రింగా.. రింగా.. రింగ్జైటీ

ABN , First Publish Date - 2021-12-07T05:33:54+05:30 IST

వాస్తవానికి రింగ్జైటీ అనేది కొత్త జబ్బు కాదు. పూర్వికుల నుంచి ఉన్న సమస్యే. దీనినే ఫాంటమ్‌ రింగింగ్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారు.

రింగా.. రింగా.. రింగ్జైటీ

స్మార్ట్‌గా మానసిక రుగ్మతలు

మొబైల్‌ అతి వినియోగంతో కష్టాలు

మానసిక సమస్యల భారిన యూజర్లు

అవసరం మేరకే వాడాలంటున్న నిపుణులు


ఫోను రాకపోయిన రింగు వస్తున్నట్లు అనిపించడం.. వాట్సాప్‌, ఇతర నోటిఫికేషన్‌ శబ్ధాలు అదేపనిగా వస్తున్నట్టు అనిపించడం.. పదేపదే ఫోను రింగు అవుతుందేమోనని చూడటం.. అసలు అలాంటివి ఏవీ రాకపోతే నిరాశ చెందడం.. ఇటువంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్తగా ఉండండి. దీనిని చిన్నసమస్యగా చూడకండి. ఇలాంటి లక్షణాలు ఉంటే దానిని రింగ్జైటీగా వ్యాధిగా మానిసక వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇది పెద్ద సమస్యగా కనిపించకపోయినా భవిష్యత్తులో పెను ముప్పుగా మారనున్నది. మెదడు, కళ్లు వంటి వాటిపై అధిక ప్రభావం చూపి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   


గుంటూరు(తూర్పు), డిసెంబరు 6: వాస్తవానికి రింగ్జైటీ అనేది కొత్త జబ్బు కాదు. పూర్వికుల నుంచి ఉన్న సమస్యే. దీనినే ఫాంటమ్‌ రింగింగ్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారు. దైనందిన జీవితంలో మనం చేసే పనులకు సంబంధించిన విషయాలు, శబ్ధాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఉదాహరణకు స్కూల్లో బెల్‌ కొట్టే గుమస్తాకు విధులు అనంతరం కూడా అదే శబ్ధం వినిపిస్తుంది. చిన్న పిల్లలు ఆ రోజు స్కూల్‌లో జరిగిన విషయాలను అదే పనిగా గుర్తు చేసుకుంటూ వాటి గురించే నిద్రలో కలవరిస్తుంటారు. కాకపోతే ఇవి అంతగా ఇబ్బంది పెట్టే సమస్యలు కావు. అయితే మొబైల్‌ ఫోను, స్మార్ట్‌ ఫోను వినియోగంలోకి వచ్చాక మనిషి జీవితం, జీవనం పూర్తిగా మారి పోయింది. చేస్తున్న పని గాకుండా ఫోను, దానికి సంబంధించిన విషయాలు అదే పనిగా గుర్తుకు వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది మోబైల్‌ యూజర్లు ఫోను రింగు అవుతుందనే భ్రమలో ఉండి అదే పనిగా ఫోను చూసుకుంటూ ఉంటున్నారు. వీటితో పాటు నోటిఫికేషన్‌ శబ్ధాలు కూడా వెంటాడుతుంటాయి. దీంతో రేడియేషన్‌ ఇతర సమస్యల వల్ల ఇవి మెదడుపై పెనుప్రభావం చూపుతాయి. అనారోగ్యం బారిన పడటంతో పాటు, కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


లక్షణాలు ఇలా..

ఈ వ్యాధి బారిన పడిన వారు కాలింగ్‌బెల్‌ మోగినా, సినిమా, టీవీల్లో ఫోను వచ్చినా ఫోను చూసుకోవడం, చిన్న పురుగు శబ్ధం చేసినా నోటిఫికేషన్‌ వచ్చిందేమోనని చూసుకుంటూ ఉంటారు. వీటితో పాటు నిద్రపోతున్న సమయంలో మోబైల్‌ను అందుబాటులో ఉంచుకోవడం, రోడ్లపై నడిచి వెళ్తునప్పుడు, వాహనం నడుపుతూ కూడా ఫోనుపై ఓ కన్నేసి ఉంచడం వంటి లక్షణాలు కూడా ఈ వ్యాధి బారిన పడిన వారిలో కనిపిస్తూ ఉంటాయి.


యువతే అధికశాతం..

