ఉలకదు.. పలకదు!

ABN , First Publish Date - 2021-10-19T07:48:48+05:30 IST

పోలవరం ప్రాజెక్టు వ్యయం, తుది అంచనాలపై కేంద్రం పూర్తిగా మౌనం పాటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదు. కేంద్ర కేబినెట్‌ గతంలో ఆమోదించిన అంచనా వ్యయాన్ని మించి..

ఉలకదు.. పలకదు!

  • పోలవరంపై కేంద్రం మౌనం
  • రూ.1,658 కోట్ల బిల్లులు వెనక్కి
  • రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలు బేఖాతరు
  • 55,656 కోట్ల అంచనా ఊసెత్తదు
  • కీలక డిజైన్లు ఇంకా పెండింగ్‌లోనే
  • హస్తిన వెళ్లి ఒత్తిడి పెంచాలన్న సీఎం
  • మంత్రి బుగ్గన వినతులకే దిక్కులేదు
  • మేం వెళ్తే జలశక్తి శాఖ స్పందిస్తుందా?
  • జల వనరుల అధికారుల తర్జనభర్జన


పోలవరం తుది అంచనా వ్యయంపై కేంద్రం మొండికేస్తోంది. 2013-14 నాటి రూ.20,398 కోట్లకు మించి పైసా ఇచ్చేది లేదని భీష్మించుకుంది. తాను గీసిన గీతదాటి వచ్చిన బిల్లులను నిర్దయగా తిప్పికొడుతోంది. తుదకు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డిజైన్లను కూడా ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టేసింది. దీంతో చేసిన పనులకు బిల్లులు రీయింబర్స్‌ కాక.. సొంతంగా వేల కోట్లు ఖర్చుచేసే పరిస్థితి లేక.. సర్కారు మల్లగుల్లాలు పడుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు వ్యయం, తుది అంచనాలపై కేంద్రం పూర్తిగా మౌనం పాటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదు. కేంద్ర కేబినెట్‌ గతంలో ఆమోదించిన అంచనా వ్యయాన్ని మించి ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చుచేసినా ఇచ్చేది లేదని స్పష్టంచేస్తోంది. ఇందులో భాగంగానే రూ.1,658 కోట్ల బిల్లులను వెనక్కి పంపేసింది. ఇందులో హెడ్‌వర్క్స్‌ బిల్లులు 461.25 కోట్లు, కుడి, ఎడమ కాలువల బిల్లులు రూ.209.87 కోట్లు, భూసేకరణకు రూ.291.20 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.440.99 కోట్లు, పరిపాలనా వ్యయం కింద ఖర్చుచేసిన రూ.255.60 కోట్లు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) వీటిని కనీసం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు కూడా పంపకుండా.. తానే చూసి తిప్పిపంపింది. బిల్లులు ఆమోదించాలని రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి .. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన పీపీఏ-కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) బృందం తన అభిప్రాయాన్ని కేంద్రానికి చేరవేసింది. ఆ నివేదికపై జలశక్తి శాఖ ఇంతవరకు స్పందించలేదు.


ఇతర హామీల్లాగానే..

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన సమయంలో.. నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఇతర హామీల తరహాలోనే.. దీనినీ వదిలేసింది. ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని.. నిర్మాణ వ్యయాన్ని కమీషన్ల కోసమే అమాంతం రూ.55,548.87 కోట్లకు పెంచేశారంటూ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు గుప్పించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ అంచనా వ్యయాన్ని మరికొంత కలిపి రూ.56,548.87 కోట్లకు పెంచారు. కేంద్రం మాత్రం 2013-14 నాటి అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతున్నామని తేల్చిచెప్పింది. రూ.55,656.87 కోట్లకు పెంచితే తప్ప నిర్మాణం సాధ్యం కాదని సీఎం జగన్‌ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకే ఏకంగా రూ.33 వేల కోట్ల వ్యయమవుతుందన్నారు.


ఆ తర్వాత .. ఢిల్లీలో ప్రధానిని, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను  కలిశారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం సమావేశమయ్యాక.. అంచనా పెంపు ఫైలు ఆర్థిక శాఖకు చేరింది. ఆర్థిక శాఖ నియమించిన కమిటీ.. రూ.55,656.87 కోట్లను కుదించి రూ.47,725.74 కోట్లకు ఖరారుచేసింది. ఈ మొత్తానికి ఆమోదం తెలపాలని షెకావత్‌ కేంద్ర ఆర్థిక శాఖను కోరగా.. ఆ శాఖ ససేమిరా అంది. పోలవరం ప్రాజెక్టులో తాగునీటి సరఫరా పథకం కోసం వ్యయం చేసే రూ.4,400 కోట్లు ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా ఆర్థిక మంత్రి నిర్మల తోసిపుచ్చారు. ఈ ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లను మించి ఒక్క నయాపైసా అదనంగా చెల్లించాలన్నా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరని ఆయనకు స్పష్టం చేశారు. అన్నిటికీ మించి ప్రాజెక్టులో పలు కీలక డిజైన్లను కూడా ఇంకా ఆమోదించాల్సి ఉంది.


ఒత్తిడి పెంచాల్సిందే..

ప్రాజెక్టుపై ఈ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. కేంద్రం నిధులు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంపై  చర్చించారు. కేంద్రం తీరు చూశాక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తమంతా రాష్ట్రమే భరించాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు ఈ సందర్భంగా చెప్పినట్లు తెలిసింది. కాంట్రాక్టు సంస్థ కూడా బిల్లులు రావడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జల వనరులశాఖను జగన్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రీయింబర్స్‌మెంట్‌ కోసం జలశక్తి శాఖ ఉన్నతాధికారులను, కీలక డిజైన్ల ఆమోదం కోసం జలసంఘాన్ని కలిసేందుకు ఆ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తరచూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదని.. తాము వెళితే జలశక్తి శాఖ స్పందిస్తుందా అని వారు తర్జనభర్జన పడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ వెళ్లి రావాలని భావిస్తున్నారు.

Updated Date - 2021-10-19T07:48:48+05:30 IST