నిధుల ఆశలపై నీళ్లు

ABN , First Publish Date - 2022-01-20T07:00:20+05:30 IST

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సాయం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన సొమ్ములో నవంబరు నాటికి 14.71 శాతం నిధులే అందాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం..

నిధుల ఆశలపై నీళ్లు

తెలంగాణకు తగ్గుతున్న కేంద్ర సాయం

అంచనా 38,669 కోట్లు

అందింది5,687కోట్లు

నవంబరు నాటికి విడుదలైంది 14.71% నిధులే

60.67% మేర సమకూరిన పన్ను రాబడులు

రూ.30,194 కోట్లు అప్పు చేసిన తెలంగాణ 

‘కాగ్‌’కు ఆర్థిక శాఖ నవంబరు నివేదిక


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సాయం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన సొమ్ములో నవంబరు నాటికి 14.71 శాతం నిధులే అందాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌, కాంట్రిబ్యూషన్ల రూపంలో రూ.10,525.36 కోట్లను అంచనా వేస్తే ఏకంగా రూ.15,471.13 కోట్లు వచ్చాయి. ఈసారి లెక్క మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.38,669.46 కోట్లను అంచనా వేయగా, నవంబరు నాటికి రూ.5,687.79 కోట్లే వచ్చాయి. ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’కు రాష్ట్ర ఆర్థిక శాఖ సమర్పించిన నవంబరు నెల ఆదాయ,వ్యయ వివరాల నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.


కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కేంద్ర సౌజన్య పథకాల (సీఎ్‌సఎస్‌) కింద అన్ని రాష్ట్రాలకు గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లను ఏటా విడుదల చేస్తుంటుంది. సీఎ్‌సఎ్‌సల జాబితాలో.. జాతీయ ఆరోగ్య మిషన్‌, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మిషన్‌, సర్వశిక్షా అభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్షా అభియాన్‌, రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షాఅభియాన్‌, మధ్యాహ్న భోజనం వంటివి ఉన్నాయి. ఈ సీఎ్‌సఎ్‌సల కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏటా కొంత వాటాను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక సంఘం చేసే సిఫారసుల మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్రం గ్రాంట్లను కేటాయిస్తుంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిధులనూ పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగర కార్పొరేషన్లకు విడుదల చేస్తుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదు.


గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రాష్ట్రానికి ఏప్రిల్‌లో రూ.258.48 కోట్లు, మేలో రూ.537.45 కోట్లు, జూన్‌లో రూ.2,703.67 కోట్లు, జూలైలో రూ.44.80 కోట్లు, ఆగస్టులో రూ.639.16 కోట్లు, సెప్టెంబరులో రూ.630.19 కోట్లు, అక్టోబరులో రూ.342.23 కోట్లు, నవంబరులో రూ.531.81 కోట్లే వచ్చాయి. మొత్తం అంచనా నిధులు రూ.38,669.46 కోట్లలో రూ.5,687.79 కోట్లే వచ్చాయి. మిగిలిన 4 నెలల్లో ఆశించిన స్థాయిలో నిధులు వస్తాయా అంటే సందేహమేనని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. నవంబరు నాటికి రాష్ట్రానికి రెవెన్యూ రాబడులు 42.55 శాతం మేర సమకూరాయి. పన్నులు, పన్నేతర రాబడి, కేంద్ర పన్నుల్లో వాటా, కాంట్రిబ్యూషన్లు, గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌లు అన్నీ కలిపి రూ.1,76,126.94 కోట్లు వస్తాయని అంచనా వేయగా నవంబరు నాటికి రూ.74,940.86 కోట్లే (42.55ు) సమకూరాయి. కాకపోతే ఈ రెవెన్యూ రాబడుల్లో పన్ను రాబడి కాస్త ఆశాజనకంగా ఉంది. జీఎ్‌సటీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సేల్స్‌ ట్యాక్స్‌, స్టేట్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర ట్యాక్సులు, సుంకాల కింద రూ.1,06,900.13 కోట్లను అంచనా వేయగా... నవంబరు నాటికి రూ.64,857.95 కోట్లు సమకూరాయి. అంటే 60.67 శాతం సమకూరినట్లయింది. ఇక నవంబరు నాటికి రూ.30,194.67 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Updated Date - 2022-01-20T07:00:20+05:30 IST