కేంద్ర పథకాలతో ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-07-06T06:46:28+05:30 IST

ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ పర్కాష్‌ లబ్ధిదారులకు సూచించారు.

కేంద్ర పథకాలతో ఆర్థికంగా ఎదగాలి
చెక్‌ అందిస్తున్న కేంద్ర మంత్రి, కలెక్టర్‌

కేంద్ర సహాయ మంత్రి సోమ్‌ పర్కాష్‌

కాకినాడ సిటీ, జూలై 5: ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ పర్కాష్‌ లబ్ధిదారులకు సూచించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌లో కేంద్ర మంత్రి పర్కాష్‌ వివిధ కేంద్ర పథకాల అమలుపై కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియాతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. అలాగే వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో మాట్లాడి జీవితాల్లో వచ్చిన మార్పులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను కేంద్ర మంత్రికి తెలియజేయగా, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు గణాంకాలతో సహా వాటి ప్రగతిని వివరించారు. సమావేశంలో కేంద్ర మంత్రి పర్కాష్‌ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కృషి చేస్తున్న అధికారులు అభినందనీయులన్నారు. లబ్ధిదారుల ఆనందాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానన్నారు. అనంతరం కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియ, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణలతో కలిసి 6,577 మంది వీధి వ్యాపారులు పీఎం స్వానిధి ద్వారా రూ.8.34 కోట్ల రుణ సహకారానికి సంబంధించిన చెక్కును కేంద్ర మంత్రి విడుదల చేశారు.  కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.రమేష్‌, పరిశ్రమల శాఖ జీఎం టి.మురళి, ఎల్‌డీఎం ఎస్‌.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయకుమార్‌, డీఎంహెచ్‌వో ఎ.హనుమంతరావు, హౌసింగ్‌ పీడీ బి.సుధాకర్‌ పట్నాయక్‌, సీపీవో పి త్రినాధ్‌, ఐసీడీఎస్‌ పీడీ కె ప్రవీణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:46:28+05:30 IST