ఆనందంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-16T05:30:00+05:30 IST

తెలుగు లోగిళ్ళలో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను ఆనందకరంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య సంతోషకర తీయని జ్ఞాపకాలతో ముచ్చటగా మూడు రోజుల పండుగ ముగిసింది. పండుగ ఆద్యంతం కొత్త అల్లుళ్ళతో, మిత్రగణంతో కళకళలాడాయి.

ఆనందంగా సంక్రాంతి సంబరాలు
చిన్నమండెంలో చిట్లాకుప్ప వద్ద ప్రజలు

ఆకట్టుకున్న చిట్లాకుప్పలు..పార్వేట ఉత్సవాలు

కడప (మారుతీనగర్‌), జనవరి 16 : తెలుగు లోగిళ్ళలో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను ఆనందకరంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య సంతోషకర తీయని జ్ఞాపకాలతో ముచ్చటగా మూడు రోజుల పండుగ ముగిసింది. పండుగ ఆద్యంతం కొత్త అల్లుళ్ళతో, మిత్రగణంతో కళకళలాడాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ పర్వదినాలలో ప్రతీ ఇంటి ముందు రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో ఇంటి ప్రాంగణాలు హరివిల్లును తలపించాయి. సంక్రాంతి అంటేనే పల్లె ప్రాంతాల ప్రజల్లో చెప్పలేని ఆనందం వారి కళ్ళల్లో తొణికిస లాడుతుంది. అలాంటిది ఈసారి వారిలో మునుపటి ఉత్సాహం కాన రాలేదనే చెప్పాలి. దీనికంతటికీ ప్రధాన కారణం కరోనా. కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వాలు ముందస్తుగా అప్రమత్తమై గుంపులు గుంపులుగా జనం ఉండరాదని, సభలు, సమావేశాలు, పరిమిత సంఖ్యలో జరుపుకోవాలని ఆంక్షలు విధించడంతో పండుగ మూడు రోజులు జిల్లాలోని పలు గ్రామాల్లో క్రీడా, ముగ్గుల పోటీలను నిలిపివేశారు. వివిధ క్రీడలలో గెలుపొందిన యువతీ, యువకులకు చివరిరోజున గ్రామాలలో చిన్నపాటి సభలు నిర్వహించి బహుమతులు, సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం పరిపాటి. పలు గ్రామాల్లో నెత్తిపై గొబ్బెమ్మలు ఎత్తుకొని పురవీధులలో బ్యాండు మేళాలతో ఊరేగింపుగా డ్యాన్సులు వేసుకుంటూ సంతోషంతో సంక్రాంతి పండుగను నిర్వహించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా వాటిని రద్దు చేయడంతో కొన్ని గ్రామాలలో సంక్రాంతి కళ కాస్త తగ్గినట్లుగా కనిపించింది. కాగా కనుమ పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. పశువులను అందంగా అలంకరించారు. చిట్లాకుప్ప వద్ద కాటమరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. చిట్లాకుప్ప వద్ద బెదిరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై చిట్లాకుప్ప వద్ద కనుమ ఉత్సవాలను తిలకించారు. 


కన్నుల పండువగా పార్వేట ఉత్సవాలు

పలు ఆలయాలలో ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరింపచేసి ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాలలోనే ఏకాంతంగా పార్వేట ఉత్సవాలను జరిపారు. అనంతరం పిల్లలకు గాలిపటాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. ఊరిబయట కుందేళ్లతో పార్వేట ఉత్సవాలను పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మైదుకూరు పట్టణంలో కనుమ పండుగ సందర్బంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేత సమేత మాధవరాయుడు ప్రత్యేక అలంకరణలో పల్లకీలో పారువేటకు వెళ్లారు. కాగా పారువేట సందర్భంగా ఏర్పాటు చేసిన  కోలాటం, చెక్కభజన. విచిత్రవేషాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



గాలిపటాల ఎగరేత హోరు

సంక్రాంతిని పురస్కరించుకొని యువత, పిల్లలు ఈసారి ఎక్కువగా గాలిపటాల ఎగువవేసేందుకు మక్కువ చూపారు. గ్రామాలలో ఆటపాటలను రద్దు చేయడంతో గాలిపటాలను ఎగురవేసేందుకు యువత పోటీలు పడ్డారు. ఆకాశంలో గాలిపటాలు చక్కర్లు కొడుతూ దారం వదలినంతగా అంతకంత దూరం వెళ్తుండడంతో యువత కేరంతల హోరులో తేలారు. 


