పది లక్షల నియామకాలు...అవునా?

ABN , First Publish Date - 2022-06-18T05:59:43+05:30 IST

కేంద్రప్రభుత్వంలో పది లక్షల ఉద్యోగ నియామకాలు! విషమిస్తోన్న నిరుద్యోగ సమస్యపై మోదీ సర్కార్ ఎట్టకేలకు మేల్కొంది.

పది లక్షల నియామకాలు...అవునా?

కేంద్రప్రభుత్వంలో పది లక్షల ఉద్యోగ నియామకాలు! విషమిస్తోన్న నిరుద్యోగ సమస్యపై మోదీ సర్కార్ ఎట్టకేలకు మేల్కొంది. వివిధ ప్రభుత్వ విభాగాలలో పది లక్షల మందిని నియమించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. నిరుద్యోగ యువజనులకు ఊరటనిచ్చే నిర్ణయమిది, సందేహం లేదు. కొద్ది కుటుంబాలు మినహా ఉద్యోగరాహిత్యంతో ప్రభావితం కాని కుటుంబమేదైనా ఉందా? ముఖ్యంగా మహమ్మారి పీడించిన సంవత్సరం (2020–21), దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైన సంవత్సరం (2021–22) దేశం ఎదుర్కొన్న అతి పెద్ద ఆర్థిక సమస్య నిరుద్యోగమే.


2014 సార్వత్రక ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఏడాదికి రెండు కోట్లు చొప్పున కొత్త ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అనేక మంది సంశయించారు. అయితే మోదీ భక్తుల ఎడతెగని హర్షధ్వానాల హోరులో సంశయగ్రస్తుల ప్రశ్నలు ఎవరికీ విన్పించలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలే కాదు, ఇంకా వివిధ అసాధారణ హామీలు ఇచ్చారు. విదేశాల్లోని బ్యాంకుల్లో అక్రమంగా దాచుకున్న డబ్బును వెనక్కు తీసుకువచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తామని కూడా నరేంద్ర మోదీ గట్టిగా చెప్పారు. మోదీకి ఎందరో జేజేలు చెప్పారు. అయితే ఆయన ఇచ్చిన హమీల విషయమై సరైన లెక్కలు వేసిన వారు ఎవరైనా ఉన్నారా అనేది సందేహమే.


కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తరువాత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల విషయమై మాట్లాడినవారు ఎవరూ కనిపించ లేదు. అలాగే ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న వాగ్దానం కూడా పూర్తిగా విస్మరణకు గురయింది. మోదీ వాగ్దాన భంగాన్ని దేశ ప్రజలు అసాధారణంగా క్షమించేశారు. ఇక యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ పథకాలను పునరుద్ధరించి, పునః నామకరణం చేసి, అవి తమ సొంత పథకాలుగా చెప్పుకోవడంలో మోదీ సర్కార్ నిమగ్నమయింది. గ్రామీణ పేదలను విశేషంగా ఆదుకున్న ‘ఉపాధి హామీ పథకం’ (దీన్ని నరేంద్ర మోదీ ఎంతగా అధిక్షేపించారో గుర్తుందా?)ను మాత్రం యథాతథంగా కొనసాగించారు. ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాన్ని రూపొందించలేకనే విధిలేక ‘ఉపాధి హామీ’తో ముందుకు సాగారు.


నిరుద్యోగం పరిస్థితులు విషమిస్తూనే ఉన్నాయి. ఇంతకూ దేశంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగాన్ని గణించేందుకు రెండు ప్రాతిపదికలు ఉన్నాయి. ఒకటి – మొత్తం కార్మికులు (టోటల్ లేబర్ ఫోర్స్); రెండు– (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ – ఎల్ఎఫ్‌పిఆర్). మన దేశంలోని మొత్తం కార్మికులు 43కోట్లు. మొత్తం కార్మికులలో, ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటున్న వారి శాతం. ఇది, 2022 మేలో 42.13 శాతంగా ఉంది. అమెరికాలో అది 63 శాతంగా ఉంది. దీన్ని బట్టి మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో పలువురు అసలు ఉద్యోగాల కోసం అన్వేషించడమే మానుకున్నారని’ నిరుద్యోగంపై ఒక సర్వే నివేదిక వ్యాఖ్యానించింది. కుటుంబాల పరంగా నిరుద్యోగ సమస్య ఇలా ఉంది: ఒక్కరూ ఉద్యోగంలో లేని కుటుంబాలు 7.8 శాతం; ఉద్యోగంలో ఒక్కరు మాత్రమే ఉన్న కుటుంబాలు 68.0 శాతం; ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకు మించి ఉన్న కుటుంబాలు 24.2 శాతం. వేతనోద్యోగాలు ఉన్న వారు 20 శాతం మంది కాగా స్వయం ఉపాధి ఉన్నవారు 50 శాతం మంది అయితే మిగతా వారు దినసరి కూలీలు.. 2021 జూన్‌లో సిఎమ్ఐఇ నిర్వహించిన కన్జూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్ సర్వేలో కుటుంబ నెలసరి ఆదాయం రూ.15,000 కాగా వినియోగ వ్యయం రూ.11,000 అని వెల్లడయింది.


