కేంద్రం నిధులు కేసీఆర్‌ ఖాతాలోకి

ABN , First Publish Date - 2022-05-09T09:46:09+05:30 IST

‘‘నేను మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తడంట కేసీఆర్‌, కానీ నేను ఆయన చావును కోరుకోవడం లేదు.

కేంద్రం నిధులు కేసీఆర్‌ ఖాతాలోకి

బీజేపీ వస్తే అన్ని వర్గాలకూ మేలు: సంజయ్‌

బాదేపల్లి/మహబూబ్‌నగర్‌, మే 8: ‘‘నేను మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తడంట కేసీఆర్‌, కానీ నేను ఆయన చావును కోరుకోవడం లేదు. ఆయన నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుంటున్నా’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 25వ రోజు ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో కొనసాగింది. కోడ్గల్‌ గ్రామంలో రాత్రి రచ్చబండ నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ మాట్లాడారు. ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నారని, దీంతోపాటు గ్రామ పంచాయతీలకు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తున్నారని అన్నారు. ఆ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన  ఖాతాలో జమచేసుకుంటున్నారని ఆరోపించారు. మోదీ నిధులు ఇచ్చినా, పంచేవాడు మనవాడు కాకుంటే లబ్ధిదారులకు అవి ఎలా చేరతాయని ఆయన ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారని చెప్పారు. గజ్వేల్‌ నుంచి ఇక్కడికి వచ్చి, దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


300 కి.మీ మైలురాయి దాటిన పాదయాత్ర

బండి సంజయ్‌ చేపట్టిన రెండోదశ ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం 300 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఏప్రిల్‌ 14న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మొదలయిన ఆయన పాదయాత్ర అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో కొనసాగింది. జడ్చర్ల సమీపంలోని గంగాపురం వద్దకు చేరుకునే సరికి 300 కిలోమీటర్లు పూర్తవడంతో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. సంజయ్‌తో 300 కిలోల కేక్‌ కోయించారు. ప్రజల ఆశీర్వాదంతోనే మండుటెండలో సైతం యాత్ర చేయగలిగానని సంజయ్‌ చెప్పారు. 

Read more