కేంద్రం కీలక నిర్ణయం..కోల్‌కతా పోర్ట్‌ ట్రస్టు పేరు మార్పు

ABN , First Publish Date - 2020-06-04T00:44:25+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టుగా..

కేంద్రం కీలక నిర్ణయం..కోల్‌కతా పోర్ట్‌ ట్రస్టు పేరు మార్పు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టుగా మార్చింది. ఈ మేరకు పేరు మార్పును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారంనాడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ మీడియా ముందు ప్రకటించారు. గత జనవరిలోనే కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరు మార్పు అంశం ప్రధాని మోదీ సమక్షంలో ప్రస్తావనకు వచ్చింది. ఎట్టకేలకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకున్నారు.


కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అధికారకంగా ఆరు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో మూడు నిర్ణయాలు వ్యవసాయ రంగానికి చెందినవే కావడం విశేషం. రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఏ రాష్ట్ర రైతు అయినా తమ పంటకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ లభిస్తుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించింది. అలాగే భారత్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీల సాధికారతా గ్రూపు (ఈజీఓఎస్) ప్రాజెక్ట్ డవలప్‌మెంట్ సెల్స్ (పీడీసీఎస్) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Updated Date - 2020-06-04T00:44:25+05:30 IST