రింగ్జైటీ బారిన యువతే ఎక్కువగా పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అదే పనిగా ఫోను మాట్లాడటం, ఎక్కువ సమయం ఫోనుతోనే గడపటం వంటి కారణాలతో తెలియకుండానే ఈ మానసిక రుగ్మతకు గురవుతున్నారన్నారు. స్మార్ట్‌ఫోను వాడకం వల్ల మెదడు అధికంగా చక్కెరను వినియోగించుకుంటుంది. దీంతో మిగిలిన వారికంటే ఏడు శాతం మెదడు తక్కువ శాతం పనిచేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అదే పనిగా ఫోను చూడటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఇష్టమైన వ్యక్తులు, వస్తువులు, గురించి తక్కువుగా మాట్లాడటం, మనకు ఇష్టమైనవి అవతలి వారికి నచ్చకపోవడం, మనం ఆశించినంతగా, అనుకున్న విధంగా అవతలి వ్యక్తి నుంచి స్పందన రాకపోవడం వంటి వాటి వల్ల ఒత్తిడి, తీవ్ర మనోవేదనకు ఎక్కువ మంది గురవుతున్నారు.


ఈ జాగ్రత్తలు అవసరం..

- డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ అనే సాంకేతికత ద్వారా వాట్సాప్‌, టెలీగ్రామ్‌లో అనవసరమైన వాటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. అంతేగాక ఈ సాంకేతికత ద్వారా మనం రోజుకు ఎన్ని గంటలు ఫోను వాడుతున్నామో అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. దీంతో మరుసటి రోజు దానికంటే తక్కువ సమయం వినియోగించుకునేలా జాగ్రత్త పడే అవకాశం ఉంది. 

- రోజుకు 60 నిమిషాలు కంటే ఎక్కువుగా ఫోను మాట్లాడే వారు, ఒక రోజులో 13 సార్లు కన్నా అధికంగా ఫోను రింగు అయ్యేవారు వీటి బారిన పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఫోను వాడకం, మాట్లాడటం తగ్గించుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు. 

- నిద్రకు ఉపక్రమించాలంటే మెలటోనిక్‌ అనే హార్మోన్‌ అవసరం. నిద్ర సమయంలో స్మార్ట్‌ఫోను వాడకం వల్ల దీని నుంచి వచ్చే పచ్చ, నీలిరంగు కాంతిని మెలటోనిక్‌ హార్మోన్‌ను నియంత్రిస్తుంది.  అందువల్ల కాబట్టి స్మార్ట్‌ఫోను డిస్‌ప్లేలో నీలిరంగును తగ్గించుకోవాలి.

- నిద్ర పోయే 15 నిమిషాల ముందు ఫోనుకు దూరంగా ఉండాలి.

- కార్యాలయాల్లోగాని, పని చేసే సమయంలోగాని ఫోనును సైలెంట్‌ మోడ్‌లో ఉంచుకోవాలి.

- దగ్గర వ్యక్తులతో ఫోను సందేశాలతో గాకుండా, నేరుగా కలిసి మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

- ప్రతి మూడురోజులకు ఒకసారి రింగుటోనును మార్చుకోవాలి. శబ్ధాలు మారడం వల్ల మెదడుపై తక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 

- రింగ్జైటీతో బాధపడేవారు సాధ్యమైనంత వరకు మనసును యోగా, ధ్యానం వంటివాటిపై లగ్నం చేయాలి.

- మానసిక ప్రశాంతత ఇచ్చే శబ్ధాలను రింగుటోనుగా పెట్టుకోవాలి.

 

ప్రతి 10 మందిలో 8 మందికి

ప్రస్తుత సమాజంలో ప్రతి పది మందిలో 8 మంది రింగ్జైటీ బారిన పడ్డారని అమెరికాకు చెందిన ది యూనివర్సిటీ ఆఫ్‌ మిచగాన్‌ తన సర్వేలో గుర్తించింది. 2016లో 411 మంది స్మార్ట్‌ఫోను యూజర్లపై ఈ సంస్థ పరిశోధనలు చేసి, దాదాపు 340 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని నివేదికలో పేర్కొంది. వాస్తవానికి 2007 నుంచే ఈ సమస్య ఉందని, అయితే అప్పట్లో స్మార్ట్‌ఫోను ప్రభావం అంతగా లేకపోవడం వల్ల సమస్యగా మారలేదని గుర్తించారు. 2016 నాటికి ఇది బాగా పెరిగిందని, 2020 నాటికి ఇది మరింత ప్రమాదకరస్థాయికి చేరుకుందని నివేదికలో వెల్లడించారు.


Updated Date - 2021-12-07T05:33:54+05:30 IST