కేంద్రం ఇచ్చింది గుండు సున్నా!

ABN , First Publish Date - 2021-03-07T07:26:54+05:30 IST

‘‘సీఎం కేసీఆర్‌ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారికి చెబుతున్నం. సీఎంలనే ఉరికించిన చరిత్ర మాకుంది.

కేంద్రం ఇచ్చింది గుండు సున్నా!

  • ఆరేళ్లలో ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు
  • ఏం మొహం పెట్టుకొని ఓట్లడుగుతరు?
  • విశాఖ ఉక్కుని ఊడగొట్టినోళ్లు బయ్యారంలో కొత్తది కడతరా?
  • కేసీఆర్‌తో పెట్టుకున్నోడు బాగు పడలేదు
  • సీఎంలనే ఉరికించిన చరిత్ర మాది
  • సమయం వస్తే వడ్డీతో లెక్క చెబుతం
  • బజ్జీల ఉపాధీ మోదీ ఖాతాలో వేసుకున్రు
  • త్వరలో 50 వేల పోస్టులు భర్తీ చేస్తాం
  • కోడ్‌ ముగియగానే నోటిఫికేషన్‌ జారీ 
  • టీఆర్‌ఎస్‌ విద్యార్థి సమావేశంలో కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం కేసీఆర్‌ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారికి చెబుతున్నం. సీఎంలనే ఉరికించిన చరిత్ర మాకుంది. మీ లాంటి బఫూన్లను ఉరికించడం పెద్ద లెక్క కాదు. టైం వస్తది. బరాబర్‌ మిత్తితో సహా వాపస్‌ ఇస్తం’’ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. చరిత్రలో కేసీఆర్‌తో పెట్టుకున్న వాళ్లు ఒక్కరూ బాగుపడలేదని, పెద్ద పెద్దోళ్లే ఖతమయ్యారని వ్యాఖ్యానించారు. ఆయనపై మొరిగే కుక్కల లెక్కలూ తమ దగ్గర ఉన్నయని, వారిది కేసీఆర్‌ స్థాయి కాదని.. తామే సరిపోతామని చెప్పారు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క సంస్థనూ మంజూరు చేయని బీజేపీ.. ఏ ముఖం పెట్టుకుని విద్యార్థులను ఓటు అడుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి సంఘం విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు దశాబ్దాల కిందట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్‌ వ్యూహ రచన చేస్తున్నప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలని గుర్తు చేశారు.


అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలోనూ బలమైన పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని, తెలంగాణ ప్రజల్లోనూ ఒక అపనమ్మకమూ ఉండేదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌కు ధన, కుల బలం లేకున్నా ఒక్కడుగానే బయలుదేరాడన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసి బలమైన నమ్మకం ఏర్పరచడం కోసం కేసీఆర్‌ తన డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు, టీడీపీకి రాజీనామా చేశారని చెప్పారు. ఎత్తిన తెలంగాణ జెండా దించితే.. తెలంగాణ వచ్చే వరకూ నాయకత్వం వహించకుంటే రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అన్నారు. వస్తదా అన్న దగ్గరి నుంచి వచ్చింది అనే వరకు తెలంగాణవాదాన్ని నిలబెట్టింది కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమంతో నామమాత్రంగా కూడా సంబంధం లేని వాళ్లు కూడా కేసీఆర్‌ మౌనంగా ఉన్నాడంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ‘‘గోడకు వేలాడేసిన తుపాకి సైలెంట్‌గనే ఉంటది. మాట్లాడాల్సి వస్తే.. ఉద్యమ సమయంలో ఎవరెవరిని తన మాటలతో కేసీఆర్‌ ఎలా చీల్చి చెండాడాడో మీకే తెలుసు. దిమ్మ తిరిగే సమాధానం చెప్పే సత్తా విదార్థి లోకానికీ ఉంది’’ అన్నారు. అబద్దాలు చెప్పడంలో బీజేపీ వాళ్లు గోబెల్స్‌కు తాతలని, వాట్సాప్‌ వర్శిటీలో చదువుకున్న బీజేపీ విద్యార్థి సంఘాలు ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటాయని, వారికేమీ తెలియదని వ్యాఖ్యానించారు.


మనం ఏం చేశామో ప్రజలకు చెబుదాం! 

