డల్‌నెస్‌ కేంద్రం

ABN , First Publish Date - 2022-05-20T05:35:22+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు, పెన్షన్‌దారులకు వైద్య సేవలందించేందుకు ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ కేంద్రాలు డల్‌నెస్‌ కేంద్రాలుగా మారాయి.

డల్‌నెస్‌ కేంద్రం

- స్పెషలిస్టు వైద్యులుండరు...

- అవసరమైన మందులుండవు 

- ఉద్యోగులకు, జర్నలిస్టులకు అందని వైద్యం 

- నిరుపయోగంగా వెల్‌నెస్‌ కేంద్రాలు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు, పెన్షన్‌దారులకు వైద్య సేవలందించేందుకు ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ కేంద్రాలు డల్‌నెస్‌ కేంద్రాలుగా మారాయి. ఉద్యోగులను, జర్నలిస్టులకు ప్రత్యేకంగా నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలో సాధారణ చికిత్సలందించే డాక్టర్లే తప్ప స్పెషలిస్టులనేవారు లేకుండా పోయారు. రిటైర్డు ఉద్యోగులు, వయసుమీరిన వారు, కార్డియో, న్యూరో తదితర సమస్యలతో చికిత్స పొందేవారే అధికంగా ఉండగా ఆయా విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు లేక పోవడంతో అందరూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది. 


 నామమాత్రంగా వైద్య సలహాలు


నిమ్స్‌ ఆసుపత్రిలో రోగులకు అందించే మందులే ఈ వెల్‌నెస్‌ సెంటర్లలో అందిస్తున్నామని చెబుతున్నా ఏ మందులు అందుబాటులో ఉండక ప్రైవేట్‌లోనే కొనుక్కోవలసి వచ్చి వెల్‌నెస్‌ సెంటర్‌ నామమాత్ర వైద్య సలహాకేంద్రంగా మారిపోయింది.  రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిలో అన్ని జిల్లా కేంద్రాల్లో మాదిరిగానే వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2018 మే 28న ఆనాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడి వెల్‌నెస్‌ సెంటర్‌లో ముగ్గురు ఎంబీబీఎస్‌ డాక్టర్లు, మరో ముగ్గురు డెంటల్‌ డాక్టర్లు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు ఫార్మాసిస్టులు, ఇద్దరు ఫిజియో థెరఫిస్టులు, ఇద్దరు నర్సులు, నలుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందించాల్సిన వెల్‌నెస్‌ కేంద్రంలో స్పెషలిస్టు డాక్టర్లే లేకుండా పోయారు. ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డు ఉద్యోగుల్లో చాలా మంది వారి వారి ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా బీపీ, షుగర్‌, గుండె, న్యూరో సంబంధమైన వ్యాధులకు గురవుతూ చికిత్సపొందుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈ సెంటర్‌లో పార్ట్‌టైం కార్డియాలజిస్టును నియమించారు. ఈయన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలందించేవారు. ఐదు నెలలు పని చేసిన ఆయన ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత ఈ కేంద్రానికి స్పెషలిస్టు డాక్టర్‌ అనేవారే లేకుండా పోయారు. ప్రతి వెల్‌నెస్‌ సెంటర్‌లో కార్డియాలజీ, ఆర్థో, న్యూరో తదితర స్పెషలిస్టులను కాంట్రాక్టులోగానీ, పార్ట్‌టైం పనిచేసే వారినిగానీ నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. గతంలో అన్ని రకాల పరీక్షల కోసం రక్త, మూత్రం సేకరించి సిద్దిపేట ఆసుపత్రికి పంపించేవారు. ఇటీవల తెలంగాణ డయాగ్నిస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటుతో ఇక్కడే ఉన్న టీహబ్‌కు షాంపిళ్లను పంపించి రిపోర్టులు తెప్పిస్తున్నారు. ఇది కొంతలో కొంత మెరుగ్గా ఉంది. గతంలో రిపోర్టులు రావడానికి ఐదు రోజుల నుంచి వారంరోజులు పట్టేది. ఇప్పుడు రిపోర్టులు సకాలంలోనే వస్తున్నా చికిత్సను అందించే డాక్టర్లుగానీ, రోగానికి అవసరమైన మందులుగానీ లేక పోవడంతో పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్ళడమెందుకనీ అందరూ ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనితో వెల్‌నెస్‌ సెంటర్లు అలంకార ప్రాయంగా మారి 10 మంది ఉద్యోగులకు ఉపాధికల్పించేవిగా మారిపోయాయి. వేలాది మంది ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, జర్నలిస్టులు వారి కుటుంబసభ్యులు ఉచిత చికిత్స అందుబాటులోలేక ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. 


 నిరుపయోగంగా హెల్త్‌కార్డులు


ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఈజెహెచ్‌ఎస్‌ పథకం కింద ఇచ్చిన హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదనే కారణంగా వాటిపై చికిత్సనందించడానికి నిరాకరిస్తున్నారు. ఆఖరుకు ఈ వెల్‌నెస్‌ సెంటర్లలో చూపించుకొని ఉచితంగా మందులు పొందుదామన్నా ఈ పరిస్థితి లేకుండా పోయింది.  హెల్త్‌కార్డులకు ఫోన్‌ నంబర్లను లింక్‌ చేయాలని, అలా లింక్‌ చేయని కార్డులకు వైద్యసేవలు అందుబాటులో ఉండవని చెబుతున్నారు. వెల్‌నెస్‌ సెంటర్లలో ఈ మేరకు నోటీసు అంటించి చేతులు దులుపుకున్నారే తప్ప ఈ సెంటర్లకు వచ్చే ఉద్యోగ, జర్నలిస్టులకు ఆ సమాచారం అందించలేదు. దీంతో అనారోగ్యంతో  వెల్‌నెస్‌ సెంటర్‌కు వచ్చిన వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. మిగతావారికి సమాచారం లేక వైద్యసేవలు పొందలేని పరిస్థితి ఏర్పడింది.


  మంత్రి హామీ ఇచ్చినా..


ఇటీవల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినా అది ఇప్పటికీ ఆచరణ రూపం దాల్చలేదు. నామమాత్రంగా వెల్‌నెస్‌ సెంటర్లను నిర్వహించడం కాకుండా వీటికి పూర్తిస్థాయి ఆసుపత్రులుగా మార్చి స్పెషలిస్టు వైద్యులను, రోగనిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే యంత్రాలను, అన్ని రకాల మందులను, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జర్నలిస్టులు, ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు కోరుతున్నారు. అవసరమైతే హెల్త్‌కార్డుల కోసం తమవంతుగా కొంత సొమ్మును చెల్లించి ఆరోగ్య బీమా పొందేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా సంఘాల నాయకులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.   జర్నలిస్టులు చెల్లించే వాటా సొమ్మును తీసుకొని హెల్త్‌కార్డులు జారీ చేసిన రోజుల్లో అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా వైద్యసేవలు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. జర్నలిస్టులతోపాటు ఉద్యోగులు కూడా హెల్త్‌కార్డులు పొందేందుకు తమవంతు అవసరమైన సొమ్ము చెల్లిస్తామని ముందుకు వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. వెల్‌నెస్‌ సెంటర్లను అవసరమైన రీతిలో తీర్చిదిద్ది చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోకుండా ఉండడంతో ఉద్యోగ, జర్నలిస్టు వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెల్‌నెస్‌ సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్యోగ, జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.

Updated Date - 2022-05-20T05:35:22+05:30 IST