Abn logo
Sep 13 2021 @ 00:52AM

నూరేళ్ళ ‘మాలపల్లి’

‘‘తెలుగులో అతి తక్కువగా వచ్చిన మేధావి రచనలలో మాలపల్లి ఒకటి. సృజనలోనూ, భావుకత(కల్పన)లోనూ అది మేధావి రచన’’ (కట్టమంచి సిపి రామసామి అయ్యర్‌కు రాసిన లేఖ) ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలను పూర్తిచేసి నూరేళ్లు అవుతున్నది. ఏప్రిల్‌ 9,  1922 నాటికి ఆయన ఈ నవలా రచనను పూర్తి చేశారు (జి. ఆంజనేయులు నాయుడు, మాల పల్లి ఒక పరామర్శ). తొలి తెలుగు నవల శ్రీరంగ రాజ చరిత్ర (1872) వచ్చిన 50 ఏళ్ళకు ‘మాలపల్లి’ వచ్చింది. సాంఘిక తలంలో సంచరిస్తున్న తెలుగు నవలను రాజకీయతలంలోకి తీసుకువచ్చిన నవల ఇది. దళిత కుటుంబాన్ని ప్రధాన కథాకేంద్రంగా తీసుకొని వచ్చిన సమగ్రమైన నవల. అంతకు ముందు ‘హేలావతి’, ‘మాతృమందిరము’ వంటి నవలలు ఉన్నా, ‘మాలపల్లి’ సమగ్ర మానవ జీవి తాన్ని చిత్రించిన తొలినవల. తొలి రాజకీయ నవల. సంఘ సంస్కరణోద్యమం ముగింపుకు వస్తున్న సమయంలో, భారత స్వాతంత్ర్యోద్యమం నూతన దశకు చేరుకుంటున్న సమయంలో ఆ రెండు ఉద్య మాల స్ఫూర్తితో వచ్చిన నవల. 1917లో రష్యాలో వచ్చిన బోల్షివిక్‌ విప్లవాన్ని సాహిత్యీకరించిన తొలి భారతీయ నవల కూడా ఇదే. గాంధేయ- మార్క్సీయ మార్గాలను నిజాయితీగా చిత్రించింది. గుంటూరు జిల్లా పలనాడు ప్రాంత గ్రామీణ వ్యవహరిక భాషలో ఉన్నవ ఈ నవల రాశారు. కంసుని చెరసాలలో కృష్ణుడు పుట్టినట్లుగా, ఉన్నవ నిర్బంధింపబడిన రాయవేలూరు జైలులో ఈ నవల పుట్టింది. పుట్టిన ఏడాదికే వలస పాలకులను భయపెట్టి నిషేధానికి గురైంది.


నవలా రచన పూర్తి కాగానే జైలు అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ పరిశీలనలో ఉండగానే నవల మొదటి భాగం అచ్చయింది 27.12.1922న. రెండో భాగం 06.3.1923న అచ్చయింది. మూడవ భాగం తర్వాత వచ్చింది. నాలుగో భాగం రాలేదు.


వలస పాలకులు మొదటి రెండు భాగాలను 14.05.1923న మూడో భాగాన్ని 08.8.1923 నిషేధిం చారు. ఎందుకంటే నవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టే స్వభావం ఉంది కాబట్టి. సాహి త్యంపై నిషేధం మనకు వలస పాలకులు అంటించిన జబ్బు. పూర్వకాలంలో రాజులు ఎవరూ కావ్యాలను నిషేధించిన దాఖలాలు లేవు. కవులలో ఆర్థిక కార ణాలవల్ల రామదాసు జైలు పాలైనట్లు చదువు తున్నాం. రాచరిక వ్యతిరేక కవిత్వం రాసినందుకు వేమన, వీరబ్రహ్మం అన్నమయ్య వంటి వాళ్లు జైలుపాలు కాలేదు. ఆ దుస్థితి ఆధునిక కాలంలోనే దాపురించింది. ఇంకా ఆ రుగ్మత కొనసాగుతూనే ఉంది. వలస పాలకులు కూడా అయిదేళ్ళ తర్వాత ‘మాలపల్లి’ నవలపై నిషేధం ఎత్తి వేశారు. 1935లో కాశీనాధుని నాగేశ్వరరావు ముందుమాటతో సంపూ ర్ణంగా ‘మాలపల్లి’ ఆంధ్ర గ్రంథమాల ద్వారా ప్రచు రితమైంది. ఆ తర్వాత కూడా వలస పాలకులు ఈ నవలను 03.07.1936లో నిషేధించి, 31.07.1937న నిషేధం ఎత్తివేశారు. అంతేగానీ విచారణలేకుండా ఈ నవలను తొక్కి పెట్టేయలేదు. 


