Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాత బరువు వదిలేద్దాం!

ఆరోగ్యం(29-12-2020)

‘అధిక బరువు తగ్గడం’... కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతూ అధిక శాతం మంది తీసుకునే సరికొత్త నిర్ణయం ఇది! ‘ఇందుకోసం కడుపు మాడ్చే డైటింగ్‌ అనుసరిస్తే, పోషకాల లోపం, నీరసాలూ తప్పవు’ అంటున్నారు   సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. ‘నిజానికి బరువు తగ్గాలంటే సరిపడా తినాలి’ అంటున్న రుజుత ఇంకా ఏం చెబుతున్నారంటే....


ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌, కీటో డైట్‌... బరువు తగ్గడం కోసం వీటిలో ఏదో ఒక వెయిట్‌ లాస్‌ ట్రెండ్‌ ఫాలో అయిపోదామని కొత్త సంవత్సరం వేళ నిర్ణయం తీసేసుకున్నారా? అయితే కాస్త ఆగండి. బరువు తగ్గే ప్రయత్నంలో విలువైన పోషకాలు... పిండిపదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్ల మీద కర్ఫ్యూ విధించకండి. నిజం చెప్పాలంటే... బరువు తగ్గడం కోసం డైటింగ్‌ చేయడమనే ఆలోచనే సరైంది కాదు. లో క్యాలరీతో కూడిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే అనుకుంటే పొరపాటు.  ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం కోసమే బరువు తగ్గాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇందుకోసం మూడు సూత్రాలను అనుసరించండి.


అంతా స్థానికం

2021లో మీరు అనుసరించబోయే డైట్‌, మరో 20 లేదా 30 ఏళ్ల తర్వాత కూడా అనుసరించడానికి వీలుగా ఉండాలి. ఆ డైట్‌ మీ పిల్లలు కూడా అనుసరించేలా ఉండాలి. మీ తల్లిదండ్రులు, పూర్వీకులు అనుసరించినదై, ఆరోగ్యాన్ని అందించేదై ఉండాలి. ఆ డైట్‌ ఔషధ గుణాలు కలిగి ఉండి, సాధారణ జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్నపాటి సుస్తీలను తగ్గించాలి. 2021లో మీరు తీసుకునే ఆహార నిర్ణయంలో స్థానిక వంటలకే పెద్ద పీట వేయాలి. స్థానికంగా పండించిన పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, రుతువులవారీ పంటలు తినాలి. 


వ్యాయామం ముఖ్యం

ఏదైనా అనుకూలమైన వ్యాయామం ఎంచుకోవాలి. నాలుగు రోజులు చెమటలు కక్కించి, ఆపేసే వ్యాయామాలకు బదులు మీకు అనుకూలమైనది, ఇంట్లో సైతం వీలు పడే వ్యాయామం ఎంచుకోవాలి. జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ లాంటి వాటికి అన్ని చోట్లా అనుమతులు లేవు కాబట్టి యోగా, సైకిల్‌ తొక్కడం, నడక లాంటి వ్యాయామాలు మొదలుపెట్టండి. ఇంట్లో కూర్చొని చిరుతిళ్లు తింటూ గంటల తరబడి వెబ్‌ సిరీస్‌ చూసే అలవాటుకు స్వస్తి చెప్పండి. కూర్చున్నప్పుడు ప్రతి అరగంటకూ ఒకసారి కనీసం మూడు నిమిషాలపాటైనా లేచి నిలబడండి. 


ఎలా తగ్గాలనేదే కీలకం

ఎంత త్వరగా బరువు తగ్గగలను? అని కాకుడాఆ, బరువు తగ్గాలంటే నేనేం చేయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టండి. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల మీద మనసు పెట్టండి. రోజు మొత్తంలో తీసుకునే అల్పాహారాలు, భోజనాలు రోగనిరోధకశక్తిని పెంచి, నడుము చుట్టుకొలతను తగ్గించేలా, అందమైన, ఆరోగ్యకరమైన చర్మం పొందేందుకు తోడ్పడేలా ఉండాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే భోజనాలు ప్రణాళికాబద్ధంగా తయారుచేసుకోవాలి. ఇందుకోసం.....


