ఎస్సీ కాలనీ ఇళ్లల్లోకి నీరు

ABN , First Publish Date - 2020-09-26T06:50:49+05:30 IST

తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ కాలనీ ఇళ్లల్లోకి శుక్రవారం గండికోట బ్యాక్‌వాటర్‌ చేరింది.

ఎస్సీ కాలనీ ఇళ్లల్లోకి నీరు

23వ రోజుకు చేరిన నిర్వాసితుల ఆందోళన


కొండాపురం, సెప్టెంబరు 25: తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ కాలనీ ఇళ్లల్లోకి శుక్రవారం గండికోట బ్యాక్‌వాటర్‌ చేరింది. ఇప్పటికే బీసీ కాలనీలోకి నీళ్లు చేరడంతో వారు ఖాళీ చేసి వెళ్లారు. ఎస్సీ కాలనీలో కూడా నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పునరావాసం కల్పించకుండా ఇళ్లలోకి నీళ్లు వదిలితే ఎక్కడకు వెళ్లాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


బాడుగ ఇళ్లు కూడా దొరకడం లేదని ఒకవేళ దొరికినా రూ.50వేల అడ్వాన్స్‌తో నెలకు రూ.5వేలకు పైగా బాడుగ అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై కనీస మానవత్వం లేకుండా, పునరావాసం కల్పించకుండా ఇళ్లలోకి నీళ్లు వదిలితే వారు ఎక్కడకు వెళ్తారంటూ మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ మండిపడ్డారు. ప్రభుత్వం పునరావాసం షెల్టర్లు కూడా చూపలేదని దళితులతో కలిసి సచివాలయ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు.


కొన్ని షెల్టర్లు చూపించామని సిబ్బంది చెప్పడంతో అందరికీ సరిపడినన్ని షెల్టర్లు లేవని, అక్కడ కనీస వసతులు కూడా లేవని ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మండలంలో తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు చేస్తున్న ఆందోళన శుక్రవారం 23వ రోజుకు చేరుకుంది.


ప్రభుత్వం వెంటనే నీళ్లు తగ్గించాలని, ఇళ్లు కట్టుకోవడానికి రెండేళ్ల గడువు ఇవ్వాలని, కటాఫ్‌ డేట్‌ ఈ ఏడాది చివరి వరకు పెంచాలని, పునరావాసంలో అన్నిసౌకర్యాలు కల్పిచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు నరసింహారెడ్డి, మండల బీజేపీ కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్‌బాషా, మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T06:50:49+05:30 IST