‘మాలపల్లి’ని గుంటూరు జిల్లాలో మంగళాపురం అనే గ్రామం కేంద్రంగా 1921-22 నాటి కోస్తా ప్రాంత ఆర్థిక సాంఘిక రాజకీయ జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించారు ఉన్నవ. ఈ నవల కేవలం చౌదరయ్య రామదాసు అనే ఇద్దరు వ్యక్తుల, కుటుంబాల చరిత్ర మాత్రమే కాదు. రెండు వర్గాల మధ్య జరిగిన పోరు చరిత్ర. అంతేకాదు రెండు కుటుంబాలలోనూ రెండు విరుద్ధ భావజాల ప్రతినిధులను సృష్టించడం ఉన్నవ ప్రత్యేకత. చౌదరయ్య భూస్వామ్య, ఆధిపత్య దోపిడీ వర్గ ప్రతినిధి. ఆయన కుమారుడు రామానాయుడు శ్రామిక కార్మికవర్గ పక్షపాతి. రామదాసు శ్రామిక కులం, వర్గం నుండి పుట్టుకొచ్చిన సాత్వికుడు. అచల తత్వవేత్త. వేదాంతి. ఆయన కుమారుడు సంగదాసు తండ్రిలాగే సాత్వికుడు. అయినా శామిక కార్మికవర్గ పక్షపాతి. కూలీల తరపున సాత్విక పోరాటం చేసి భూస్వామ్య చౌదరయ్య చేతిలో హత్యకు గురయ్యాడు. సంగదాసును చౌదరయ్య చంపడానికి ఆర్థిక, సాంఘిక, రాజకీయ కారణాలున్నాయి. సాత్విక, గాంధేయవాది సంగదాసు హత్య తర్వాత అప్పటిదాకా ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉండిన రామదాసు పెద్దకొడుకు వెంకట దాసు ఇంటినుంచి అదృశ్యమై తక్కెళ్ల జగ్గడు పేరుతో సొంతసైన్యాన్ని నిర్మించుకొని సంతానోద్యమం నిర్వ హిస్తాడు. ఇతని ఉద్యమం బోల్షివిక్‌ విప్లవ ప్రభావమే. సంగదాసు గాంధీయిజానికి వెంకటదాసు మార్క్సి జానికి ప్రతినిధులు. సంగదాసు భూస్వాముల చేతుల్లో చంపబడటం, వెంకపటదాసు వలసవాద పెట్టుబడివాద ప్రభుత్వం చేతుల్లో వేటాడబడటం ఈ నవలలోని వైచిత్రి. అలాగే ఈ నవలలో మరొక ఇద్దరు దళితులు కూడా చంపబడతారు. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి ఎక్కడెక్కడో తిరిగి గడ్డి పీక్కొని ఇంటికి తిరిగి వస్తుంటే తన పొలం గట్లమీద నడిచిందని మరో భూస్వామి బసివిరెడ్డి ఆమెను చావగొడతాడు. ఎముకలిరిగే టట్టు కొడతారు. ఆమె కొన్నాళ్ళకు చనిపోతుంది. రామదాసు కూతురు జ్యోతిని ఫౌల్‌ అనే జైలు అధికారి నాశనం చేయబోతే ఆమె నదిలో దూకి ప్రాణం విడుస్తుంది. ఇలా అప్పటి రెండు వర్గాల సంఘర్షణను ‘మాలపల్లి’ నవల చిత్రించింది.


అభ్యుదయ సాహిత్యం భారతీయ భాషలలో మొదలుకాక ముందే సాహిత్యంలో మార్క్సీయ వాతావరణాన్ని చిత్రించిన నవల ‘మాలపల్లి’. తక్కెళ్ల జగ్గని పాటలు విప్లవాత్మకాలే. ఈ నవల వచ్చిన మరో దశాబ్దానికి శ్రీశ్రీ అభ్యుదయ కవితలు మొదలయ్యాయి.