ఉదయం అల్పాహారం: పోహా (అటుకుల ఉప్మా). ఉప్మా (గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ), ఇడ్లీ, పరోటా, దోశ, డాలియా వీటిలో ఏదో ఒకటి పాలతో పాటు తీసుకోవచ్చు


మధ్యాహ్న భోజనం: రోటీ, కూరగాయలు, పప్పు, అన్నంలోనికైతే   ఈ కాలంలో పండే  కూరగాయలు వాడాలి. పెసలను పుప్పులకు ప్రత్నామ్నాయంగా వాడుకోవచ్చు. మన దేశంలో పండే 65 వేల రకాల పప్పుధాన్యాలు, తృణధాన్యాలలో కనీసం 10 నుంచి 15 రకాల పప్పుధాన్యాలైనా నెల మొత్తంలో తీసుకునే ప్రయత్నం చేయాలి. 


రాత్రి భోజనం: రాత్రి భోజనం తినడానికి, వండడానికీ తేలికగా ఉండాలి. అన్నం బదులు పెసరపప్పు కిచిడీ తింటే మేలు. బాలీవుడ్‌ హీరోయిన్లు కరీనా కపూర్‌, ఆలియా భట్‌ల రాత్రి భోజనం ఇదే!


యువతలో అధిక రక్తపోటు, మధుమేహం

ఇటీవలి కాలంలో యువతలో సైతం అధిక రక్తపోటు, మధుమేహం సర్వసాధారణమైపోయాయి. ఈ రెండు సమస్యలకు చెక్‌ పెట్టాలంటే ప్యాకెట్‌ ఫుడ్‌ మానుకోవాలి. ప్యాకెట్‌ ఫుడ్‌లో అధిక మొత్తాల్లో ఉండే ఉప్పు, చక్కెరలు ఉంటాయి. టెట్రా ప్యాక్‌ జ్యూస్‌, బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌... వీటి సంఖ్య పెరిగేకొద్దీ మీ డైట్‌, ఆరోగ్యం తరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. రోజు మొత్తంలో కనీసం 30 నిమిషాలైనా వ్యాయామానికి కేటాయించాలి. పడకగదికి చేరుకుని నిద్రకు ఉపక్రమించడం ప్రశాంతంగా సాగాలి. పొద్దు కుంగే సమయంలో గ్యాడ్జెట్స్‌తో ఎక్కువ సమయం గడపవద్దు.  బెడ్‌రూమ్‌లోకి వీటిని తీసుకెళ్లవద్దు.


కీటో కాటు

కొవ్వులు, పిండిపదార్థాల కొరత సృష్టించడం లేదా దీర్ఘసమయాల పాటు పొట్ట మాడ్చుకోవడం బరువు తగ్గడం కోసం ఎక్కువ మంది అనుసరించే ఉపవాస ప్రక్రియలు. అయితే పదేళ్ల క్రితం బరువు తగ్గడం కోసం ఆహారంలో పిండిపదార్థాలను నిషేధించే విధానం అనుసరించేవాళ్లు. ఇప్పుడు వాటి స్థానాన్ని కొవ్వులు ఆక్రమించాయి. ఈ పద్ధతులన్నిట్లో స్పష్టంగా కనిపించేది పోషకాల కొరతే!


పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తుల ఆధారంగా పదార్థాలను సూచిస్తూ, పండగ సంబరాలు సైతం జరుపుకోనివ్వకుండా చేసే డైట్‌ అనుసరించదగినది కాదు. మనం అనుసరించే డైట్‌ 2021లోనే కాదు 2051లోనూ అనుసరించదగినదిగా ఉండాలి. అంటే దానిలో కాలానుగుణంగా, స్థానికంగా పండేవన్నీ ఉండి తీరాలి. అలాకాకుండా కొన్నిటిని అనుమతిస్తూ, మరికొన్నిటిని పూర్తిగా నిషేధించే డైట్‌ పద్ధతీ సరైంది కాదు. మరీ ముఖ్యంగా పేర్ల ఆకర్షణలో పడి ఏ డైట్‌నూ అనుసరించకూడదు. 


గర్భిణుల ఆహారం

మంచి భోజనంతో పాటు ఫిట్‌నెస్‌, విశ్రాంతి గర్భిణులకు చాలా ముఖ్యం.  వీరు జొన్నలు, సజ్జలు కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇంట్లో తయారుచేసుకున్న కరివేపాకు పచ్చడి, వేరుసెనగ పచ్చడి, నువ్వుల చట్నీ ఆరోగ్యకరమే కాదు భోజనానికి రుచిని పెంచి, చిరుతిళ్ల మీదకు మనసు మళ్లకుండా చేస్తాయి. అలాగే ఉసిరి మురబ్బా తినాలి. పెరుగు, మజ్జిగ, నిమ్మకాయ షర్బత్‌లతో డీహైడ్రేషన్‌ తలెత్తకుండా చేసుకోవచ్చు.  


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...