ఆరున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేసిందన్నదానిపై టీఆర్‌ఎ్‌సవీ సభ్యులందరికీ సమాచారం ఇస్తానని, దాన్ని కింది వరకూ పంపాలని కేటీఆర్‌ సూచించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో 298 గురుకుల పాఠశాలలుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 672 ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు 134 ఎస్సీ గురుకులాలుంటే తాము 104 కొత్త గురుకులను ప్రారంభించామన్నారు. ఎస్సీల కోసం 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీల కోసం 22 డిగ్రీ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఆరేళ్లలో 62 గిరిజన గురుకులాలు పెట్టామన్నారు. మైనారిటీ గురుకులాలు గతంలో 12 ఉండగా, కొత్తగా 192 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీసీలకు కొత్తగా 261 గురుకులాలు పెట్టామని, మరో 240 నిర్మాణంలో ఉన్నాయన్నారు. 53 డిగ్రీ, 11 పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆరేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 12,800 కోట్లు చెల్లించామని తెలిపారు. ‘‘టీఆర్‌ఎ్‌సపై ఇంతగా మాట్లాడే బీజేపీ సన్నాసులు.. రాష్ట్రానికి ఆరేళ్లలో కేంద్రం ఏం చేసిందో చెప్పాలి’’ అని నిలదీశారు. దేశంలో కొత్తగా 5 ఐఐఎంలు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అన్నారు. 16 ట్రిపుల్‌ ఐటీల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని చెప్పారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ను నెల్లూరుకు తీసుకెళ్లారన్నారు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదని, 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు సున్న పెట్టారని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పెట్టిన గిరిజన వర్శిటీకి ఎక్కడ కావాలంటే అక్కడ జాగా ఇస్తామన్నా ఇంతవరకు అడుగు ముందుకు పడలేదని ప్రస్తావించారు. ‘‘ఐటీఐఆర్‌ వద్దు. కోచ్‌ ఫ్యాక్టరీ రద్దు. ఆంధ్రుల హక్కంటూ వారు తెచ్చుకున్న విశాఖ ఉక్కునే ఊడగొట్టిన్రు. ఇక బయ్యారంలో కొత్తది కడతరా? ఒక్కటంటే ఒక్కటి మంజూరు చేయని బీజేపీ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు ఉందా?’’ అని ప్రశ్నించారు. ఆరున్నరేళ్లలో 1.33 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా తాను లెక్కలు చెప్పగానే విమర్శించే వాళ్ల నోళ్లు మూతలు పడ్డాయన్నారు. ఎన్నికల కోడ్‌ అయిపోగానే 50 వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్‌ కూడా రాబోతుందని పునరుద్ఘాటించారు.


ధన్‌ ధన్‌ పంద్రాలాక్‌ పడ్డాయా? 

అందరు జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే.. రూ. 15 లక్షల చొప్పున ధన్‌ధన్‌మని ఇచ్చేస్తానంటూ ఎన్నికలప్పుడు ప్రధాని మోదీ అన్నారని, ఎంత మందికి వచ్చాయో చెప్పాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయంటే పకోడీలు వేయడమూ ఉద్యోగమే అన్నట్లుగా ప్రధాని మాట్లాడారన్నారు. బాత్‌ కరోడోమే.. కామ్‌ పకోడా అన్నట్లుగా మోదీ తీరు ఉందని చెప్పారు. బజ్జీలు, ఐస్‌క్రీంలు అమ్ముకుంటూ ఆత్మగౌరవంతో బతుకుడు గొప్పతనమేనని, ఆ ఉద్యోగాలనూ తానే పుట్టించానంటూ ప్రధాని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ రద్దు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ పెట్టని మాట, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టడం లేదంటూ లేఖ ఇచ్చిన మాటల్లో ఏది వాస్తవం కాదో బీజేపీ నేతలు చెప్పాలన్నారు.


ఒకటే ఓటేద్దాం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే ఒక.. మొదటి ప్రాధాన్య ఓటును టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వేసి గెలిపించుకుందామని, ఆ బాధ్యతా టీఆర్‌ఎ్‌సవీదేనని కేటీఆర్‌ అన్నారు. గతంలో టీఆర్‌ఎ్‌సవీలో పని చేసిన ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


అలా అయితే మనమెంత నీల్గాలి? 

‘‘దుబ్బాకలో చావుదప్పి కన్ను లొట్టపోయినట్లు 500 ఓట్లతో గెలిచారు. జీహెచ్‌ఎంసీలోనూ మనమే నెంబర్‌ వన్‌. మనకు 56 వస్తే.. వారికి 48 సీట్లు వచ్చినయి. దీనికే వాళ్లు ఆగుతలేరు. అట్లయితే 32 జిల్లా పరిషత్తులు మనం గెలిచినం. రెండు సార్లు శాసనసభ ఎన్నికల్లోనూ గెలిచాము. 122 మున్సిపాలిటీల్లోనూ గెలిచినం. రెండింటికే వారు అంత నీల్గితే.. ఇన్ని గెలిచిన మనం ఎంత నీల్గాలి?’’ అని  కేటీఆర్‌ అన్నారు. 

Updated Date - 2021-03-07T07:26:54+05:30 IST