ఏపీ రాజధానిపై రాజ్యసభ వేదికగా తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-02-02T17:43:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది...

ఏపీ రాజధానిపై రాజ్యసభ వేదికగా తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి తేల్చిచెప్పారు.


కాగా.. అమరావతినే నవ్యాంధ్ర రాజధానిగా కొనసాగించాలని గత కొన్ని నెలలుగా రాజధాని రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేసి తీరుతామని మొండిగా వెళ్తోంది. ఇవాళ మూడు రాజధానుల కేసులపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఉదయం పదిన్నర గంటలకు త్రిసభ్య ధర్మాసనం ముందు వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. గత వారం రైతులు వేసిన పిటిషన్లపై సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇవాళ ప్రభుత్వం సీఆర్‌డీఏ తరుపున వాదనలు జరగనున్నాయి.

Updated Date - 2022-02-02T17:43:07+05:30 IST