Abn logo
Sep 14 2021 @ 03:38AM

కేంద్ర చీఫ్‌ ఇంజనీర్లు వచ్చేశారు!

  • కృష్ణా, గోదావరి బోర్డులకు ఇద్దరేసి సీఈల నియామకం
  • కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు
  • చైర్మన్లకు రిపోర్టు చేయాలని ఆదేశం
  • వచ్చే నెల 14వ తేదీ నుంచి
  • బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు
  • జలశక్తి అధికారులతో చైర్మన్ల భేటీ
  • గెజిట్‌ అమలు సాధ్యాసాధ్యాలపై చర్చలు

న్యూఢిల్లీ/అమరావతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ వచ్చే నెల 14వ తేదీ నుంచి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య సంస్థల (కేఆర్‌ఎంబీ-జీఆర్‌ఎంబీ) పరిధిలోకి వెళ్లడం ఖరారైపోయింది. ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. ఒక్కో బోర్డుకు ఇద్దరేసి చీఫ్‌ ఇంజనీర్ల (సీఈలు) చొప్పున నలుగురిని నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకే దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరి బోర్డుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేసిన డా. ఎంకే సిన్హా, ఇదే కార్యాలయంలో (వైబీవో) చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జీకే అగర్వాల్‌ను నియమించగా.. కృష్ణా బోర్డుకు కోయంబత్తూర్‌లో సీడబ్ల్యూసీకి చెందిన కావేరీ-ఇతర దక్షిణాది నదుల సంస్థ (సీఅండ్‌ఎ్‌సఆర్‌వో) చీఫ్‌ ఇంజనీర్‌ టీకే శివరాజన్‌, లఖ్‌నవూలోని ఎగువ గంగా బేసిన్‌ సంస్థ (యూజీబీవో) చీఫ్‌ ఇంజనీర్‌ అనుపమ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. వీరు మూడు నెలలు లేదంటే తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు కొనసాగుతారు. తక్షణమే   బోర్డుల చైర్మన్లకు రిపోర్టు చేయాలని వీరిని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది.


రాష్ట్రాల వాదనకు ససేమిరా..

బోర్డుల పరిధిలోకి అన్ని ప్రాజెక్టులను చేర్చడంపైన, నిర్వహణకు రూ.400 కోట్లు ఇవ్వాలన్న నిర్ణయంపైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వ్యక్తంచేసిన అభ్యంతరాలను జలశక్తి శాఖ తోసిపుచ్చింది. ఆకస్మికంగా బోర్డుల పరిధిని నిర్ధారించారని.. ప్రాజెక్టులన్నీ బోర్డులు స్వాధీనం చేసుకోవడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలు రూ.400 కోట్లు చెల్లించడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తప్ప మిగిలిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, కాలువలు,  అక్విడెక్టులను రాష్ట్రాల అజమాయిషీలోనే ఉంచాలని ఏపీ డిమాండ్‌ చేసింది. ఈ వాదనలతో జలశక్తి శాఖ ఏకీభవించలేదు. పైగా రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి మానవ వనరుల అవసరంపై విశ్లేషించేందుకు.. రాష్ట్రాల నుంచి సిబ్బందిని రప్పించేందుకు, నియమించేందుకు వీలుగా జలసంఘం తరఫున సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి హోదా కలిగిన సీఈలను కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలకు కేటాయిస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కేంద్ర కార్యాలయాలు శని, ఆదివారాల్లో పనిచేయవు. అయినప్పటికీ వీరిని నియమిస్తూ జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశాలివ్వడం చూస్తే.. ప్రాజెక్టుల నియంత్రణను కేంద్రం ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థమవుతోందని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. ఇంకోవైపు.. గెజిట్‌ అమలు సాధ్యాసాధ్యాలు, ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వచ్చాక తీసుకోవలసిన చర్యలపై బోర్డుల చైర్మన్లు సోమవారం ఢిల్లీలో జలశక్తి శాఖ అధికారులతో చర్చించారు. ఆ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌, జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌, సంబంధిత అధికారులు  భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టులు, జలవివాదాలపై చర్చలు జరిగాయి. గెజిట్‌కు లోబడి ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏవిధమైన చర్యలు తీసుకోవాలన్న కోణంలో చర్చించినట్ల విశ్వసనీయంగా తెలిసింది.