బహిరంగ సభతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో గుబులు

ABN , First Publish Date - 2022-05-19T06:20:38+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో గుబులు పుట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. వేములవాడ రూరల్‌ మండలంలోని ఫాజుల్‌నగర్‌లో బూత్‌ కమటీల అధ్యక్షులు, సభ్యులతో బుధవారం సమావేశమయ్యారు.

బహిరంగ సభతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో గుబులు
సభ్యులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌


 - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌

 వేములవాడ రూరల్‌, మే 18: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో గుబులు పుట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. వేములవాడ రూరల్‌ మండలంలోని ఫాజుల్‌నగర్‌లో బూత్‌ కమటీల అధ్యక్షులు, సభ్యులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం బూత్‌ కమటీలకే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. సోషల్‌ మీడియాలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే  20 వేల పోలింగ్‌ బూత్‌ల కమిటీ అధ్యక్షులను నియమించామని, రాష్ట్రంలో పూర్తి స్తాయిలో కమిటీలను ప్రకటించాక బూత్‌ కమిటీ అధ్యక్షులను నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశ పరుస్తామని అన్నారు. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ సైకోలా మారారని, ప్రెస్‌ మీట్‌లు పెడుతూ ప్రధాన మంత్రి అనే కనీస గౌరవంలేకుండా అసభ్య పదజాలంతో మతి భ్రమించి మాట్లాతున్నారని అన్నారు.  త్వరలో  సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ ప్రవర్తనతో ‘సన్‌’ స్ట్రోక్‌ తాకనుందన్నారు. కల్వకుంట్ల కుటుంబసభ్యుల కబంద హస్తాల్లోనే కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు రావాల్సిన నిధుల కోసం ప్రగతిభవన్‌ వద్ద భిక్షమెత్తుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. కుటుంబ పాలనతో  శ్రీలంక తరహాలో  ఆర్థిక సంక్షోభం  ఏర్పడవద్దని దేవుడిని ప్రార్తిస్తున్నానన్నారు.  కేంద్రంలో, రాష్ర్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే డబల్‌ ఇంజన్‌ స్పీడుతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.  రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువ నీడలేని కుటుంబాలకు ఆవాస్‌ యోజన పథకంకింద ఇళ్ల్లు కట్టిస్తామన్నారు. ఫసల్‌ బీమా పథకం అమలు చేస్తామన్నారు. ప్రతీ సంవత్సరం   జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ఖాళీల భర్తీ చేపడతామని అన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ వ్యవసాయానికి విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రగల్బాలు పలుకుతూ గృహాల విద్యుత్‌ వినియోగ దారులపై చార్జీలు పెంచి   నడ్డి విరుస్తున్నారన్నారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ, బీజేపీ రాష్ట్ర  ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, ఎంపీపీ బండ మల్లేశం, బీజేపీ మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి నాయకులు గోపు బాలరాజు, సంతోష్‌, శ్రీనివాస్‌, బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు కోల కృష్ణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి అడ్డుపుల్ల 

 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసాధం పథకం కింద వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఉలుకూపలుకు లేదని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాదం పథకంలో చేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా  పట్టించుకోవడంలేదన్నారు.


ఎల్లమ్మ సిద్దోగానికి హాజరు

వేములవాడలోని ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న సిద్దోగంలో బండి సంజయ్‌ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలన్నారు.  వేములవాడ గౌడ కుల సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం గడ, పావనం కార్యకక్రమంలో  నృత్యం చేశారు.

Updated Date - 2022-05-19T06:20:38+05:30 IST