ధరల దరువు

ABN , First Publish Date - 2020-09-19T09:29:46+05:30 IST

బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆకుకూరల ధరలు ఆశాన్నంటుతున్నాయి

ధరల దరువు

భగ్గుమంటున్న ఆకుకూరల రేట్లు

తగ్గిన సాగు.. వర్షాలకు దెబ్బతిన్న పంటలు 

పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆకుకూరల ధరలు ఆశాన్నంటుతున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ధర భారం తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుకూరలు ఎంతో మేలని వైద్యనిపుణులు సూచి స్తున్నారు. పోషక విలువలున్న తోటకూర, గోంగూర, బచ్చలకూర, పాలకూర, పొన్నగంటికూర, మెంతికూర, కొత్తిమీర ధరలు భారీగా పెరిగాయి. కొత్తిమీర, పూదీన ధర పరుగులు తీస్తోంది. వీటి ధరలను పరిశీలిస్తే.. చిన్నకట్ట రూ.10 పలుకుతోంది. గతేడాది రూ.10కి పది కట్టలు అమ్మగా.. ఈసారి కేవలం మూడు కట్టలే ఇస్తున్నారు. ప్రస్తుతం పాయల్‌ కూర ప్రజలకు అందుబాటు ధరలో ఉంది. మిగతా ఆకుకూరల ధరలన్నీ ఎగబాకాయి. ఈసారి నియంత్రిత సాగు విధానం అమలులోకి రావడంతో అత్యధికంగా రైతులు పత్తి, కంది, వరి పంటలను సాగు చేశారు. దీంతో కూరగాయ పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇటీవల ముసు రుకున్న వర్షాలకు ఆకుకూరలు వరద నీటిలో మునిగి దెబ్బతిన్నాయి. ఉత్పత్తి తగ్గడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా దీని ప్రభావం ధరల పై చూపుతోంది. 


తగ్గిన సాగు విస్తీర్ణం

రంగారెడ్డి జిల్లాలో ఈసారి నియంత్రిత సాగు అమల్లోకి రావడంతో అత్యధికంగా పత్తి, వరి, కంది పంటలను అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గత ఏడాది 37,579 ఎకాల విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేయగా... అందులో 5,141 ఎకరాల్లో ఆకుకూరలు సాగయ్యాయి. ఈసారి 16,346 ఎకరాల్లో మొత్తం కూరగాయల సాగు చేయగా.. అందులో 1,840 ఎకరాల్లో ఆకుకూరాలు సాగు చేశారు. గత ఏడాదితో పోల్చితే సాగు విస్తీర్ణం 21,236 ఎకరాలు తగ్గింది. ఇందులో ఆకుకూర విస్తీర్ణం 3,301 ఎకరాలు తగ్గింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఉప్పరిగూడ, కర్గగూడ, కాప్పడు, సీతారాంపేట, తిప్పాయిగూడ, తిత్తాపూర్‌, గడ్డ మల్లయ్యగూడ, మొండిగౌరెల్లి గ్రామాల్లో కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. అలాగే చేవెళ్ల పరిధిలోని కేసారం, గుండాల, అల్లాడ, దేవరాంపల్లి, ఆలూరు, వెంకన్నగూడ, పామెన, చనువల్లి, మీర్జాగూడ గ్రామాల్లో ఎక్కువగా కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. షాద్‌నగర్‌ నియోజక వర్గంలోని ఫరూక్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ మండలాల్లో కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. 


మేడ్చల్‌ జిల్లాలోని కీసర, ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి, మేడ్చల్‌ మండలాల్లో కూరగాయలను సాగు చేస్తున్నారు. గతేడాది మేడ్చల్‌ జిల్లాలో 9,712 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేశారు. అందులో 2,750 ఎకరాల్లో ఆకుకూరలు సాగు చేశారు. ఈసారి 10,285 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయ పంటలు సాగు చేయగా.. అందులో ఆకుకూరలు 3005 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. గత ఏడాదిలో సాగు చేసిన కూరగాయ పంటలను పోల్చుకుంటే ఈసారి 573 ఎకరాలు సాగు పెరిగింది. ఆకుకూరల సాగు కూడా 255 ఎకరాలు పెరిగింది. కానీ.. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయలు, ఆకుకూరలు దెబ్బ తిన్నాయి. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలో అత్యధిక సాగు మర్పల్లి, మోమిన్‌పేట, పూడూరు మండలాల్లో కూరగాయలు సాగవుతున్నాయి.


ధరలు మండిపోతున్నాయి- లక్ష్మీ, వినియోగదారులు, చేవెళ్ల

కూరగాయలతోపాటు ఆకుకూరల ధరలూ మండి పోతున్నాయి. ఏ ఆకు కూరలైనా రూ.10కి కేవలం రెండు కట్టలే ఇస్తున్నారు. గతంలో మాది రిగా మార్కెట్‌లో ఆకు కూరలు కనిపించడం లేదు. ఉన్నవాటికి వినియోగదారులు ఎగబడ టంతో ధరలు అమాంతం పెంచుతున్నారు. 


వర్షాలతో పంటలకు దెబ్బ-  గోపాల్‌రెడ్డి, రైతు, మల్కాపూర్‌

ఈ ఏడాది ఆకుకూరల సాగు తగ్గింది. కరోనా నేపథ్యంలో ఆకుకూరలకు బదులుగా ఇతర కూరగాయాల పంటలను సాగు చేశారు.  పెట్టుబడి పెరిగింది. దీనికితోడు కూలీల కొరతఉంది. వర్షాలకు పంటలు దెబ్బతిన్నడంలో మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి.


జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది- సునందారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉద్యానశాఖ అధికారి 

ఈ సారి కూరగాయల సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. రైతులు అత్యధికంగా పత్తి, కంది, వరి పంటలను సాగు చేశారు. కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు కూడా పెరిగాయి. కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నాము. 


ఆకు కూరల ధరల వివరాలు

కూర రకం గత ఏడాది ప్రస్తుత

(ధర రూ.10) (ధర రూ.10)

పాలకూర 4 కట్టలు 3 కట్టలు

తోటకూర 8 కట్టలు 4 కట్టలు

గోంగూర 6 కట్టలు 4 కట్టలు

మెంతంకూర 8 కట్టలు 3 కట్టలు

పాయల్‌కూర 9 కట్టలు 8 కట్టలు

చుక్కకూర 5 కట్టలు 4 కట్టలు

ఉల్లిఆకు 5 కట్టలు 3 కట్టలు

బచ్చలికూర 8 కట్టలు 4 కట్టలు

కొత్తిమీర 4 కట్టలు 2 కట్టలు

పూదీనా 4 కట్టలు 2 కట్టలు


రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఆకు కూరల సాగు వివరాలు

సంవత్సరం కూరగాయలు రంగారెడ్డి మేడ్చల్‌

(ఎకరాలు) (ఎకరాలు)

2019-20 మొత్తం కూరగాయల సాగు 37,579 9,712

2019-20 ఆకుకూరల సాగు 5,141 2,750

2020-21 మొత్తం కూరగాయల సాగు 16,346 10,285

2020-21 ఆకుకూరల సాగు 1,840 3005

Updated Date - 2020-09-19T09:29:46+05:30 IST