పరీక్షలు పెంచండి..

ABN , First Publish Date - 2021-02-28T09:24:26+05:30 IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరీక్షల సంఖ్య పెంచాలని, కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని

పరీక్షలు పెంచండి..

ఉల్లంఘనలపై కఠినంగా ఉండండి

కేసులు పెరుగుతున్న రాష్ట్రాలతో కేంద్రం సమీక్ష

తెలంగాణ సహా 8 రాష్ట్రాలకు ఏడు అంశాలతో కేంద్రం సూచనలు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరీక్షల సంఖ్య పెంచాలని, కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సహా ఏడు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. గత వారం రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ‌స్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్ము కశ్మీర్‌ (యూటీ)లలో పాజిటివ్‌లు అధికంగా వస్తున్న నేపథ్యంలో.. ఈ రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో శనివారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  సమావేశంలో.. కరోనా కట్టడి వ్యూహాలు, స్పందన చర్యలపై సమావేశంలో సమీక్షించారు. కరోనా ఉధృతికి కారణమయ్యే సూపర్‌ స్ర్పెడర్‌ ఈవెంట్లపై పటిష్ట నిఘా అవసరమని స్పష్టం చేశారు.


దీంతోపాటు ఏడు సూచనలు చేశారు. అవేంటంటే.. 1) పరీక్షలు తక్కువగా చేస్తున్న జిల్లాల్లో సంఖ్యను పెంచాలి. 2) యాంటీజెన్‌ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నచోట.. వాటి స్థానంలో పెద్దఎత్తున ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలి. 3) పరీక్షలు తక్కువగా చేస్తున్న/పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉన్న, కేసులు పెరుగుతున్న జిల్లాల్లో పరిశీలన, కఠిన కట్టడి చర్యలపై దృష్టిపెట్టాలి. 4) స్ట్రెయిన్‌ మ్యుటేషన్‌ తీరును గమనిస్తూ, అధిక కేసులు వస్తున్న ప్రాంతాలను గుర్తిస్తూ.. హాట్‌స్పాట్‌లుగా మారకుండా చర్యలు తీసుకోవాలి. 5) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నచోట వైద్య వసతులపై దృష్టిసారించాలి. 6) కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో టీకా పంపిణీని వేగిరం చేయాలి. 7) టీకా పంపిణీ మరో దశకు వెళ్తున్న నేపథ్యంలో.. కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలి.


దేశంలో శుక్రవారం 16,488 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో కేసులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలో పాజిటివ్‌లు మళ్లీ 8 వేలను మించాయి. ఈ రాష్ట్రంలో 36 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో వైరస్‌ ఉధృతి నెలకొంది. 


సూపర్‌ స్ర్పెడర్‌ ఈవెంట్లే కారణం

మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు కరోనా కొత్త వేరియంట్లు కారణం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సూపర్‌ స్ర్పెడర్‌ ఈవెంట్లతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కరోనా జన్యు విశ్లేషణపై కర్ణాటక ప్రభుత్వానికి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ వి.రవి విశ్లేషించారు. ట్రాకింగ్‌ కొరవడటం, పరీక్షలు తక్కువగా చేయడం కూడా మరో కారణమని స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-28T09:24:26+05:30 IST