తిరిగితే దొరుకుడే..!

ABN , First Publish Date - 2022-07-06T06:41:29+05:30 IST

నగర బహిష్కరణ చేసిన రౌడీషీటర్లు పొరుగున ఉన్న సీతానగరం, తాడేపల్లిలో ఉంటున్నారు.

తిరిగితే దొరుకుడే..!

‘షీటర్ల’కు సాంకేతిక సంకెళ్లు

  బెంగళూరు ఐఐటీ నిపుణులతో ప్రత్యేక యాప్‌ రూపకల్పన

  ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలకు మరమ్మతులు

  యాప్‌కు కెమెరాల అనుసంధానం

  షీటర్లు కెమెరాల్లో చిక్కగానే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అలర్ట్‌

నగర బహిష్కరణ చేసిన రౌడీషీటర్లు పొరుగున ఉన్న సీతానగరం, తాడేపల్లిలో ఉంటున్నారు. ఇప్పుడు గన్నవరం, పెనమలూరుల్లో మకాం వేస్తున్నారు. అక్కడి నుంచే అనుచరగణానికి ఆదేశాలు ఇస్తున్నారు. ఇంతకు ముందులాగే వాళ్ల పనులు వాళ్లు చక్కబెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యమనుకుంటే పోలీసుల కళ్లుగప్పి బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించేస్తున్నారు. ఇటువంటివారిని గుర్తించి సాంకేతిక సంకెళ్లు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలకు ప్రత్యేక యాప్‌ అనుసంధానం ద్వారా వారి కదలికలు గుర్తిస్తారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని రౌడీషీటర్లు రాత్రి సమయాల్లో వచ్చి వ్యవహారాలను చక్కబెట్టుకొని వెళ్లిపోతున్నారు. రౌడీషీటర్ల చీకటి వ్యవహారాలకు సాంకేతికంగానే సంకెళ్లు వేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. బీట్‌ నిఘాతోపాటు సాంకేతిక నిఘాను కొనసాగించడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. వాటిని త్వరలో పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నారు. నగరంలో అసాంఘిక, నేర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని రౌడీ, కేడీ, సస్పెక్ట్‌ షీటర్లుగా విభజించారు. ఈ మూడు కేటగిరీల్లో మొత్తం 400 మంది వరకు షీటర్లు ఉన్నారు. వారిలో తీవ్రమైన నేరచరిత్ర ఉన్న వారిని నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఏకకాలంలో నలుగురిని విజయవాడ నుంచి బయటకు పంపేశారు. కొంతమంది జైళ్లలో ఉన్నారు. ఇంకొంతమంది పొరుగు జిల్లాల్లో ఉంటున్నారు. 

 డేటా అప్‌డేట్‌

నగరంలో ఉన్న రౌడీషీటర్లు పగలంతా ఏదో ఒక పని చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నా చీకటి వ్యవహారాలు మాత్రం చక్కబెడుతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రతి ఆదివారం ఈ షీటర్లందరికీ టాస్క్‌ఫోర్స్‌, శాంతిభద్రతల పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయినా కొంతమంది షీటర్ల కాలు కుదురుగా ఉండడం లేదు. ఇలాంటి వారికి బీట్‌ నిఘా ఒక్కటే సరిపోదని అధికారులు భావిస్తున్నారు. రాత్రిపూట బీట్‌ నిర్వహించే పోలీసులు వారి పరిధిలోని షీటర్ల ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. వారు ఇంట్లో ఉన్నారా లేదా అని చూస్తారు. ఇంట్లో ఉంటే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తాజాగా రౌడీషీటర్ల డేటాను అప్‌డేట్‌ చేస్తున్నారు. షీటర్లు ఉపయోగిస్తున్న అన్ని ఫోన్‌ నంబర్లను సేకరిస్తున్నారు. వాటితోపాటు ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు, బ్యాంక్‌ ఖాతా నంబర్లతో చిరునామాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తీసుకుంటున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారు ఇల్లు మారినప్పుడల్లా చిరునామాను కచ్చితంగా టాస్క్‌ఫోర్స్‌కు, స్థానిక పోలీసుస్టేషన్‌కు ఇవ్వాలి. ఒకవేళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినా అక్కడ చిరునామాను ఇక్కడ కచ్చితంగా ఇచ్చితీరాలి. 

  బెంగళూరు నిపుణులకు బాధ్యతలు

పగలంతా ఇళ్లల్లోనో, మరెక్కడో ఉండి నగరం నిద్రపోతున్న వేళల్లో చక్కర్లు కొట్టేవారితోపాటు బహిష్కరణలో ఉండి రహస్యంగా నగరంలో అడుగుపెడుతున్న వారి కాళ్లకు సాంకేతిక బంధాలు పడబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను విజయవాడ పోలీసులు తయారు చేస్తున్నారు. ఈ బాధ్యతలను బెంగళూరు ఐఐటీ నిపుణులకు అప్పగించినట్టు సమాచారం. ఈ యాప్‌ను మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తోపాటు సీసీ కెమెరాలు అనుసంధానం చేస్తారు. విజయవాడలో 800 సీసీ కెమెరాలు ఉన్నాయి.  కొన్నిచోట్ల ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు కన్నుమూశాయి. వాటికి మరమ్మతులు చేయించి కళ్లు తెరిపించాలని పోలీసు అధికారులు నిర్ణయిం చారు. అర్ధరాత్రి నగరంలో తిరుగుతున్న రౌడీషీటర్లు గానీ, నగర బహిష్కరణలో ఉండీ విజయవాడలోకి వచ్చిన వారిని గానీ ఈ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు గుర్తిస్తాయి. షీటర్ల ముఖం కెమెరాకు చిక్కగానే ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న స్ర్కీన్లపై అలర్ట్‌ మేసేజ్‌ కనిపిస్తుంది. రౌడీషీటర్‌ ఫొటో, అతడి పేరు వస్తుంది. అతడు ఏ మార్గం నుంచి ఏ మార్గంలోకి వెళ్తున్నాడో చూపిస్తుంది. ఈవిధంగా షీటర్లను సాంకేతికంగా కట్టడి చేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. 


Updated Date - 2022-07-06T06:41:29+05:30 IST