బీసీ జాబితాలోకి కులాలను చేర్చే అధికారం రాష్ట్రాలకూ ఉండాలి

ABN , First Publish Date - 2021-05-14T07:35:47+05:30 IST

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎ్‌సఈబీసీ) జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చే అధికారాన్ని రాష్ట్రాలకూ ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర....

బీసీ జాబితాలోకి కులాలను చేర్చే అధికారం రాష్ట్రాలకూ ఉండాలి

సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌

ప్రస్తుతం రాష్ట్రపతికే ఆ అధికారం

కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రకటన


న్యూఢిల్లీ, మే 13: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎ్‌సఈబీసీ) జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చే అధికారాన్ని రాష్ట్రాలకూ ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారం ఒక రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చే అధికారం ఒక్క రాష్ట్రపతికే ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈనెల 5న కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ ఏర్పాటుకు కేంద్రం తీసుకువచ్చిన 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.


విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్‌కు సంబంధించి ఎస్‌ఈబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుని సమీక్షించాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిందని కేంద్ర సామాజికన్యాయ, సాధికార మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. ఎస్‌ఈబీసీ జాబితాలో కొత్తగా కులాలను చేర్చే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడం సరికాదని కేంద్రం పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులు నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించారు. మరాఠాలకు రిజర్వేషన్‌ చట్టాన్ని కొట్టివేయడంతోపాటు, 1992నాటి మండల్‌ రిజర్వేషన్‌ తీర్పు, రిజర్వేషన్ల గరిష్ఠ కోటా 50 శాతానికి మించరాదన్న వంటి కీలక అంశాలపై ఏకీభావం వ్యక్తం చేశారు.


జస్టిస్‌ రవీంద్ర భట్‌ 132 పేజీలతో తీర్పుని వెలువరించగా, జస్టిస్‌  ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలు కూడా వేర్వేరు తీర్పులిచ్చారు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిన నేపథ్యంలో... ఎస్‌ఈబీసీ జాబితాలోకి రాష్ట్రాలు తమ ప్రాంతంలోని కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయి అన్న  జస్టిస్‌ భట్‌ వాదన, కారణాలతో జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ గుప్తాలు అంగీకరించారు. రాష్ట్రాలు తమ నియంత్రణలో ఉన్న యంత్రాంగాలు, చట్టబద్ధమైన కమిషన్ల ద్వారా ఎస్‌ఈబీసీ జాబితాలోకి ఏదైనా కులాన్ని చేర్చడానికి, తొలగించడానికి, లేదా మార్పులు చేయడానికి రాష్ట్రపతికి లేదా జాతీయ కమిషన్‌కు సూచనలు మాత్రమే చేయగలవని జస్టిస్‌ భట్‌ తన తీర్పులో పేర్కొన్నారు. ఎస్‌ఈబీసీలో ఏదైనా కులాన్ని చేర్చడం లేదా తొలగించడంపై రాష్ట్రాలకు ఎలాంటి హక్కు లేకుండా చేస్తూ మోదీ ప్రభుత్వమే 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఎస్‌ఈబీసీలోకి ఫలానా కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతికి విశేష అధికారం కల్పించడంతోపాటు, బీసీ జాబితాలోని కులాలను మార్చే అధికారం పార్లమెంట్‌కు దఖలుపరిచే 342ఏ ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టంలో పొందుపరిచింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్‌ వేసి రాష్ట్రాలకు ఎస్‌ఈబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారం ఉండాలని కోరడం గమనార్హం.

Updated Date - 2021-05-14T07:35:47+05:30 IST