అప్పుల తప్పులతో ఉక్కిరిబిక్కిరి!

ABN , First Publish Date - 2022-05-05T08:16:39+05:30 IST

‘పొలిటికల్‌ బాస్‌’లను ప్రసన్నం చేసుకోవడానికి ‘తప్పులు చేస్తున్న’ అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అప్పుల కోసం తప్పుడు లెక్కలు సమర్పించి,

అప్పుల తప్పులతో  ఉక్కిరిబిక్కిరి!

అధికారులూ జాగ్రత్త.. తేడా వస్తే తిప్పలే

‘అఖిల భారత’ అధికారులకు కేంద్రం హెచ్చరిక

అప్పుల కోసం కేంద్రానికి అబద్ధాలు చెబుతున్నారు

అడ్డగోలుగా తప్పుడు నివేదికలు పంపుతున్నారు

అడ్డదారుల్లో అధిక అప్పులు సరికాదు

తప్పుడు నివేదికలు పంపితే తీవ్ర చర్యలు

డీవోపీటీ ద్వారా క్రమశిక్షణ  చర్యలు

పదోన్నతులు, డిప్యుటేషన్లు, శిక్షణపై ప్రభావం

అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ

లేఖలో తీవ్ర పదజాలం.. ఘాటు హెచ్చరికలు

రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల్లో అలజడి


‘‘కేంద్రం కళ్లు కప్పేలా రాష్ట్రాలు పంపించే అప్పుల చిట్టాలను సమీక్షిస్తాం. ప్రతి తప్పునూ లెక్కలోకి  తీసుకుంటాం. వాటి ఫలితాలను సంబంధిత అధికారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది!’’

కేంద్ర ఆర్థిక శాఖ


‘మేం అడిగిన లెక్కలన్నీ చెబితేనే కొత్త అప్పులకు అనుమతిస్తాం’... ఇది కేంద్రం మాట!

ఆ లెక్కలన్నీ పక్కాగా చెబితే... ఈ ఏడాదే కాదు, మరో మూడేళ్లు 

కొత్త అప్పు పుట్టదు!... ఇది రాష్ట్రం ఆందోళన!

అంతకుముందులా అబద్ధాల లెక్కలు చెప్పేసి.. కేంద్రం కళ్లకు గంతలు కడదామంటే.. ‘తప్పుడు లెక్కలు చెబితే చర్యలు తప్పవు’ అని అధికారులను కేంద్రం హెచ్చరించింది!

మరి... అప్పు దొరికేదెలా? బండి నడిచేదెలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియక రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది! ‘పాహిమాం ప్రభూ’ అని వేడుకునేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ మరోసారి ఢిల్లీ బయలుదేరుతున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘పొలిటికల్‌ బాస్‌’లను ప్రసన్నం చేసుకోవడానికి ‘తప్పులు చేస్తున్న’ అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అప్పుల కోసం తప్పుడు లెక్కలు సమర్పించి, కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇష్టానుసారంగా అప్పులు చేయకూడదని చెప్పాల్సిన అధికారులే... కొత్త అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతూ, తప్పుడు నివేదికలు ఇస్తూ, అబద్ధాలు చెబుతున్న వైనంపై కేంద్ర ఆర్థిక శాఖ కన్నెర్ర చేసింది. ఈ విషయంలో  నేరుగా డీవోపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌)ని రంగంలోకి దించింది. తప్పు చేసిన అధికారులను సర్వీసు నిబంధనల మేరకు ‘ఫ్రేమ్‌’ చేసేలా రంగం సిద్ధం చేసింది. అంటే... ఇలాంటి అధికారుల పదోన్నతులు, డిప్యుటేషన్లు, జాతీయ, అంతర్జాతీయ శిక్షణ, పోస్టింగ్‌లు, సెంట్రల్‌ సర్వీసుల్లోకి తీసుకోవడం వంటి అంశాలపై ప్రభావం పడుతుందన్న మాట! దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఇటీవల సీఎ్‌సకు ఘాటు లేఖ రాసినట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఈ లేఖ వెళ్లింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు 90శాతం ఏపీకి వర్తించేవే కావడం విశేషం. నేరుగా ‘ఏపీ అధికారులు’ అనేపదం వాడకుండా... రాష్ట్రంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. ఈ లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖలోని ముఖ్య అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.


ఆ రాష్ట్రం ఏపీనే?

‘ఒక రాష్ట్రం’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తావించింది ఏపీ గురించేనని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే... అప్పుల కోసం ఏపీ ఆర్థిక శాఖ అధికారులు చేసిన నిర్వాకాలన్నీ ఎప్పుడో కేంద్రం దృష్టికి వచ్చాయి. రకరకాల గిమ్మిక్కులు, మాయలు చేయడం... కార్పొరేషన్ల మాటున అప్పులు తీసుకొచ్చి కేంద్రం కళ్లకు గంతలు కట్టడం అధికారులకు అలవాటైపోయింది.


