేలు జరుగుతుందనుకున్నా కానీ.. : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-10-30T23:51:03+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నిక దగ్గరపడే కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల

తెలంగాణ వస్తే మేలు జరుగుతుందనుకున్నా కానీ.. : కేంద్ర మంత్రి

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక దగ్గరపడే కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరఫున శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారు. వారంత ఎందుకు చనిపోయారు.. తెలంగాణ బాగుండాలనే కదా. కానీ కేసీఆర్ మాత్రం తాను ముఖ్యమంత్రి కావాలనే వారంతా ఆత్మబలిదానాలు చేశారని అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఒక్క గజ్వెల్‌కే ముఖ్యమంత్రా లేకుంటే రాష్ట్రం మొత్తానికా..?. తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనుకున్నాం కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కుటుంబ పాలన, అప్పులు, అవినీతి తెలంగాణలో పెరిగాయి. తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడం బీజేపీకే సాద్యం అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.


కేసీఆర్ సీఎం అయ్యాక..!

దుబ్బాకకు అనేక విషయాల్లో అన్యాయం జరిగింది. కేసీఆర్ సీఎం కాకముందు నుంచి టీఆర్ఎస్‌ను ఆదరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అన్ని రకాలా అన్యాయం జరిగింది. టీఆర్ఎస్ నేతలు ఈ నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమను చూపారు. టీఆర్ఎస్ సర్కార్ దుబ్బాకను నిర్లక్ష్యం చేసింది. అందుకే దుబ్బాక ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగాయి. దుబ్బాక పోటీలో ఉన్న ముగ్గురిలో ఎవరైతే నియోజకవర్గ ప్రజల గొంతుక అవుతారో వారినే ఆశీర్వాదించాలి. ఎవరనేది ప్రజలు ఆలోచించాలి. ఆ వ్యక్తే రఘునందన్ రావు. ఓడినా.. మీ కష్ట సుఖాలలో రఘు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారుఅని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


దుబ్బాక డెవలప్ కావాలంటే..

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు బొమ్మా,  బొరుసు పార్టీలు. మజ్లీస్ మతోన్మాద పార్టీ. రజాకార్ల పార్టీ మజ్లిస్. వారికి కేసీఆర్ వంగి వంగి సలామ్ కొడుతున్నారు. బియ్యానికి ప్రధాని మోదీ ఏమీ ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారట. కేసీఆర్ సర్కారు కేజీ బియ్యానికి ఇచ్చేది రెండు రూపాయలే.. మిగతా డబ్బులు మోదీనే ఇస్తున్నారు. ప్రజలు దుబ్బాక ఆత్మగౌరవం నిలవాలన్నా.. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలి అని దుబ్బాక ప్రజలకు కిషన్ రెడ్డి సూచించారు.

Updated Date - 2020-10-30T23:51:03+05:30 IST