పీఎం-కేర్స్ నిధికి 2 నెలల పింఛను విరాళం... సైనికుడిపై సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసలు...

ABN , First Publish Date - 2020-04-06T02:24:07+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటం కోసం పీఎం-కేర్స్ నిధికి రెండు నెలల పింఛనును విరాళం ఇచ్చిన మాజీ

పీఎం-కేర్స్ నిధికి 2 నెలల పింఛను విరాళం... సైనికుడిపై సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసలు...

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటం కోసం పీఎం-కేర్స్ నిధికి రెండు నెలల పింఛనును విరాళం ఇచ్చిన మాజీ సైనికుడిపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆదివారం ప్రశంసల వర్షం కురిపించారు. 


గర్‌వాల్ రైఫిల్స్ నుంచి పదవీ విరమణ పొందిన సైనికుడు జనార్దన్ ప్రసాద్ పీఎం-కేర్స్ నిధికి రెండు నెలల పింఛనును విరాళంగా ఇచ్చారు. 


ఈ నేపథ్యంలో సీడీఎస్ జనరల్ రావత్ మాట్లాడుతూ జనార్దన్ ప్రసాద్‌ను చూసి గర్విస్తున్నానన్నారు. ఆయన మాటలు ప్రతి మాజీ సైనికుడి మనసులోనూ, అదేవిధంగా ప్రస్తుతం సైన్యంలో పని చేస్తున్న సైనికుల మనసుల్లోనూ ప్రతిధ్వనిస్తుందని భావిస్తున్నాన్నారు. ఇది గత కాలపు సైన్యమని, ఇది భవిష్యత్తు సైన్యమని, దీనిలో గర్వంతో, గౌరవంతో పనిచేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు. 


ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పీఎం-కేర్స్) నిధిని మార్చి 28న ఏర్పాటు చేశారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. 


జనార్దన్ ప్రసాద్ దాతృత్వాన్ని సీనియర్ ఆర్మీ అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. సైనికులు బతికేది డబ్బు కోసం కాదని ఆయన నిరూపించారని, ఇది మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్తున్నారు.


సీడీఎస్ జనరల్ రావత్ ఆదివారం ఢిల్లీలోని నరేలాలో ఉన్న కోవిడ్-19 శిబిరాన్ని సందర్శించారు. అక్కడ సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. సివిల్, మిలిటరీ మెడికల్ టీమ్స్ మధ్య చక్కని సమన్వయం కుదిరిందని ప్రశంసించారు. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. 


Updated Date - 2020-04-06T02:24:07+05:30 IST