Abn logo
Sep 26 2021 @ 23:55PM

రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి

ప్ల కార్డులు ప్రదర్శిస్తున్న తెలుగుదేశం నాయకులు

తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి డిమాండ్‌ చేశారు. సోమవారం బంద్‌కు మద్దతు తెలిపారు. పార్టీ కార్యాలయంలో  బంద్‌ విధి విధానాలపై చర్చించారు. కార్పొ రేట్‌ శక్తులకు లాభం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపును విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో భాగంగా తాడేపల్లిగూడెం హౌసింగ్‌ బోర్డు కాలనీ నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలి పారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూసివేసి బంద్‌కు సహకరించాలని విజ్ఝప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌, పట్టణ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు, రూరల్‌ అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, యువత అధ్యక్షుడు గంధం సతీష్‌,  నరసాపురం రైతు అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, నియోజక వర్గ రైతు అధ్యక్షుడు పీతల సత్యన్నారాయణ, యువత మండల అధ్యక్షుడు కండెల్లి సందీప్‌, మెరిపో సంతోష్‌, పొట్ల ఏడు కొండలు, ముప్పిడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి  బంద్‌ను జయప్రదం చేయాలి

భీమడోలు: భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలంటూ భీమడోలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆటో ప్రచార యాత్ర జరిగింది. భీమడోలు, గుండుగొలను, సూరప్పగూడెం, పూళ్ళ, పోలసానిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సీపీఎం నేత ఆర్‌. లింగరాజు, టీడీపీ నేత పుల్లయ్య, కౌలు రైతు సంఘం నాయకులు శ్రీరామచంద్రమూర్తి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

పెంటపాడు: ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం నిర్వహించే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం మండల కన్వీనర్‌ చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం పెంటపాడులో ఇంటింటికీ, దుకాణాలకు వెళ్లి  కరపత్రాలను అందజేశారు.  పెనగంటి దుర్గ, పూడి బాలాజీ, రాజేష్‌, సీతయ్య, సత్తి రమేష్‌రెడ్డి, సాయి, ఆంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు. బంద్‌లో మహిళలంతా పాల్గొనాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

తణుకు:  భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. గార రంగారావు, గుబ్బల గోపి, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.