కేంద్రం విశ్వసనీయత కొడిగట్టింది: టీఎంసీ

ABN , First Publish Date - 2020-09-20T21:02:30+05:30 IST

ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొడిగట్టిందని తృణమూల్ కాంగ్రెస్..

కేంద్రం విశ్వసనీయత కొడిగట్టింది: టీఎంసీ

న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొడిగట్టిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ అన్నారు. వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన సూటిగా నిలదీశారు.


'రైతులను విపక్షాలు తప్పదారి పట్టిస్తున్నాయని మోదీ అంటున్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని మీరే (కేంద్రం) చెబుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే 2028 కంటే ముందు రైతుల ఆదాయం రెట్టింపు కాదు. మీ విశ్వసనీయత తగ్గింది. నేనూ చాలా పెద్ద ప్రసంగాలు చేయగలను' అంటూ కేంద్రంపై డెరిక్ ఒబ్రెయిన్ విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో 2011లో రైతుల ఆదాయం రూ.90,000 ఉండగా, ఇప్పుడు అది రూ.2,90,000 అయిందని ఆయన చెప్పారు. తమకు ఎవరూ లెక్చర్స్ ఇవ్వాల్సిన పని లేదన్నారు.


'మీరు పెద్ద నోట్ల రద్దుపై చాలా పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. జరిగిందేమిటి? మాకు చెప్పండి. డిజిటల్ ఇండియా గురించి మాట్లాడారు. జవాబు చెప్పడానికి మీ దగ్గర డాటా లేదు. 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం నిరుద్యోగిత ఉంది' అని ఒబ్రెయిన్ విమర్శించారు. ఆర్డినెన్సులు తెచ్చేముందు రాష్ట్రాలను సంప్రదించకుండా ఫూల్స్ చేస్తున్నారని, సహకార సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. పార్లమెంటులో ప్రతి నిబంధనకు తూట్లు పొడుస్తున్నారనీ,  ప్రజలు తెలుసుకునే అవకాశం లేకుడా ఆర్‌ఎస్‌టీవీ ఫీడ్‌‌కు కోత పెట్టారని, ఆర్‌ఎస్‌టీవీని సెన్సార్ చేశారనీ ఒబ్రెయిన్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2020-09-20T21:02:30+05:30 IST