ఉన్నవ నిజాయితీగల రచయిత. అచ్చంగా గాంధేయవాది. సాంఘి కంగా కందుకూరి, రాజకీయంగా గాంధీజీ ఆయనకు ఆదర్శం. బహుశా భారతీయ భాషలలో గాంధీజీని సాహిత్యంలో పాత్రను చేసిన తొలి రచయిత ఉన్నవేనా అనేది పరిశీలించవలసి ఉంది. గాంధీజి నడుపుతున్న అసహాయోద్యమం 1921-22 మధ్య కాలంలో పలనాడు ప్రాంతంలో సాగిన తీరును ఉన్నవ ఈ నవలలో చిత్రించారు. ఆయన తన నవలలో ఈ గాంధేయవాద ఉద్యమ చిత్రణకే పరిమితమైనా ఆ నవలకు దక్కవలసిన ఖ్యాతి దక్కి ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. అప్పటికి ప్రపంచం దృష్టినంతా ఆకర్షిస్తున్న బోల్షివిక్‌ విప్లవాన్ని కూడా చిత్రించారు. దీనితో ఈ నవలకు మరికొంత విస్తృతి సిద్ధించడమే కాక సమగ్రత కూడా సిద్ధించింది. అయితే ఈ నవలలో గాంధీయిజాన్ని మార్క్సిజాన్ని చిత్రిం చిన ఉన్నవ ఈ రెండింటిలో ఎటువైపు ఉన్నాడు అన్నది ప్రశ్న. ఆయన నిస్సందేహంగా గాంధీ యిజం వైపే ఉన్నారు. బోల్షివిక్‌ విప్లవం ద్వారా రష్యాలో వచ్చిన సమసమాజం భారతదేశంలోనూ ఏర్పడాలనీ, అయితే అది విప్లవ మార్గంలో గాక గాంధీయ మార్గం ద్వారా రావాలని ఆయన కోరు కున్నారు. గాంధీయవాద సంగదాసు, మార్క్స్‌వాద వెంకటదాసు ఇద్దరు హతులైనట్లు చూపిన ఉన్నవ సంగదాసు తర్వాత రామానాయుడు, వెంకటయ్య ఈ ఉద్యమాన్ని కొనసాగించినట్లు చిత్రించారు. కానీ తక్కెళ్ళ జగ్గని ఉద్యమానికి కొనసాగింపు చెప్పలేదు ఉన్నవ. అందువల్ల ఆయన సంపూర్ణంగా మార్క్సిజం వైపు లేరు. పైగా ఆయన భౌతికవాది కూడా కాదు. ఆధ్యాత్మికవాది. అందుకే రామదాసు పాత్రను నవల చివరిదాకా కొనసాగించారు ఉన్నవ. మాలపల్లిలో రామదాసు క్రైస్తవ మతాంతరీకరణను ఎదరించి ఓడించడం, దళిత పాత్రను మంచి హిందూత్వ ప్రతినిధిగా చిత్రించడం ఇటీవలి కాలంలో విమర్శకు గురయ్యాయి. జస్జిస్‌ పార్టీ నడిపిన ఉద్యమాన్ని తిరస్కరించటం కూడా ఉన్నవ ప్రణాళికలో ఉం దన్న వాదన ఉంది. అవి అలా ఉన్నా ఉన్నవ తన కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్న రెండు సామాజిక భావజాలా లనూ, వాటి కార్యాచరణనూ నిజాయితీగా చిత్రించి, తాను ఒకదాని వైపు మొగ్గారు.


‘మాలపల్లి’ రచనాకాలానికి ఒకవైపు స్వాతంత్ర్యోద్యమ కవిత్వం మొదలవు తుండగా, మరో వైపు భావ కవిత్వం ఉధృతంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో ఉన్నవ మాలపల్లి నవలలో అస్పృశ్యత వంటి సాంఘిక సమస్యను, దేశ స్వా తంత్య్రం వంటి రాజకీయ సమస్యను, కూలీల పెంపుదల వంటి ఆర్థిక సమస్యను వాస్తవంగా చిత్రించడమే గాక అనేక రకాల స్త్రీ పురుష సంబంధాలను కూడా చిత్రించారు. చౌదరయ్య, లక్ష్మీ దేవి, రామదాసు, లక్ష్మమ్మ, రామానాయుడు, కమ లమ్మ, అప్పాదాసు, జ్యోతి ఈ నలుగురూ నాలుగు జంటలు. వారిని ఉన్నవ వైవిధ్యభరితంగా చిత్రించారు.


రామానాయుడు జాతీయోద్యమంలో పాల్గొం టుండగా ఆయన భార్య కమలమ్మ మోహన్‌ రావుతో వెళ్ళి పోవడాన్ని ఉన్నవ సమర్థించినట్లు లేదు. బహుశా ఆయన చలం సాహిత్యాన్ని ఒక రకంగా వ్యతిరేకించారేమో అని పిస్తుంది. చౌదరయ్య భార్య భర్త ఆధిపత్యానికి లోబడిన స్త్రీ. కానీ ఆమెది మంచి పాత్ర. రామదాసు భార్య భర్త అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం ఆయన వెన్నంటి ఉంటుంది. అప్పా దాసు జ్యోతిలది అమలిన శృంగారమో, స్నేహమో అవు తుంది. అది మొలక దశ లోనే తునిగి పోయింది.


