Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి రోజున మధుర, బృందావనాలలో జరిగే వేడుకలు.. విశేషాలు..

ABN , First Publish Date - 2022-08-19T14:59:34+05:30 IST

శ్రీ కృష్ణ జన్మాష్ణమి అంటే హిందూలందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ. శ్రావణ మాసంలో జరుపుకునే కృష్ణ జన్మాష్టమి ఎనిమిది రోజుల కృష్ణ పక్షంలో వస్తుంది.

Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి రోజున మధుర, బృందావనాలలో జరిగే వేడుకలు.. విశేషాలు..

శ్రీ కృష్ణ జన్మాష్ణమి అంటే హిందూలందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ. శ్రావణ మాసంలో జరుపుకునే కృష్ణ జన్మాష్టమి ఎనిమిది రోజుల కృష్ణ పక్షంలో వస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్షంలోని అష్ణమి తిథి, రోహిణి నక్షత్రంలో జన్మించాడని, ఈరోజున శ్రీ కృష్ణాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కొందరైతే కృష్ణుని బాల రూపమైన లడ్డూ గోపాలుని పూజిస్తారు. 


ఈరోజున ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. రకరకాల వంటకాలను వండి, తమ ఇళ్ళను పూలతో అలంకరిస్తారు. కృష్ణుడు తన బాల్యాన్ని, యుక్తవయస్సును గడిపిన పవిత్ర పట్టణం బృందావనంలో అయితే ఈ వేడుకలు మరింత ఆసక్తిగా జరుగుతాయి. యమునా నది ఒడ్డున ఉన్న బృందావనంలో కృష్ణుడు తన గోపికలతో రాసలీలలు జరిపాడని నమ్ముతారు.  ఈ వేడుకలు బృందావన్‌లో 10 రోజుల ముందు నుంచే ప్రారంభమవుతాయి. 


బృందావన్‌లో దాదాపు 4000 ఆలయాలు పైగానే ఉన్నాయి, బంకే బిహారీ మందిర్, రంగనాథ్‌జీ ఆలయం, ఇస్కాన్ ఆలయం, రాధారామన్ ఆలయాలలో ముఖ్యంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేకించి అభిషేకాలు, కృష్ణునికి ఆచార స్నానం చేయిస్తారు. యమునా నదికి సమీపంలో ఉన్న మధుబన్ అనే ప్రాంతంలో అయితే 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన గోపికలతో కలిసి రాసలీలలు జరిపాడని ప్రతీతి. ఈ పదిరోజులలో స్వామివారి రాసలీలను రాధాకృష్ణుల ప్రణయ కేళీ వినోదాలను పిల్లలు ఆటలతో, పాటలతో మధుర వీధులలో ప్రదర్శించి తరిస్తారు. 


స్థానిక జానపద కథల ప్రకారం, ఈ రోజులలో శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు జరిపేందుకు వస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే అటుగా సాయంత్రాలు ఎవరూ వెళ్ళరు. ఆ ప్రదేశాన్నంతా చక్కగా అలంకరించి ఉంచుతారు. కానీ పగటిపూట మధుబన్ కు అనేక మంది భక్తులు, యాత్రికలు ఎందరో వచ్చి ఆ ప్రదేశాలను చూసి తరిస్తారు.


ఇక్కడ జరుపుకునే జన్మాష్టమి పండుగలో రెండు ముఖ్యమైన ఉత్సవాలలో జూలనోత్సవ్ ముఖ్యమైనది. ఈ ఉత్సవంలో  శ్రీ కృష్ణుని వారి ఇళ్ళకు స్వాగతించడానికి ఇళ్ళ ప్రాంగణాలు అలంకరిస్తారు., ఆయనను పసివాడిగా భావించి భక్తులు తమ ఇళ్ళు, దేవాలయాలను పూలతో, రంగురంగుల రంగవల్లులతో అలంకరించి, ఊయలలను ఉంచే ఆచారం ఇది.


కృష్ణుడు అర్థరాత్రి జన్మించాడు కాబట్టి ఈ వేడుకలు కూడా ఆ సమయం నుంచే ప్రారంభం అవుతాయి. ఇక ప్రధాన కష్ణ జన్మ స్థలంలో జరిగే వేడుకలో ముఖ్యంగా ఆ విగ్రహాన్ని గర్భ గృహ అనే గదిలో ఉంచుతారు. దానికి పాలు, పెరుగుతో ఆచారబద్ధంగా స్నానం చేయించి సాంప్రదాయ దుస్తులు వేసి చుట్టూ ఊయ్యాలలు కడతారు. 


భక్తులు ప్రార్థలను చేసే సమయంలో ఈ ఉయ్యాలలను ఊపుతారు. ఆ సమయంలో ఏ కోరిక కోరినా తప్పక నెరవేరతుందని భక్తులు నమ్ముతారు. భక్తుల ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే చప్పన్ భోగ్ అనే 56 వంటకాలను స్వామివారికి సమర్పిస్తారు. ఉపవాస దీక్ష చేస్తున్న భక్తులు దీనిని మిగతావారికి పంపిణీ చేస్తారు. ఈ వేడుకలకు దాదాపు ఎనిమిది లక్షలకు పైగానే భక్తులు ప్రతి సంవత్సరం మధుర, బృందావన్ కు వస్తారు. 

Updated Date - 2022-08-19T14:59:34+05:30 IST