గత ఎనిమిదేళ్లలో అంటే మోదీ ప్రధానమంత్రి అయిన 2014 నుంచీ లక్షలాది ఉద్యోగాలు హుష్ కాకి అయిపోయాయి. కొత్తగా కొద్దిపాటి ఉద్యోగాలను మాత్రమే సృష్టించడం జరిగింది ఎల్ఎఫ్‌పిఆర్ తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది ప్రజలు హాహాకారాలు చేశారు. ప్రభుత్వం పట్టించుకుందా? లేదు. తప్పుడు గణాంకాలతో ఉద్యోగిత రేటు పెరిగిందని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించింది. ఒక దశలో పకోడీలు అమ్ముకోవడం కూడా ఒక ఉద్యోగమే అని వాదించింది. గత ఫిబ్రవరిలో నేను ఇదే కాలంలో ‘కళ్ల ముందే ఉద్యోగాలు దాగి ఉన్నాయి’ అని రాశాను. ప్రభుత్వ అధికార పత్రాల ప్రకారం ప్రభుత్వంలో 34,65,000 ఉద్యోగాలు ఉన్నాయి. 2020 మార్చి నాటికి 8,72,243 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో 7,56,146 గ్రూప్ సి ఉద్యోగాలు. సమాజంలో ప్రతీ సామాజిక వర్గమూ నిరుద్యోగ సమస్యకు గురయింది. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు. రాబోయే 18 నెలల్లో పది లక్షల మందిని వివిధ ప్రభుత్వ విభాగాలలో నియమించితే, అది శుభారంభమే. అయితే ఇప్పటికే గుర్తించిన ఉద్యోగాలకు నికర కూడిక (నెట్ అడిషన్) కేవలం 1,27,757 మాత్రమే (10,00,000 ఉద్యోగాల లోంచి 8,72,243 ఉద్యోగాలను తీసివేయగా మిగిలినవి).


నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వం ఇంకా ఎంతో చేయవలసి ఉంది. ‘గుర్తించవలసిన’ లేదా ‘కనుగొనాల్సిన’ లేదా సృష్టించాల్సిన’ ఉద్యోగాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఉపాధ్యాయులు, పరిశోధకులు, గ్రంథాలయ పాలకులు, స్పోర్ట్స్ కోచెస్, ట్రైనర్లు, ఫిజికో–థెరపిస్ట్‌లు, కౌన్సెలర్లు, డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, పారిశుధ్య కార్మికులు, పట్టణ ప్రణాళికా కర్తలు, ఆర్కిటెక్ట్స్, వ్యవసాయ విస్తరణ అధికారులు మొదలైన ఉద్యోగాలవి. ఇవన్నీ ఏ అభివృద్ధి చెందుతున్న దేశంలోనైనా ఆవశ్యక ఉద్యోగాలే. వీటిపై మోదీ ప్రభుత్వానికి సరైన అవగాహన ఉన్నట్టు కన్పించడం లేదు. ఈ ఉద్యోగాలలో అత్యధిక భాగం ప్రభుత్వ వ్యవస్థకు వెలుపల అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నవే అసంఖ్యాక ప్రజలు తమ అవసరాలు తీరక పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ అవసరాలను పాక్షికంగా తీర్చడమంటే లక్షలాది ఉద్యోగాలను సృష్టించడమే. ఉదాహరణకు వ్యక్తిగత రవాణా సదుపాయాలను తీసుకోండి. 24.7 శాతం కుటుంబాలకు సొంతకారు గానీ, మోటార్ సైకిల్ గానీ లేదు. 24 శాతం కుటుంబాలకు మాత్రమే ఎయిర్ కండిషనర్ లేదా ఎయిర్ కూలర్ ఉన్నది. ఈ ఆవశ్యక సరుకులు అన్నిటినీ భరించగల ధరలకు లక్షలాది కుటుంబాలకు అందుబాటులో ఉంచితే దేశంలో తయారీ రంగం సామర్థ్యం ఇతోధికంగా పెరుగుతుంది లక్షలాది ఉద్యోగాలు సృష్టి అవుతాయి. ప్రజల ఆదాయాలు పెరుగుతాయి.


ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించవలసి ఉంది. మోదీ సర్కార్ ఈ బాధ్యతను ఉపేక్షించింది. ఎనిమిది సంవత్సరాలను వృథా చేసింది. తన సామాజిక, రాజకీయ పరపతిని దేశ ప్రజల మధ్య విభేదాలను సృష్టించేందుకే వినియోగించింది. తప్పుడు విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోయింది పది లక్షల ఉద్యోగాలు ఉపశమనాన్ని కలిగించవు. ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేవు.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-06-18T05:59:43+05:30 IST