మంచినీరు, ఇతర సౌకర్యాలు ఉండాలి
అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Education Minister Sabita Indrareddy) అధికారులకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల(CCTV cameras at test centers)ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలన్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై సోమవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మే 23 నుంచి జరిగే టెన్త్ పరీక్షల విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సుమారు 5.09 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఈ మేరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చె ప్పారు. ఎగ్జామ్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది వద్ద మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను అనుమతించవద్దని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్ నంబర్లను డిస్‌ప్లే చేయాలని సూచించారు. హాల్ టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపామని, స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను కలిసి వాటిని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు జరిగేటప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు కూడా ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్, టాయిలెట్ సౌకర్యం ఉండేలా ముం దుగానే తనిఖీలు చేయాలన్నారు. ఎక్కడైనా లోపాలుంటే... పరీక్షలను నిర్వహించే నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలి: నర్సిరెడ్డి
కాగా... ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలను పూర్తి చేస్తామని ఏప్రిల్ 21న జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ సెలవులు సగం అయిపోయినా షెడ్యూల్‌ను విడుదల చేయలేదన్నారు. దాంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు. బడులను ప్రారంభించే నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన కోరారు.
18న కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయుల ధర్నా
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలలో ప్రభుత్వ ని ర్లక్ష్యానికి నిరసనగా 18న కలెక్టరేట్ల వద్ద ధర్నాను నిర్వహించాలని ఉపాధ్యాయ పోరాట కమిటీ పిలుపునిచ్చింది.పదోన్నతులు ఇస్తామని సీఎం అనేకసార్లు ప్రకటించినా... ఇంకా అమలుకు నోచుకోలేదని కమిటీ సభ్యులు చావ రవి, జంగయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.