Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 18:09:08 IST

కన్హయ్య లాల్ హంతకులను కఠినంగా శిక్షించాలి : సెలబ్రిటీలు, నేతల డిమాండ్

twitter-iconwatsapp-iconfb-icon
కన్హయ్య లాల్ హంతకులను కఠినంగా శిక్షించాలి : సెలబ్రిటీలు, నేతల డిమాండ్

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతోంది. బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నేత నూపుర్ శర్మ (Nupur Sharma)కు మద్దతిచ్చినందుకు ఆయనను హత్య చేయడాన్ని బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 


నూపుర్ శర్మ మే నెలాఖరులో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమెకు కన్హయ్య లాల్ మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. అనంతరం ఆయనపై కేసు నమోదైంది. ఆయన బెయిలుపై విడుదలయ్యారు. ఆయన టైలరింగ్ దుకాణంలోకి మంగళవారం ఉదయ్‌పూర్‌లో నివసిస్తున్న గోస్ మహమ్మద్, అబ్దుల్ జబ్బార్ ప్రవేశించి, తమకు బట్టలు కుట్టాలని కోరినట్లు తెలుస్తోంది. ఆయన వారిలో ఒకరికి కొలతలు తీస్తూ ఉండగా మరొకరు దాడి చేసి, దాదాపు 26 సార్లు పొడిచి, హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఇదిలావుండగా, ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, బెయిలుపై విడుదలైన కన్హయ్య లాల్‌ను ఫోన్ ద్వారా విపరీతంగా బెదిరించేవారని, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. ఓ రోజు ఇరు పక్షాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య చేసిన తర్వాత  గోస్ మహమ్మద్, అబ్దుల్ జబ్బార్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇస్లాంకు జరిగిన అవమానానికి తాము ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు.  వీరిద్దరినీ రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.


ఈ నేపథ్యంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు శివానంద తివారీ, బాలీవుడ్ సెలబ్రిటీలు కంగన రనౌత్, స్వర భాస్కర్, గౌహర్ ఖాన్, అనుపమ్ ఖేర్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 


బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఇచ్చిన ట్వీట్‌లో, ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్య అత్యంత బాధాకరమని, దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఓ మతాన్ని కాపాడుతున్నామని చెప్పుకునేవారిపై వేగంగా విచారణ జరిపి, నడి బజారులో ఉరి తీయాలని, మతం ముసుగులో ఇలాంటి అమానుష చర్యలకు మరొకరు పాల్పడకుండా ఈ శిక్ష ఉండాలని డిమాండ్ చేశారు. 


ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఉదయ్‌పూర్ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మతపరమైన తీవ్రవాదం ఏ మతస్థులనైనా గుడ్డివారిని చేస్తుందని, అంతేకాకుండా వారి ఆలోచనా శక్తిని వారికి దూరం చేస్తుందని అన్నారు. ఈ కేసులో హంతకులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. 


ఆర్జేడీ నేత శివానంద తివారీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ హత్య సంఘటనను తాను తీవ్రంగా ఖండించానని చెప్పారు. ఈ అమానుష నేరానికి పాల్పడినవారు మన దేశంలో అస్థిరతను సృష్టించాలనుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడాలని ఆలోచించే సాహసం మరొకరు చేయని విధంగా సాధ్యమైనంత కఠినంగా హంతకులను శిక్షించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. 


కంగన రనౌత్ ఇచ్చిన పోస్ట్‌లో, ‘‘నూపుర్ శర్మకు మద్దతిచ్చినందుకు ఈ వ్యక్తి తలను తెగనరికారు. తలను తెగనరకడాన్ని జీహాదీలు వీడియో తీశారు. వాళ్ళు ఆయన దుకాణంలోకి బలవంతంగా చొరబడ్డారు, శరీరం నుంచి తలను వేరు చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదంతా దేవుడి పేరుతో జరిగింది! వాళ్ళు ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ తలను దేవుని పేరుతో తెగ్గోశారు! ఆ తర్వాత ఇలా పోజు ఇచ్చారు. అంతేకాకుండా అనేక వీడియోలను చిత్రీకరించారు, వాటిని చూసే సాహసం నాకు లేదు. నేను స్థాణువైపోయాను’’ అని పేర్కొన్నారు. 


స్వర భాస్కర్ ఇచ్చిన పోస్ట్‌లో, కన్హయ్య లాల్ హత్య అత్యంత హేయమైనదని, తీవ్రంగా ఖండించదగినదని పేర్కొన్నారు. హంతకులను చట్టం ప్రకారం కఠినంగా, సకాలంలో శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ తీవ్రమైన నేరం సమర్థించదగినది కాదన్నారు. 


గౌహర్ ఖాన్ ఇచ్చిన పోస్ట్‌లో, తన కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్లయిందని తెలిపారు. మీ మతానికి ప్రాతినిధ్యం వహించే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. ఓ పోస్ట్ పెట్టినందుకు హత్య చేసినవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నేరస్థులంతా ఒకే విధంగా ఉంటారన్నారు. 


అనుపమ్ ఖేర్ ఇచ్చిన ట్వీట్‌లో, కన్హయ్య లాల్ హత్య అత్యంత భయానకంగా ఉందని, ఇది అత్యంత విచారకరమని, చాలా కోపంగా ఉందని పేర్కొన్నారు. 


రణ్‌వీర్ షోరే ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంలో ఇస్లాం పాటిస్తున్నవారిని ఆత్మావలోకనం చేసుకోవడానికి, దానిలోని మతఛాందసవాదం, తీవ్రవాదం సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడానికి బదులుగా, వారు బాధితులని చిత్రీకరించడంలో సహాయపడినవారందరికీ ఇది మేలుకొలుపు అని చెప్పారు. అయితే నిద్రపోతున్నట్లు  నటిస్తున్నవారిని మేలుకొలపడం సాధ్యం కాదన్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.