చలనంలో ఉన్న సమాజాన్ని, రచయిత స్వయంగా భాగస్వామి అయిన సమాజాన్ని నవలగా మార్చడం చాలా కష్టం అన్నారు ఇల్యా ఎహ్రెనెబర్గ్‌ ‘నవల, శిల్పమూ’ అనే గ్రంథంలో. ఉన్నవ ఉద్యమంలో భాగస్వామి, అప్పటి భారతదేశం స్వాతంత్ర్యోద్యమం ఉన్నత దశకు ప్రయాణిస్తున్నది. ఈ చలనాన్ని ఉన్నవ చాలా నిజాయితీగా వాస్తవికంగా చిత్రీకరించారు.


మాలపల్లి నవలవచ్చి నూరేళ్ళవుతున్నది. ఈ నూరేళ్ళలో ప్రపంచం ప్రత్యేకించి భారతదేశం చాలా మార్పులకు లోనైంది. ‘మాలపల్లి’ నాల్గవ భాగంలో గాంధీజీ నాయకత్వంలో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు, భారతదేశంలో గ్రామస్వరాజ్యం సిద్ధించినట్లు ప్రతి గ్రామంలోనూ ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నట్లు చిత్రించారు. ఆయన ఊహ నిజమైందా? గత నూరేళ్ళలో 1922 నాటి ఉన్నవ ఊహ నిజమైందా? కలలు కనండి, సాకారం చేసుకోండి అని పూర్వ భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం అన్నారు. అలా మనం ఉన్నవ కలను సాకారం చేసుకోగలిగామా?


గత వందేళ్ళలో సాంకేతికంగా మనం స్వాతం త్య్రం సంపాదించుకున్నాం. స్వపరిపాలన తెచ్చు కున్నాం. అక్షరాస్యత పెంచుకున్నాం. విద్యావం తులు, మేధావులు పెరిగారు. విద్యా వైజ్ఞానికంగా పారిశ్రామికంగా, ఉత్పత్తిపరంగా ఎంతో ప్రగతి సాధించాం. ప్రపంచ దేశాలతో పోటిపడి పయని స్తున్నాం. ఇద్దరు దళితులు రాష్ట్రపతులయ్యారు. ఒక దళిత ఉపప్రధానిని చూశాం. దళితుడు ప్రధాని అయ్యే అవకాశం చేజారిపోయింది. కొందరైనా దళితులు ముఖ్యమంత్రులయ్యారు. అనేకులు కేంద్ర, రాష్ట్ర మంత్రులయ్యారు. దళిత మహిళలు సైతం ఈ స్థాయికి ఎదుగుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలోనే దళితులు ప్రధాన పాత్ర నిర్వహిం చారు. ఉద్యోగ రంగంలో మండల స్థాయి నుండి జాతీయ స్థాయిదాకా ఎందరో దళితులు ఎదిగారు. అయినా ఖైౖర్లాంజి, నీరుకొండ, కారంచేడు, పదిరి కుప్పం, చుండూరు, ప్యాపిలి, వేంపెంటలలో దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు ‘అందరూ బాగుంటేనే బాగు’ అనే రామదాసు కల నెరవేరనేలేదు. ఇంకా అనేక సమస్యలు అప్పటికన్నా ముదిరాయి. తెలుగు రచయితలు 1948 నుండే స్వాతంత్య్ర ఫలానుభవాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆరుద్ర 1948 ఆగష్టు 15న మన స్వాతంత్య్రం ఒక మేడిపండు, మన దారిద్య్రం ఒక రాచపుండు’’ అన్నారు. గుర్రం జాషువా పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కొడవ టిగంటి కుటుంబరావు, ముద్దుకృష్ణ వంటి వందల కొలది రచయితలు స్వాతంత్య్ర ఫలాల మీ విమర్శ చేస్తూనే ఉన్నారు. 


వాస్తవికత, ఊహ కలగలసిన నవల ‘మాలపల్లి’. కులం, సంపద ప్రాతిపదికల మీద వచ్చిన ఏ భారతీయ నవలకైనా ‘మాలపల్లి’ ఆది గురువుగా భాసిస్తుంది. నూరేళ్ళ క్రితం వచ్చినా ఇప్పటికీ ప్రాసంగికతగల నవల.

రాచపాళం చంద్రశేఖర రెడ్డి

ప్రత్యేకంమరిన్ని...