ఏపీ సర్కారు ‘అన్ని పరిమితులు’ దాటి అప్పులు చేస్తోంది. కొత్త అప్పుల కోసం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తోంది. ‘శ్రీలంక గుణపాఠం’ నేపథ్యంలో కేంద్రం అధికారులు రాష్ట్రాలు చేస్తున్న అడ్డగోలు అప్పులపై గత నెలలో ప్రధాని మోదీని అప్రమత్తం చేశారు. ఆ తర్వాత రాష్ట్రాల అప్పులపై కేంద్రం పట్టు బిగించింది. అప్పులు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ 26పేజీల లేఖ రాసింది. రాష్ట్రం నివేదిక పంపినప్పటికీ కేంద్ర ఆర్థికశాఖ సంతృప్తి చెందలేదు. కొత్త అప్పులకోసం గతనెల చివర్లో ఢిల్లీ వెళ్లిన ఆర్థికశాఖ అధికారికి కేంద్ర అధికారులు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. ‘‘అప్పులకోసం రాజకీయ నాయకులు ఏదైనా చెబుతారు. వాస్తవ పరిస్థితిని మీరు వివరించాలి కదా! ఉల్లంఘనలు జరగకుండా ప్రొసీజర్స్‌ చెప్పాలి కదా! అప్పులపై మీరు చెబుతున్న లెక్కలు తప్పు. మొత్తం ఎన్ని రూపాల్లో, ఏయే పేర్లతో ఎంత అప్పు చేశారో పూర్తి వివరాలతో రండి’’ అని ఆ అధికారిని వెనక్కి పంపించారు. ఇదే నేపథ్యంలో ‘ఒక రాష్ట్ర అధికారులు తప్పుడు నివేదికలు పంపారు’ అంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు వెళ్లడం, తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. వెరసి... లేఖలో నేరుగా ఏపీ అని చేరిస్తే బాగోదని, సంయమనం పాటించి ‘ఒక రాష్ట్రం’ అని పేర్కొన్నారని సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.


అధికారుల్లో దడ...

‘అప్పులపై తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు తప్పవు’ అని కేంద్రం చేసిన హెచ్చరికలు రాష్ట్ర అధికారుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్‌ఎస్‌ రావత్‌, ఇండియన్‌ రైల్వే అకౌంట్‌ సర్వీసుకు చెందిన కేబీవీ సత్యనారాయణ స్పెషల్‌ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలన్నీ వీరిద్దరి చేతుల మీదే నడుస్తున్నాయి. లేఖలో పేర్కొన్నట్లుగా కేంద్రం చర్యలు తీసుకుంటే... వీరిద్దరికీ తిప్పలు తప్పవని అధికారవర్గాలు చెబుతున్నాయి. సత్యనారాయణ 2017 జూన్‌ నుంచి  డిప్యుటేషన్‌పై ఏపీలో పనిచేస్తున్నారు. సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సకు ఆయనే అధిపతి. డిప్యుటేషన్‌ ఒకసారి ముగిసినా పొడిగించారు. జూన్‌ 18తో ఆ గడువూ ముగుస్తుంది. ఆర్థికానికి సంబంధించి సర్కారు పెద్దలు ‘కోరుకున్న’ పనులన్నీ ఆయన చేసి పెడుతున్నారు. అప్పులకోసం మార్గాలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిప్యుటేషన్‌ మరోసారి పొడిగించాలని కోరే అవకాశముంది. ఈసారి డీవోపీటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక... రావత్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటు సర్కారు పెద్దల మాట కాదనలేక, అటు కేంద్రంతో వేగలేక సతమతమవుతున్నారు. ఈ గండం నుంచి ఎప్పుడెప్పుడు  బయటపడదామా అని ఎదురుచూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


ఇదీ హెచ్చరిక...

‘‘కొత్త అప్పులకు  సంబంధించి  ఒక రాష్ట్రం నుంచి వచ్చిన సమాచారం తప్పని, అసత్యాలతో కూడిన వివరాలు ఇచ్చారని తేలింది’’ అని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తప్పుడు సమాచారాన్ని ‘సర్టిఫై’ (నిజమని ధ్రువీకరించి) చేసి పంపించారని తెలిపారు. ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడమేనని స్పష్టంచేశారు. ‘‘దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. కీలక బాధ్యతల్లో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి కేంద్రాన్ని తప్పుదోవపట్టించి రాష్ట్రాలకు పరిమితికి మించిన రుణాలు ఇప్పించాలనుకోవడం ఎట్టిపరిస్థితుల్లో సరికాదు. వాస్తవాలను దాచిపెట్టి ఉంచి కేంద్రం నుంచి అడ్డదారుల్లో అత్యధిక వనరులు తీసుకెళ్లాలనుకోవడం తప్పు. ఇలాంటి చర్యలకు  పాల్పడిన అధికారులపై సర్వీసు రూల్స్‌లోని 6(2) కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీవోపీటీని కోరాం. ఇలాంటి అంశాలను ఆ విభాగం తీవ్రంగా పరిగణిస్తుంది. కేంద్ర సర్వీసులకు ఎంప్యానల్‌ అవ్వడం, అంతర్‌ రాష్ట్రాల డిప్యుటేషన్‌, జాతీయ, అంతర్జాతీయ శిక్షణ, అంతర్జాతీయ అసైన్‌మెంట్‌ల విషయంలో వారిపై తగిన చర్యలను తీసుకుంటుంది’’ అని సోమనాథన్‌ పేర్కొన్నారు. అంతేకాదు... ఇలాంటి తప్పులకు పాల్పడిన అధికారులపై క్రమశిక్షణ  చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కూడా కోరారు. 

Read more