కేంద్రాలు సరే.. కొనుగోళ్లేవి!

ABN , First Publish Date - 2022-05-12T06:05:25+05:30 IST

ప్రతి గింజనూ కొంటాం.. రైతును రాజు చేయడమే లక్ష్యం..

కేంద్రాలు సరే.. కొనుగోళ్లేవి!
ఆకాశం మబ్బు పట్టడంతో ధాన్యాన్ని కుప్పగాపోస్తున్న రైతు


  • ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సేకరణ మరచిన అధికారులు
  • అసాని తుఫాన్‌ భయంతో బిక్కుబిక్కుమంటున్న  రైతులు
  • కేంద్రాల వద్ద అన్నదాతల నిరీక్షణ
  • కేంద్రాలు తెరిచి 10 రోజులైనా కాంటావేయని కేంద్రం నిర్వాహకులు

ప్రతి గింజనూ  కొంటాం.. రైతును రాజు చేయడమే లక్ష్యం.. రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని  సభలు, సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే పాలకులు, అధికారులు అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో  నిర్లక్ష్యం చేస్తున్నారు.  ఆరుగాలం శ్రమించి పండించిన పంటను  అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మేడ్చల్‌ జిల్లాలో  కొనుగోలు కేంద్రాలు  ప్రారంభించి పది రోజులైనా  కొన్ని కేంద్రాల్లో ఇప్పటివరకూ వడ్ల సేకరణ చేపట్టలేదు.  అసాని తుఫాన్‌  ప్రభావంతో కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడుస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఘట్‌కేసర్‌, మే 11 : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు సేకరణను మరిచారు.  దీంతో  ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు అసాని తుఫాన్‌ భయపెడుతుండటంతో ఎప్పుడు  ఏం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.  కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఈనెల 2న జిల్లాలోని మేడ్చల్‌, శామీర్‌పేట్‌, మూడుచింతలపల్లి, కీసర, ఘట్‌కేసర్‌ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.  కేంద్రాలు ప్రారంభించి 10 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదు.  పలుచోట్ల రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసి నిరీక్షిస్తున్నారు.  ఘట్‌కేసర్‌ మండలంలోని ఏదులాబాద్‌ కొనుగోలు కేంద్రం వద్ద పెద్దఎత్తున ధాన్యం కుప్పలు ఉన్నాయి. ఇక్కడ హమాలీల కొరతతో ఇప్పటి వరకు గింజ ధాన్యాన్ని సేకరించిన పాపానపోలేదు. అలాగే మాదారం, ప్రతాపసింగారం గ్రామాల్లోనూ ఇదేపరిస్థితి నెలకొన్నది, శామీర్‌పేట్‌ మండలంలో 40 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. మేడ్చల్‌ మండలంలోనూ రెండు రోజులుగా కొనుగోళ్లు ప్రారంభించినా వడ్ల సేకరణ నత్తనడకన సాగుతోంది. కీసరలో ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు.  పలు మండలాల్లో రైతులు ధాన్యాన్ని తీసుకురావడం లేదంటున్న అధికారులు 10 రోజులుగా ఎదురుచూస్తున్న తమపరిస్థితి ఏమిటని ఏదులాబాద్‌ కేంద్రం వద్ద రైతులు ప్రశ్నిస్తున్నారు. 

తుఫాన్‌ ముప్పుతో ఆందోళన 

చేతికొచ్చిన పంటను రోడ్లపై పెట్టి నిత్యం ఎదురు చూస్తున్నామని పలువురు రైతులు వివరిస్తున్నారు. కాంటకు సిద్ధంగా ఉన్న ధాన్యం రెండురోజులుగా వర్షం కారణంగా కుప్పలు పోసి కవర్లు కప్పి ఉంచామని పేర్కొంటున్నారు. భారీ వర్షం కురిస్తే ధాన్యం మొత్తం తడుస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దళారులు దోచుకుంటున్నారని ఇక్కడికొస్తే..

ప్రైవేట్‌ వ్యాపారుల వద్దకు ధాన్యాన్ని తీసుకుపోతే క్వింటాల్‌కు రూ.1400 ఇస్తున్ననారని, గిట్టుబాటు కాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంరద్రాలకు తీసుకొస్తే ఇక్కడ పట్టించకునే వారే కరువయ్యారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం రోజున హంగామ చేసిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తుండటంతో ధాన్యం తేమశాతం తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారు.  ధాన్యం మాయిశ్చర్‌ తగ్గితే తిరిగి అకాల వానలతో  ఎండబెట్టడం సాధ్యం కాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముందుగానే హమాలీలను సిద్ధం చేసుకోకుండా తూతూమంత్రంగా కేంద్రాలను ప్రారంభించి చేతులెత్తేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆరు రోజుగా కాంటాకోసం ఎదురుచూస్తున్నా 

ధాన్యాన్ని తీసుకువచ్చి కాంటాకోసం ఎదురుచూస్తున్నా. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తరుచు చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షం కురిస్తే ధాన్యం కుప్పలు పోసిన ప్రాంతంలో నీరు నిలిచే ప్రమాదం ఉంది వెంటనే కాంట ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలి.

                                                                   -మధు, కౌలురైతు, అనంతారం 

పొలంలోనే మగ్గుతున్న ధాన్యం

కోతకోసి 10రోజులు అవుతోంది.  ధాన్యం కొనుగోలు కేందాన్ని మంత్రి ప్రారంభించినా ఇప్పటికీ అధికారులు కాంట పెట్టడం లేదు, ఏదులాబాద్‌ కొనుగోలు కేంద్రంలో వసతులులేకపోవడంతో ధాన్యాన్ని పొలంలోనే భద్ర  పరిచాను. చిరుజల్లులు కురుస్తున్నందున  త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. 

                                                                 -నర్సింహారెడ్డి, రైతు, చందుపట్లగూడ

వాతావరణం ఇబ్బందితో సేకరణ పనులు నిలిచాయి 

బుధవారం నుంచి ధాన్యం సేకరణ చేపట్టాల్సి ఉండగా చిరుజల్లులు కురవడంతో పనులు చేపట్టలేదు, రెండు రోజుల్లో మొత్తం ధాన్యాన్ని తూకం వేయడంతో వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈమేరకు రైతులకు టోకెన్లు అందజేశాం.

                                      - ఎంఏ భాసిత్‌ వ్యవసాయ శాఖ అధికారి ఘట్‌కేసర్‌ మండలం 

Read more