ఓరి నాయనో.. ఎందుకు కలిశామురా..!

ABN , First Publish Date - 2020-04-08T11:11:16+05:30 IST

నెల్లూరులోని ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పుడు వైద్య వర్గాల్లో కలకలం రేపుతోంది. అతడు తన ఆసుపత్రి

ఓరి నాయనో.. ఎందుకు కలిశామురా..!

దడ పుట్టిస్తున్న వైద్యుడితో సంబంధాలు

స్వాబ్‌ టెస్ట్‌కు ప్రముఖుల క్యూ

నిలకడగా డాక్టర్‌ ఆరోగ్యం

ఆచూకీ దొరకని వారు ఇంకా 50 మంది ?


నెల్లూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరులోని ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పుడు వైద్య వర్గాల్లో కలకలం రేపుతోంది. అతడు తన ఆసుపత్రి ప్రారంభం నేపథ్యంలో అనేకమంది డాక్టర్లతోపాటు మరికొంత మంది ప్రముఖులను కూడా కలిసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఆ డాక్టర్‌ మంత్రి అనిల్‌ను కలవడంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. నెగిటివ్‌ ఫలితం రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇదే వరుసలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. 


పలువురికి చికిత్స

కరోనా సోకిన డాక్టర్‌ నగరంలోని  ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో కొంతమంది డాక్టర్లతో చికిత్స అందించారు. వారంతా ఇప్పుడు స్వాబ్‌ టెస్ట్‌కు శాంపిల్స్‌ ఇస్తున్నారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కూడా కరోనా సోకిన డాక్టర్‌ను గతంలో కలిశారు. ప్రస్తుతం ఆయన కూడా స్వాబ్‌ టెస్ట్‌కు శాంపిల్‌ ఇచ్చారు. వీరితో పాటు కరోనా సోకి డాక్టర్‌ను నేరుగా కాంటాక్ట్‌ అయిన వారు సుమారు వందమంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. అలానే వీరందరిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడు ఈ వ్యవహారమే  అధికార వర్గాల్లో కూడా దడ పుట్టిస్తోంది. కాంటాక్ట్స్‌లో ఎవరికైనా పాజిటివ్‌ అని తేలితే సమస్య మరింత ఎక్కువవుతుందని భయపడుతున్నారు. అయితే వీరి కాంటాక్ట్స్‌ను కూడా ముందుగానే గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. 


దొరకని 50 మంది ఆచూకీ

ఇక ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో సుమారు 50 మంది ఆచూకీ అధికారులకు లభ్యం కావడం లేదని సమాచారం. ఢిల్లీకు వెళ్లి వచ్చిన వారి కాంటాక్ట్స్‌లోనే ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిని గుర్తించే పనిలో అధికార యంత్రాంగం  ఉంది. కాగా కరోనా సోకిన డాక్టర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికా రులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-04-08T11:11:16+05:30 IST