దొంగను పట్టించిన సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2022-01-26T06:09:54+05:30 IST

కడప నగరంలో బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డ దొంగను, పోరుమామిళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్‌రాష్ట్ర దొంగను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కేసులకు సంబంధించి రూ.38 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
బంగారు నగలు పరిశీలిస్తున్న ఎస్పీ

రెండు వేర్వేరు దొంగతనాల్లో ఇద్దరు దొంగల అరెస్టు 

వీరిలో 150కి పైగా దొంగతనాలకు పాల్పడ్డ దొంగ

నిందితుల వివరాలను వెల్లడించిన ఎస్పీ అన్బురాజన 

కడప(క్రైం), జనవరి 25 : కడప నగరంలో బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డ దొంగను, పోరుమామిళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్‌రాష్ట్ర దొంగను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కేసులకు సంబంధించి రూ.38 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్స హాలులో ఎస్పీ కేకేఎన అన్బురాజన రెండు వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించి రెండు కేసుల వివరాలను మంగళవారం వెల్లడించారు. 

కడప కేసుకు సంబంధించి.. 

పెనగలూరు మండలం అగ్రహారంలోని వేణుగోపాల స్వామి గుడి ప్రాంతానికి చెందిన చప్పిడి మణి అలియాస్‌ జావిద్‌ ఇమ్రాన జులాయిగా తిరుగుతుండేవాడు. ఈనెల 12వ తేదీ స్కూటీలో కడపకు వచ్చి రెక్కీ నిర్వహించాడు. 13వ తేదీ తన స్కూటీని కొద్ది దూరంలో పార్కింగ్‌ చేసి నడుచుకుంటూ ఎనజే జ్యువెలర్స్‌ దుకాణం మేడ పైకి వెళ్లి అక్కడ ఉన్న ఇనుప కడ్డీలను కట్టర్ల ద్వారా కట్‌ చేసుకొని బంగారు దుకాణంలోకి చొరబడ్డాడు. కింద ఉన్న లాకర్లను పగులకొట్టి అందులో ఉన్న 466 గ్రాముల బంగారు నగలు, ఐదున్నర కేజీల వెండి వస్తువులను తీసుకుని అక్కడి నుంచి తన వాహనంలో పరారైనట్లు తెలిపారు. ఈ చోరీపై డాగ్‌స్క్వాడ్‌, వేలిముద్రల నిపుణులు పరిశీలించామన్నారు. నగరంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి సీఐలు మహమ్మద్‌ అలీ, అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు తులసీనాగప్రసాద్‌, రాఘవేంద్రారెడ్డి, రాజరాజేశ్వర్‌రెడ్డి, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. సీసీ ఫుటేజీలన్నీ పరిశీలించగా చప్పిడి మణి స్కూటర్‌లో వెళ్లడంపై గుర్తించామని ముందుగానే చోరీకి పాల్పడ్డ ఫొటోలు కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. దొంగిలించిన బంగారు, వెండి వస్తువులతో ప్రొద్దుటూరుకు విక్రయించేందుకు వెళుతున్నట్లు సమాచారం రావడంతో కడప-రాజంపేట బైపాస్‌ రోడ్డులోని పాళెంపల్లె-రాచినాయనపల్లె క్రాస్‌ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.22 లక్షల 50 వేలు విలువ చేసే 466 గ్రాములు బంగారు నగలు, రూ.3 లక్షల 55 వేలు విలువ చేసే ఐదున్నర కే జీ వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో మణిపై గ్యాస్‌ సిలిండర్‌ చోరీ కేసు కూడా ఒకటి నమోదైనట్లు తెలిపారు. 

పోరుమామిళ్ల దొంగతనం కేసు..

పోరుమామిళ్ల, కలసపాడు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో వరుస 5 దొంగతనాలకు పాల్పడ్డ అంతర్‌రాష్ట్ర దొంగను పులివీడు బస్టాండ్‌ వద్ద పోరుమామిళ్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 2, 3వ తేదీలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగ గిద్దలూరు టౌన ఏబీఎనపాళెంకు చెందిన పోతుగంటి పీరయ్య అలియాస్‌ దూదేకుల పీరయ్య అలియాస్‌ దూదేకుల పసుపులేటి పీరయ్య ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశలలో 150 దొంగతనాలకు పైగానే చేసినట్లు తెలిపారు. వరుస దొంగతనాలతో పోరుమామిళ్ల సీఐ రమే్‌షబాబు, ఎస్‌ఐలు హరిప్రసాద్‌, రామాంజనేయుడు, అరుణ్‌రెడ్డితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచి అంతర్‌రాష్ట్ర అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇతడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే 231.9 గ్రాముల బంగారు నగలు, 270 గ్రాములు వెండి వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఇరువురు దొంగలను రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. దొంగలను అరెస్టు చేసిన సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు అందజేశారు. 

Updated Date - 2022-01-26T06:09:54+05:30 IST