Be Careful : ఒక్కో గ్యాంగ్‌.. ఒక్కో స్టైల్‌.. Hyderabad లో వీరికి సెల్‌ఫోన్‌ కనిపిస్తే కొట్టేసుడే..!

ABN , First Publish Date - 2021-11-26T17:52:06+05:30 IST

Be Careful : ఒక్కో గ్యాంగ్‌.. ఒక్కో స్టైల్‌.. Hyderabad లో వీరికి సెల్‌ఫోన్‌ కనిపిస్తే కొట్టేసుడే..!

Be Careful : ఒక్కో గ్యాంగ్‌.. ఒక్కో స్టైల్‌.. Hyderabad లో వీరికి సెల్‌ఫోన్‌ కనిపిస్తే కొట్టేసుడే..!

  • 09మంది అరెస్టు..
  • 92 సెల్‌ఫోన్లు స్వాధీనం..

హైదరాబాద్‌ సిటీ : దృష్టి మరల్చి సెల్‌ఫోన్లను తస్కరిస్తున్న తొమ్మిది మందితో కూడిన నాలుగు ఘరానా గ్యాంగులను సౌత్‌, ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 92 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గ్యాంగు ఒక్కో స్టైల్‌లో సెల్‌ఫోన్లు తస్కరిస్తుంటారు. ఒకరికొకరు లింకు లేకున్నా ఆ నాలుగు గ్యాంగులకు చెందిన వారందరూ గతంలోనూ నేరాలు చేసి జైలుకెళ్లిన వారే. తాజా అరెస్టులతో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోని 19 కేసుల చిక్కుముడి వీడింది. ఫిర్యాదు చేయని వారిని గుర్తించి వారికి సెల్‌ఫోన్లు అప్పగించనున్నారు. గురువారం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ జి.చక్రవర్తి  వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని సీపీ అభినందించారు.


ఆటోలో ఎక్కించుకుని..

హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహమ్మద్‌ మహమూద్‌ అలీ (24), మహమ్మద్‌ ఖాన్‌ (22), ఆమెర్‌ఖాన్‌ (28)లు గ్యాంగ్‌లో సభ్యులు.  ప్యాసింజర్‌ ఆటోను అద్దెకు తీసుకుని ఒకరు డ్రైవ్‌ చేస్తుండగా ఇద్దరు వెనక కూర్చుంటారు. ఒంటరిగా ఉన్న ప్యాసింజర్లను గుర్తించి ఆటోలో ఎక్కించుకుంటారు. కొంతదూరం వెళ్లిన తర్వాత అతని దృష్టి మరల్చి సెల్‌ఫోన్‌ తస్కరించి.. ఒకరు దిగి పోతారు. ఈ నిందితులు ఇటీవల కాలంలో కంచన్‌బాగ్‌, కాలాపత్తర్‌, డబీర్‌పురా, చాదర్‌ఘాట్‌ (2 కేసులు), రాయదుర్గం, మైలార్‌దేవ్‌పల్లి, మారేడ్‌పల్లి, మాదాపూర్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. వీరి వద్ద 26 సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. 


ఇక్కడా అదే ఫార్ములా..

పహాడిషరీఫ్‌ నివాసి మహమ్మద్‌ మన్సూర్‌(45), మహమ్మద్‌ దస్తగిర్‌ (48)లు కలిసి గ్యాంగుగా ఏర్పడ్డారు. ఇద్దరూ పాత నేరస్థులే. జైలునుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు ఆటోను అద్దెకు తీసుకుని ప్యాసింజర్లను కూర్చొబెట్టి దృష్టి మరల్చి వాళ్ల సెల్‌ఫోన్లు తస్కరిస్తుంటారు. నగరంలో అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌తోపాటు పలు పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో 24 సెల్‌ఫోన్లు తస్కరించినట్లు విచారణలో తేలింది. ఎల్‌బీనగర్‌, సైఫాబాద్‌ పీఎస్‌లలో కూడా రెండు కేసులు కూడా నమోదై ఉన్నాయి. మూడు నాన్‌బెయిలబుల్‌ వారంట్లు ఉన్నాయి. మన్సూర్‌పై 52 , దస్తగిర్‌ 45 పాత కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మన్సూర్‌పై 2015లో పీడీయాక్ట్‌ కూడా నమోదైనట్లు సీపీ వెల్లడించారు. 


ఆటో డ్రైవర్లే టార్గెట్‌..

మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మహమ్మద్‌ మోసిన్‌ (30) అలియాస్‌ చిన్న, చాంద్రాయణగుట్ట వాసి మహమ్మద్‌ మూసా (22)తో  కలిసి జతకట్టాడు. మోసిన్‌ పాత నేరస్థుడు. అతను మహమ్మద్‌ మూసాతో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డాడు. ఆటో ఎంగేజ్‌గా మాట్లాడుకుంటారు. ఆటో నడుపుతున్న వ్యక్తి వద్ద నుంచి కాల్‌ చేయడానికి అంటూ ఫోన్‌ అడుగుతారు. అతను ఇవ్వగానే దృష్టి మరల్చి ఒకరు దిగిపోతారు. మరో వ్యక్తి కూడా పారిపోతాడు. ఇలా ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్లు తస్కరించడమే కాకుండా వారిద్దరూ కలిసి పిక్‌పాకెటింగ్‌కు కూడా పాల్పడుతుంటారు. తాజా అరెస్టులతో చాంద్రాయణగుట్ట (3 కేసులు), మీర్‌ చౌక్‌, చార్మినార్‌, సనత్‌నగర్‌ పీఎస్‌లలో వారిపై ఒక్కోకేసు నమోదైనట్లు తేలింది. వారి నుంచి 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఇళ్లల్లో ఉన్న ఫోన్లు..

రియాసత్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ హాజీ (20), అతని స్నేహితుడు చాంద్రాయణగుట్ట నివాసి మహమ్మద్‌ రఫీక్‌ (23) గ్యాంగ్‌గా తయారయ్యారు. వ్యసనాలకు బానిసలుగా మారిన ఆ ఇద్దరు స్నేహితులు డబ్బు కోసం రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్‌లు తస్కరించసాగారు. చోరీ చేసిన ఫోన్‌లను తక్కువ ధరకు తెలిసిన వారికి విక్రయిస్తూ డబ్బు సంపాదించసాగారు. ఇటీవల డబీర్‌పురా, మైలార్‌దేవ్‌పల్లి పీఎ్‌సల పరిధుల్లో ఒక్కో కేసులో నిందితులుగా ఉన్నారు. వారి నుంచి 28 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-26T17:52:06+05:30 IST