సోమశిల-సిద్దేశ్వరం వంతెనతో మహార్దశ

ABN , First Publish Date - 2020-10-28T10:40:56+05:30 IST

సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలుపడంతో పాటు కొత్తగా జాతీయ రహదారిని కూడా నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వాసుల్లో ఆశలు

సోమశిల-సిద్దేశ్వరం వంతెనతో మహార్దశ

కొత్త జాతీయ రహదారి నిర్మాణంతో దక్షిణాది రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం

వెనుకబడిన నాగర్‌కర్నూల్‌ జిల్లా అభివృద్ది చెందే అవకాశం


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలుపడంతో పాటు కొత్తగా జాతీయ రహదారిని కూడా నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణం కోసం రెండు దశాబ్దాలుగా వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం ప్రధాన ఎన్నికల నినాదంగా మారిన విషయం కూడా తెలిసిందే


దక్షిణాది రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం: సోమశిల-సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి ఏర్పాటుతో దక్షిణాది రాష్ట్రాల మధ్య దూరం తగ్గనుంది. ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన ప్రజలపైనా, అక్కడి పారిశ్రామిక ఉత్పత్తుల వ్యయంపైనా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా సిద్ధం చేసిన నివేదిక ప్రకారం కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్‌ మీదుగా కొల్లాపూర్‌, సోమశిల-సిద్దేశ్వరం వంతెన మీదుగా కర్నూల్‌ జిల్లా నంద్యాల మండలం కర్వేనా వరకు 122 కిలో మీటర్ల మేర జాతీయ రహదారిని నిర్మించనున్నారు. దీని వల్ల హైదరాబాద్‌ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి దాదాపు 30కిలో మీటర్ల దూరం తగ్గనుంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారిలో అంతర్భాగంగా ఉన్న నేషనల్‌ హైవే నంబరు 44లో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు ఈ జాతీయ రహదారితో తొలగిపోనున్నాయి.


తప్పనున్న పుట్టి ప్రయాణం: సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణంతో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానది తీర ప్రాంతాల ప్రజలకు పుట్టి ప్రయాణం తప్పనుంది. 2007 జనవరి 18న కొల్లాపూర్‌ మండలం మంచాలకట్ట వద్ద మరబోటు మునిగి 61 మంది జల సమాధి అయిన విషయం తెలిసిందే. దాంతో సోమశిల-సిద్దేశ్వరం కొండల మధ్య నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి 2009లో పునాది రాయి వేశారు. టెండర్లు పిలిచినా, అనేక కారణాలతో ఒక్క అంగుళం పని కూడా ముందుకు కదలలేదు. వంతెన, కొత్త జాతీయ రహదారి విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదం వంతెనకు ఆటంకం కలుగకుండా ఉంటే తమ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని జనం పేర్కొంటుండగా, కొత్త జాతీయ రహదారి ఏర్పాటు అంశాన్ని సొమ్ము చేసుకోడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రంగంలోకి దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

Updated Date - 2020-10-28T10:40:56+05:30 IST