పచ్చని కాపురాల్లో సెల్‌ చిచ్చు

ABN , First Publish Date - 2022-07-03T06:42:05+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని గంటల తరబడి సోషల్‌ మీడియాలో గడుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

పచ్చని కాపురాల్లో సెల్‌ చిచ్చు

అతి వినియోగంతో భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు

విడాకుల వరకూ వెళుతున్న కొన్ని జంటలు

సోషల్‌ మీడియాకు బానిసలుగా యువతీయువకులు, పిల్లలు

చదువుపై నిర్లక్ష్యం

శారీరక, మానసిక సమస్యలు

తలెత్తుతున్నాయంటున్న వైద్యులు

వీలైనంత వరకూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగాన్ని తగ్గించుకుని, కుటుంబ సభ్యులతో గడపాలని సూచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘ఏరా పొద్దస్తమానం...ఫోన్‌ తప్ప మరో లోకం లేదా...’ కొడుకుకు తండ్రి మందలింపు. 

‘మీకు ఎప్పుడు ఆ ఫోన్‌ ఉంటే చాలా...పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడొచ్చు కదా...’ ఓ భార్య అసహనం.

‘కొంచెం ఆ ఫోన్‌ పక్కనపెట్టి అన్నం పెడతావా...’ ఓ భర్త విసుగు

...ఇదీ ప్రస్తుతం చాలామంది ఇళ్లలో పరిస్థితి. స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని గంటల తరబడి సోషల్‌ మీడియాలో గడుపుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఈ జాబితాలో యువతీయువకులు మాత్రమే ఉండేవారు. ఈ మధ్యకాలంలో పిల్లలు, పెద్దలు కూడా అదేబాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఇరువురిలో ఎవరైనా...ఉద్యోగపరమైన ఫోన్‌ కాల్‌ మాట్లాడినా భాగస్వామి అనుమానం పెంచుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ కారణంగా సంఘ జీవనానికే మనిషి దూరమవుతున్నాడని విశ్లేషిస్తున్నారు. ఇక విద్యార్థులు గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంతో చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  


స్మార్ట్‌ ఫోన్‌ దూరం పెట్టాలి.. 

కార్యాలయంలో పూర్తిచేయాల్సిన పనిని ఇంటి వరకు తీసుకువస్తుండడంతో భార్యభర్తలు గంటల తరబడి ఫోన్‌లోనే గడపాల్సి వస్తున్నది. దాంతో పాటు ఏమాత్రం ఖాళీ దొరికినా ఇరువురూ కూర్చుని మాట్లాడుకోవడం కంటే సోషల్‌ మీడియాలో గడపడం చేస్తున్నారు. దీంతో లేనిపోని అపోహలు తలెత్తుతున్నాయి. అలాగే ఇంట్లో వుండే మహిళలు ఫోన్‌ చూడడం/మాట్లాడడంలో పడి సమయానికి పిల్లలను స్కూలుకు పంపకపోవడం, క్యారేజీ సిద్ధం చేయకపోవడం వంటి వాటి కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి కారణాలతో విడాకుల వరకూ వెళుతున్న వారు కూడా వుంటున్నట్టు చెబుతున్నారు. 


ఆత్మీయులు, స్నేహితులు కరువు

ప్రస్తుతం యువతను మీ ప్రాణ స్నేహితులు ఎవరు అని అడిగితే...టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అధికశాతం స్నేహాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకే పరిమితం అవుతున్నాయి. గతంలో ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో గడిపేవాళ్లు. ఇప్పుడు ఇంటికే పరిమితమవుతూ నాలుగు గోడల మధ్య సెల్‌ఫోన్‌లో ఆటలాడుకుంటూ, సోషల్‌ మీడియాలో స్నేహితులను వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. దీనివల్ల ఒత్తిడి, మానసిక వేదనకు గురైనప్పుడు చెప్పుకునేందుకు ఎవరూ ఉండడం లేదు. ఫలితమే ఆత్మహత్యలు. జీవితంలో కనీసం ఇద్దరైనా ప్రాణ స్నేహితులను సంపాదించుకోవాలి. వారు పక్కన లేకపోయినా ప్రతిరోజు ఫోన్‌లోనైనా మాట్లాడాలి. ఫోన్‌లో కంటే కలిసి మాట్లాడే స్నేహాల్లోనే గాఢత ఎక్కువ ఉంటుంది. 


మెడపై భారం.. 

మనిషి తల బరువు సాధారణంగా 4.5 నుంచి 5 కిలోలు ఉంటుంది. అయితే, ఎక్కువ సేపు తలవంచుకుని స్మార్ట్‌ ఫోన్‌లో గడుపుతుండడంతో మెడపై నాలుగు నుంచి ఐదు రెట్లు భారం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అనేక రుగ్మతల బారినపడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ చేసిన సర్వే ఇదే విషయాన్ని వెల్లడించింది. 8-18 ఏళ్లలోపు వారు రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. యువతలో 24 శాతం మంది అత్యధిక సమయంలో ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టు అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చి సెంటర్‌ నివేదికలో వెల్లడించింది.


రోగాలు కూడా.. 

స్మార్ట్‌ ఫోన్‌ అతి వినియోగంతో వృత్తిగత, వ్యక్తిగత సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, వెన్నుముఖ సమస్యలు వంటివి వేధిస్తాయి. పరోక్షంగా హార్మోన్లపై ప్రభావం పడుతోంది. స్మార్ట్‌ ఫోన్‌ అధికంగా వాడేవారిలో ఏదైనా సమస్య వస్తే అతిగా స్పందించడం గమనించవచ్చు. ఆందోళన చెందడం, ఎదుటి వారిపై అరవడం వంటి సమస్యలు వారిలో కనిపిస్తాయి. ఇటువంటి సమస్యలకు చెక్‌ చెప్పాలంటే వీలైనంత వరకు స్మార్ట్‌ ఫోన్‌ను దూరంగా పెట్టాలి. సోషల్‌ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించాలి. ఎవరైనా ఇంటికి వస్తే వారితో మాట్లాడేందుకు ఇంట్లో ప్రతి ఒక్కరూ సమయం కేటాయించాలి. బంధువులు వున్న ఆ కాసేపు ఫోన్లను దూరంగా పెట్టాలి. ఎదుటివారు చెబుతున్నది వినేందుకు ఆసక్తి చూపించాలి. దీంతోపాటు వారి ఇంట్లో ఉండే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి.


వ్యసనంగా మారుతున్న పరిస్థితి.. 

- డాక్టర్‌ నాగరాజు, మానసిక వైద్య నిపుణులు

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం వ్యసనంగా మారుతోంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఫోన్‌ అలవాటు చేస్తున్నారు. యువత అయితే అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఫోన్‌ వినియోగిస్తూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. భార్య,భర్తల మధ్య అపోహలకు స్మార్ట్‌ఫోన్‌ కారణమవుతోంది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తరువాత అనుమానం ఎక్కువ మందిలో పెరిగిపోతోంది. స్మార్ట్‌ ఫోన్‌ను వీలైనంత తక్కువ వినియోగించడం వల్ల చాలా సమస్యలకు చెక్‌ చెప్పవచ్చు. ఇంటికి వచ్చిన తరువాత ఫోన్‌ అవసరమైతే తప్ప తీయకూడదు. వీడియోలు చేస్తూ కొందరు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అటువంటి వారిని గుర్తించి వీలైనంత వేగంగా బయటకు వచ్చేలా చేయాలి. 

Updated Date - 2022-07-03T06:42:05+05:30 IST