‘ముంపు’లో కానరాని సంక్రాంతి

రాజంపేట, జనవరి 16: అన్నమయ్య ప్రాజెక్టు తెగి సర్వం పోగొట్టుకున్న ముంపు బాధితులకు సంక్రాంతి సంబరం కనుమరుగైంది. గత ఏడాది తమ సొంత ఇళ్లల్లో పుష్కలమైన పంట దిగుబడులతో బంధుమిత్రులతో ఘనంగా జరుపుకున్న సంక్రాంతి పండుగ వారికి కలగా మారిపోయింది. మొత్తం ఇళ్లన్నీ కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన వీరు దాతల సహకారంతో పట్టలు కట్టుకుని గుడిసెల్లో జీవిస్తున్నారు. సంక్రాంతి అంటే హిందువులకు పెద్ద పండుగ. పండుగ మూడు రోజులే కాక ఆ నెలంతా రంగవల్లులతో అన్ని వీధులు కళకళలాడతాయి. అందరూ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నా ఈ గ్రామాల వాసులు మాత్రం పండుగకు దూరమయ్యారు. గుడిసెల వద్ద కూలిపోయిన పెద్దపెద్ద బండరాళ్ల దాతలు ఇచ్చిన బట్టలతోనే చలికి గజగజా వణుకుతూ కాలం గడుపుతున్నారు. చుట్టూ భూములన్నీ ఇసుకమేటతో దెబ్బతిని వ్యవసాయం లేకపోవడంతో కూలి పనులు కూడా దొరకని పరిస్థితి. పులపత్తూరు గ్రామంలో అరుంధతివాడ, హరిజనవాడ, రాజుల కాలనీతో పాటు రామచంద్రాపురం, తొగూరుపేట, సాలిపేట, పాటూరు, గుండ్లూరు హరిజనవాడ, మందపల్లె ఇలా 20 గ్రామాల ముంపు బాధితులు సంక్రాంతికి దూరమైపోయారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఇల్లు కట్టిస్తామని చెప్పి రెండు నెలలు అవుతున్నా ఇంకా నిర్మాణం పునాదుల్లోనే ఉన్నాయి. తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇళ్లు కట్టించాలని ముంపు బాధితులు కోరుతున్నారు. 


ఇల్లుంటే కదయ్యా... 

- కె.శంకరమ్మ, పులపత్తూరు 

ఇల్లుంటే కదయ్యా సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి.. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయే.. బోకే, బొచ్చె కూడా మిగలకుండా అన్నీ కొట్టుకుపోయే.. దాతలు, ప్రభుత్వం చేస్తున్న సహాయంతో గుడిసెలో కాలం వెల్లదీస్తున్నాం. దీంతో పండుగ చేసుకోలేదు. ఈ చలిని భరించలేకున్నాం. రెండు నెలలుగా మేము పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇంకైనా మాకు ఇల్లు కట్టించి ఇవ్వండయ్యా.


సంక్రాంతి అంటే నెల రోజుల పండగ

- వి.చిన్నక్క, పులపత్తూరు 

సంక్రాంతి పండుగను నెల రోజుల నుంచే జరుపుకునేవాళ్లం. వీధి అంతా పోటీ పడి గుమ్మడి ఆకులు, గుమ్మడి పూలు తెచ్చి గౌరమ్మను పెట్టుకుని గొబ్బిళ్లు తట్టేవాళ్లం. ఇక మూడు రోజుల పండుగ అంటే మా శక్తికాడికి పిండివంటలు చేసుకుని హాయిగా ఉండేవాళ్లం. ఆ వరద ఏమని వచ్చి అంతా కొట్టుకుపోయిందో... రెండు నెలలుగా మేము పడుతున్న బాధ ఎవ్వరికీ రాకూడదు సామి.


చలికి వణుకుతూ చంటిబిడ్డతో..

- ఇ.లక్ష్మీదేవి, పులపత్తూరు 

ఈ చలికి పడుకోవడానికి కూడా స్థలం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఉండేదానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేనప్పుడు ఇంక సంక్రాంతి పండుగ ఏం జరుపుకుంటాం. చలికి చంటిబిడ్డను వేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమంటే తట్టుకుంటాం.. ఈ చలికి, దోమలకు ఈ చంటి బిడ్డ ఎలా తట్టుకుంటాడయ్యా.. 


Updated Date - 2022-01-16T05:30:00+05:30 IST