కొవిడ్‌పై కేంద్రం అలర్ట్‌

ABN , First Publish Date - 2022-08-07T07:49:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మరోసారి కొవిడ్‌పై అలర్ట్‌ అయ్యింది.

కొవిడ్‌పై కేంద్రం అలర్ట్‌

తెలంగాణతో పాటు 7 రాష్ట్రాల్లో 10శాతం దాటిన పాజిటివిటీ రేటు

కొత్తగా 19వేల కేసులు.. అదే సంఖ్యలో రికవరీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కేంద్ర ప్రభుత్వం మరోసారి కొవిడ్‌పై అలర్ట్‌ అయ్యింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10% దాటడంతో వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టాలంటూ శనివారం సూచనలు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిసా, తమిళనాడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాల వైద్యఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. ‘‘కొవిడ్‌ కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలి. అర్హులైన వారందరికీ టీకాలు వేయాలి. కొవిడ్‌ స్టాండర్డ్‌ ప్రొసీజర్‌ ఆపరేషన్స్‌(ఎస్వోపీ)ని పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలి. రాబోయేవి పండుగ సీజన్లు. సామూహిక కార్యక్రమాలతో కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది’’ అని ఆయన ఆ లేఖల్లో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. దేశవ్యాప్తంగా శనివారం ఉదయానికి(గడిచిన 24 గంటల్లో) 19,406 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 49 మరణాలు చోటుచేసుకున్నట్లు కేంద్రం విడుదల చేసిన బులెటిన్‌ స్పష్టం చేసింది. 19,928 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఆర్నెల్ల తర్వాత మొదటి సారి 2 వేలపైన కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 2,419 కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ 2 వేల పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో కేసులు వెయ్యి దాటాయి.


ఒమైక్రాన్‌, దాని ఉపవర్గాలే..

ప్రస్తుతం భారత్‌లో కొవిడ్‌ ప్రభావం పొంగు, ఆటలమ్మ వ్యాధుల మాదిరిగానే ఉందని ది ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) వెల్లడించింది. ఒమైక్రాన్‌, దాని ఉపవర్గాలు మాత్రమే భారత్‌లో వ్యాప్తి చెందుతున్నాయని, ఈ వేరియెంట్లు పెద్ద ప్రమాదకారి కాదని వివరించింది. ఒమైక్రాన్‌ వల్ల కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరగడం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ), కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ రీసెర్చ్‌(సీఎ్‌సఐఆర్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో కలిసి ఇన్సాకాగ్‌ ప్రతివారం దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై పరిశోధన జరుపుతుంది. ఇప్పటి వరకు ఒమైక్రాన్‌, దాని ఉపవర్గాలు తప్ప.. కొత్త వేరియంట్లేమి రాలేదని ఇన్సాకాగ్‌ స్పష్టం చేసింది.

Updated Date - 2022-08-07T07:49:03+05:30 IST