
హైదరాబాద్: తెలంగాణాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం తీరుపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రం అబద్ధాలు చెబుతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం గోబెల్స్ ప్రచారానికి దిగిందని ఆయన ఆరోపించారు. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్సభ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ పార్లమెంట్లో చెప్పడం బాధాకరమన్నారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిందని ఆయన తెలిపారు. అయినా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి