వారంతా ఎక్కడ?

ABN , First Publish Date - 2020-04-02T07:23:06+05:30 IST

నిజాముద్దీన్‌ జమాత్‌లో పాల్గొన్నవారు, వారి కుటుంబ సభ్యులందరినీ గుర్తించి క్వారంటైన్‌లో పెట్టాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన అమలుపై బుధవారం అన్ని

వారంతా ఎక్కడ?

  • యుద్ధ ప్రాతిపదికన గుర్తించండి
  • ఎక్కడెక్కడ తిరిగారో తేల్చండి
  • అన్ని రాష్ట్రాలకూ కేంద్ర సర్కారు ఆదేశం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): నిజాముద్దీన్‌ జమాత్‌లో పాల్గొన్నవారు, వారి కుటుంబ సభ్యులందరినీ గుర్తించి క్వారంటైన్‌లో పెట్టాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన అమలుపై బుధవారం అన్ని రాష్ట్రాల సీఎ్‌సలు, డీజీపీలతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తగ్లిబీ ప్రార్థనలకు ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరితో సన్నిహితంగా(కాంటాక్ట్‌) మెలిగారో యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని ఆదేశించారు. మర్కజ్‌లో పాల్గొన్న విదేశీయులు వీసా షరతులను ఉల్లంఘించారని, వారంతా ఎక్కడున్నా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జమాత్‌ నిర్వాహకులపైనా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన డబ్బులను వారం రోజుల్లో లబ్ధిదారులకు అందజేయాలన్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. నిత్యావసర సరుకుల ఉత్పత్తి, సరఫరా నిరాటంకంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. 


ఇది జాతీయ ట్రెండ్‌ కాదు

కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణం జమాత్‌ సమావేశమే తప్ప ఇది జాతీయ ట్రెండ్‌ను సూచించదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన 1800 మందిని తొమ్మిది ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. 20 వేల రైల్వే కోచ్‌లను 3.2 లక్షల కరోనా బెడ్లుగా మలుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా 47,951 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ సడలింపులను ఎక్కువగా ఇవ్వరాదని హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్నారు. తమ ఆదేశాలను పాటించాలని కోరారు. 


మర్కజ్‌ మసీదు ఖాళీ

మర్కజ్‌ నిజాముద్దీన్‌ను పోలీసులు పూర్తిగా ఖాళీ చేయించారు. 36 గంటల్లో 2361 మందిని అక్కడి నుంచి తరలించారు. తమిళనాడులో ఒక్కరోజులో 110 కొత్త కేసులు బయటపడగా... వీరిలో సుమారు వందమంది మర్కజ్‌ సమావేశాలకు హాజరై వచ్చిన వారే. ఇక... ఏపీలో దాదాపు కొత్త ‘పాజిటివ్‌’ కేసులన్నింటికీ ఢిల్లీ కనెక్షన్‌ ఉన్నట్లు తేలింది. జమాత్‌కు హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించే ప్రక్రియ దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి మర్కజ్‌కు హాజరైన వారిలో అత్యధికులు రైళ్లలోనే ప్రయాణించారు.  మార్చి 13 నుంచి 19 వ తేదీ మధ్య ఢిల్లీ నుంచి వెళ్లిన 5 రైళ్లలో ప్రయాణించిన వారి వివరాలను రైల్వే శాఖ నేరుగా రాష్ట్రాలకు ఇవ్వనుంది.  కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలకు తగ్లిబి జమాత్‌ సమావేశాలు తీవ్ర విఘాతం (బిగ్‌ డ్యామేజ్‌) కలిగించాయని జాతీయ మైనారిటీ కమిషన్‌ (ఎన్‌సీఎం) పేర్కొంది. 


ఖాళీకి ససేమిరా!

అర్ధరాత్రి అజిత్‌ డోబాల్‌ చర్చలు

‘కరోనా వ్యాపిస్తోంది. మర్కజ్‌లో వందలమంది ఒకే చోట బస చేశారు. ఇది ఎంతమాత్రం క్షేమం కాదు. వెంటనే ఖాళీ చేయించండి’.... అని పదేపదే కోరినా తగ్లీబ్‌ జమాత్‌  చీఫ్‌ మౌలానా సాద్‌ అంగీకరించలేదని తెలిసింది. చివరికి... జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ డోబాల్‌ రంగంలోకి దిగిన తర్వాతే అంగీకరిం చినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.  ఇండొనేషియా నుంచి మర్కజ్‌ సమావేశాలకు వచ్చిన పది మందికి మార్చి 18న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరు తెలంగాణలోని కరీంనగర్‌లో పర్యటిస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఢిల్లీ కనెక్షన్‌’పై కేంద్రం ఆరా తీసింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మర్కజ్‌ నిజాముద్దీన్‌లో  దాదాపు 1500 మంది ఉన్నట్లు గుర్తించి, అతి కష్టంమీద  వారిని ఖాళీ చేయించారు.


అజ్ఞాతంలో మౌలానా సాద్‌?

తగ్లీబ్‌ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ శనివారం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.  ఆయనతోపాటు తగ్లీబ్‌కు చెందిన మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ‘ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌, 1897తోపాటు ఐపీఎస్‌ సెక్షన్ల కింద  కేసు పెట్టారు. మార్చి 24న నోటీసు ఇచ్చినా కూడా మర్కజ్‌కు సందర్శకులు వస్తూనే ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-02T07:23:06+05:30 IST