ఇదేం మద్దతు?

ABN , First Publish Date - 2020-06-05T11:01:22+05:30 IST

తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నరసింహులు. ఐదు ఎకరాల పొలం ఉంది. ఖరీఫ్‌లో ..

ఇదేం మద్దతు?

పంటలకు కేంద్రం మద్దతు ధర

పెదవి విరుస్తున్న రైతులు

నామ మాత్రపు పెంపేనని ఆవేదన

అమ్మినా.. సకాలంలో అందని సొమ్ము


కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 3: తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నరసింహులు. ఐదు ఎకరాల పొలం ఉంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేశారు. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆయిల్‌ఫెడ్‌కి అమ్మితే క్వింటానికి రూ.5,090 ఇస్తారని పత్తికొండ యార్డుకు వెళ్లాడు. నెల రోజులు తిప్పించుకుని.. విక్రయానికి అనుమతి ఇచ్చారు. డిసెంబరులో దిగుబడిని విక్రయించాడు. మే నెలలో డబ్బులు ఇచ్చారు. అదే వ్యాపారులకు అమ్మితే 15 రోజులకే డబ్బులు ఇచ్చేవారని, అధికారుల చుట్టూ నాలుగైదు నెలలు తిరిగితే కానీ డబ్బులు బ్యాంకులో పడలేదని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే మద్దతు ధర అని, అది అందుకోవాలంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని ఏకరువు పెడుతున్నాడు. క్వింటానికి రూ.6 వేలు ఇస్తేగానీ తమకు గిట్టుబాటు కాదన్నాడు. 


సాగు ఇలా..

జిల్లా వ్యాప్తంగా  రైతులు ఖరీఫ్‌లో 6.25 లక్షల హెక్టార్లు, రబీలో 3.50 లక్షల హెక్టార్లలో  వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కానీ తగిన మద్దతుధర ఇవ్వడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా ఆశించిన దిగుబడిలో సగం కూడా రావడం లేదు. మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతుసంఘాలు మండిపడుతున్నాయి. 


ఇదేం మద్దతు..?

కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం పంట దిగుబడులకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే పెంపు నామమాత్రంగా ఉందని రైతులు అంటున్నారు. ఏటా ఇలాగే నిరాశపరుస్తున్నారని అంటున్నారు. జిల్లాలో పత్తి, వేరుశనగ, వరి, మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి పంట విస్తీర్ణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది. దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో రెండున్నర లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వేరుశనగ 1.10 లక్షల హెక్టార్లు, వరి 70 వేల హెక్టార్లు, జొన్న 30 వేల హెక్టార్లు, కంది 60 వేల హెక్టార్లు, ఆముదం 14 వేల హెక్టార్లలో, మొక్కజొన్న 662 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.


పత్తికి కేంద్రం రూ.5,825 మద్దతు ధరను నిర్ణయించింది. గత సంవత్సరం రూ.5,550 ఉన్నింది. కేవలం రూ.275 మాత్రమే పెంచారు. స్వామినాథన్‌ కమిటీతో పాటు గత తెలుగుదేశం ప్రభుత్వం క్వింటానికి కనీసం రూ.7,000 నిర్ణయించాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ అత్తెసరు పెంపు చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. 


వరి సాధారణ రకం క్వింటానికి రూ.1868, ఏ గ్రేడ్‌ రకానికి రూ.1888 మద్దతు ధరగా నిర్ణయించారు. గత సంవత్సరం ధరతో పోలిస్తే కేవలం రూ.53 మాత్రమే పెంచారు. 


 మొక్కజొన్నకు క్వింటానికి రూ.1850 నిర్ణయించారు. గత సంవత్సరం కంటే రూ.90 పెంచారు. 


కందుల మద్దతు ధరను రూ.6 వేలకు పెంచారు. వేరుశనగ రూ.5,275గా నిర్ణయించారు. కేవలం రూ.185 పెంచారు. అన్ని పంటల పరిస్థితీ ఇంతే. క్వింటానికి రూ.53 నుంచి రూ.370 వరకూ మాత్రమే పెంచారు. కానీ పెట్టుబడి ఖర్చులు ఏడాదికి రూ.1000 నుంచి రూ.2,000 వరకూ పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.


నాలుగో వంతు రైతులకే..

కేంద్రం ప్రకటించిన మద్దతు ధరను అందుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. నిబంధనల ప్రకారం మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థలు రైతుల నుంచి దిగుబడులు కొంటున్నాయి. పంట దిగుబడిలో నాలుగోవంతు మాత్రమే కొంటామని వీరు అంటున్నారు. కొన్న తరువాత డబ్బులు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. డిసెంబరులో ఆయిల్‌ఫెడ్‌కి అమ్మితే.. వారం క్రితం డబ్బు చెల్లించారు. మార్క్‌ఫెడ్‌ సంస్థ రైతులకు రెండు నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదు. దాదాపు రూ.50 కోట్ల దాకా రైతులకు రావాల్సి ఉంది. మరోవైపు పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దళారులకు మద్దతు ధర అందుతోందని, తాము నిండా మునుగుతున్నామని రైతులు కంటతడి పెడుతున్నారు. 


కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర వివరాలు

పంట పేరు అంచనా వ్యయం మద్దతు ధర గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ధర

వరి ధాన్యం

సాధారణం 1245 1868 53

ఏ గ్రేడ్‌ -- 1888 53

జొన్నలు 1746 2620 70

సజ్జలు 1175 2150 150

రాగులు 2194 3295 145

మొక్కజొన్న 1213 1850 90

కందులు 3796 6000 200

పెసలు 4797 7196 146

మినుములు 3660 6000 300

వేరుశనగ 3515 5275 185

పత్తి 1500 5825 275

పొద్దుతిరుగుడు 3921 5885 235

సోయాబీన్‌ 2587 3880 170


అరకొరగా పెంచారు..శేఖర్‌, రైతు, పందిపాడు

పత్తికి రూ.7 వేలు ఇస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.5,825 మద్దతు ధరగా నిర్ణయించింది. ఇది ఏ మూలకూ సరిపోదు. కేంద్రం ప్రభుత్వం కంటి తుడుపుగా పెంచుతోంది. ఖర్చులను పరిశీలించి ధర నిర్ణయించినట్లుగా లేదు. ఇలాగైతే మేము బతికి బట్టకట్టేదెప్పుడు..?  

 

ఉత్తర్వులు రాలేదు..సత్యనారాయణ చౌదరి, ఏడీఎం, మార్కెటింగ్‌ శాఖ 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వివరాలు ఇంకా మాకు అందలేదు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉంది. రైతులు మద్దతు ధరపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మద్దతు ధరను నిర్ణయిస్తారు. అర్హులైన రైతులందరికీ మద్దతు ధరను అందించేందుకు చర్యలు తీసుకుంటాం.  

 

Updated Date - 2020-06-05T11:01:22+05:30 IST