సెల్ఫీ మోజుతో కూవంలో జారిపడిన ఐటీ అధికారి

ABN , First Publish Date - 2021-04-13T12:58:05+05:30 IST

స్థానిక నేపియర్‌ బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకొనేందుకు యత్నించి కూవం నదిలో జారిపడిన ఐటీ అధికారిని పోలీసులు, అగ్నిమా

సెల్ఫీ మోజుతో కూవంలో జారిపడిన ఐటీ అధికారి


పెరంబూర్‌(చెన్నై) : స్థానిక నేపియర్‌ బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకొనేందుకు యత్నించి కూవం నదిలో జారిపడిన ఐటీ అధికారిని పోలీసులు, అగ్నిమాపక దళం సభ్యులు కాపాడారు. చెన్నై కొడుంగయూరు టీహెచ్‌ రోడ్డు చంద్రా రెసిడెన్షియల్‌ ప్లాట్‌లో నివసిస్తున్న మూర్తి (30) ప్రముఖ ఐటీ సంస్థలో అధికారిగా పనిచేస్తున్నారు. మూర్తి ప్రతిరోజూ ఉదయం మెరీనాబీచ్‌ రోడ్డులో వాకింగ్‌ వెళుతుంటారు. ఆ మేరకు సోమవారం ఉదయం 7.30 గంటలకు అన్నాదురై సమాధి నుంచి నేపియర్‌ వంతెన వరకూ వాకింగ్‌కు వెళ్ళారు. ఆ వంతెనకు ఆనుకుని సెల్ఫీ తీసుకుంటుండగా హఠాత్తుగా పక్కనే ఉన్న కూవం నదిలో జారిపడ్డాడు. ఆ నదిలో మొలలోతు మురికి బురదలో పడటంతో ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు. అది చూసిన పాదచారులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి కబురు చేశారు. అన్నాదురై సమాధి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బురదలో చిక్కుకున్న మూర్తిని తాడు సాయంతో పైకి లాగి కాపాడారు. తీవ్ర అస్వస్థతకు గురైన మూర్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.  



Updated Date - 2021-04-13T12:58:05+05:30 IST