Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 17:40PM

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ : సంస్కరణశీలి, యుద్ధ వీరుడు

న్యూఢిల్లీ : మన దేశంలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం ప్రమాదానికి గురైంది. 2019 డిసెంబరు 31న ఆయన త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి నియమితుడైన తొలి సిట్టింగ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయనే. పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆర్మీ రూల్స్‌ను భారత ప్రభుత్వం సవరించి, ఆయనను ఈ పదవిలో నియమించింది. 


సైన్యం, నావికా దళం, వాయు సేనలను సమైక్యపరచడం సీడీఎస్ ప్రధాన లక్ష్యం. ఈ దళాలన్నిటికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరిస్తారు. జనరల్ రావత్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఓఎస్‌సీ) శాశ్వత అధిపతి పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఆయన కౌంటర్ఇన్సర్జెన్సీ యుద్ధంలో అత్యంత అనుభవంగలవారు. ఉత్తర, ఈశాన్య కమాండ్లతో పాటు భారత దేశంలోని అత్యంత సంక్లిష్ట ప్రదేశాల్లో విజయవంతంగా విధులు నిర్వహించారు. 


జనరల్ బిపిన్ రావత్ 2016 డిసెంబరు 17న భారత సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 27వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లలో చదివారు. 11 గూర్ఖా రైఫిల్స్‌లో 1978 డిసెంబరులో చేరారు. నాలుగు దశాబ్దాల సర్వీస్‌లో బ్రిగేడ్ కమాండర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ -సదరన్ కమాండ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2 వంటి పదవులను నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో కూడా సేవలందించారు. కాంగోలో బహుళ దేశాల బ్రిగేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. 


ఈశాన్యంలో తీవ్రవాదంపై ఉక్కుపాదం

ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని తగ్గించడానికి జనరల్ రావత్ కృషి చేశారు. 2015లో ఎన్ఎస్‌సీఎన్-కే మిలిటెంట్లు దాడి చేయడంతో మయన్మార్ దేశంలోకి చొచ్చుకెళ్ళి దాడి చేయడం ఆయన కెరీర్‌లో ఓ చెప్పుకోదగ్గ అంశం. ఈ సైనిక చర్య రావత్ పర్యవేక్షణలో దిమాపూర్‌లోని 3 కార్ప్స్ నుంచి జరిగింది. 


సర్జికల్ స్ట్రైక్స్ 

2016లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోకి చొచ్చుకెళ్ళి నిర్వహించిన లక్షిత దాడుల ప్రణాళిక రూపకర్తల్లో జనరల్ రావత్ ఒకరు. ఈ దాడులను న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి ఆయన నిరంతరం పర్యవేక్షించారు. 


రాష్ట్రపతి పురస్కారాలు

మిలిటరీ మీడియా స్ట్రాటజిక్ స్టడీస్‌లో అధ్యయనం చేసినందుకు జనరల్ రావత్‌కు మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీని ప్రదానం చేసింది. PVSM, UYSM, AVSM, YSM, SM, VSM వంటి ప్రెసిడెన్షియల్ అవార్డులు ఆయనకు లభించాయి. 


చైనా, పాకిస్థాన్‌లపై గట్టి చర్యలు 

జనరల్ రావత్ నేతృత్వంలో భారత సైన్యం చైనా, పాకిస్థాన్‌ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టింది. భారత వాయు సేన 2019 ఫిబ్రవరిలో బాలాకోట్‌లో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌ను దీటుగా తిప్పికొట్టడంలో రావత్ కీలక పాత్ర పోషించారు. 


2017లో డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనాను దీటుగా ఎదుర్కొన్నారు. భారత్, చైనా సైన్యాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి కృషి చేశారు. క్రమం తప్పకుండా బోర్డర్ మీటింగ్స్ నిర్వహించారు. 


భారత సైన్యాన్ని తీర్చిదిద్డడానికి జనరల్ రావత్ విశేషంగా కృషి చేశారు. సైన్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పోరాట సామర్థ్యాన్ని పెంచారు. యంత్రం వెనుక ఉండే సిబ్బందికి ప్రాధాన్యం ఉండేలా చేశారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చారు. 


Advertisement
Advertisement