నిఘాపై నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2022-01-21T05:28:32+05:30 IST

జిల్లాలో రూ.కోట్లు ఖర్చుపెట్టి పెద్దపెద్ద భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇంటీరియల్‌ డిజైనింగ్‌లతో సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. కానీ ఇంటి భద్రత విషయంలో మాత్రం రాజీ పడుతున్నారు. రూ.వేలల్లో లభ్యమయ్యే సీసీ కెమెరాల ఏర్పాటుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో నిఘాలేని ప్రాంతాల్లో చోరీ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

నిఘాపై నిర్లక్ష్యం!

- రూ.కోట్లు ఖర్చుపెట్టి... రూ.వేలకు వెనకడుగు!

- భవనాలు, అపార్ట్‌మెంట్‌లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని వైనం

- పెరుగుతున్న చోరీ ఘటనలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రూ.కోట్లు ఖర్చుపెట్టి పెద్దపెద్ద భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇంటీరియల్‌ డిజైనింగ్‌లతో సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. కానీ ఇంటి భద్రత విషయంలో మాత్రం రాజీ పడుతున్నారు. రూ.వేలల్లో లభ్యమయ్యే సీసీ కెమెరాల ఏర్పాటుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో నిఘాలేని ప్రాంతాల్లో చోరీ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాతనేరస్థులు, అంతర్రాష్ట్ర దొంగలు పగటిపూట రెక్కీ నిర్వహించి.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నారు. రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2020లో 87 దొంగతనాలు, గత ఏడాది 91 చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా అపార్ట్‌మెంట్‌లు, శివారు ప్రాంతాల్లో ఒంటరి ఇళ్లు, సీసీ కెమెరాలు లేని ఇళ్లల్లోనే చోరీలు జరిగాయి. వీటిని చేధించేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చోరీ ఘటనల వద్దకు క్లూస్‌ టీమ్‌లతో పరిశీలించినా సరైన ఆధారాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చోరీ ప్రాంతాల్లో ఎక్కడైనా సీసీ కెమెరాలు అమర్చి ఉంటే.. ఆ దిశగా రాకపోకలు సాగించినవారి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆపై దర్యాప్తులో ముందడుగు వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రికవరీలు చేస్తున్నారు.  


రూ.5వేలలోపు ఖర్చు...  

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న ప్రతి దృశ్యం ఇంట్లో ఉన్న డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, టీవీలోనే పరిశీలించుకోవాల్సిన పనిలేదు. సెల్‌ఫోన్‌లో కూడా చూసుకోవచ్చు. సీసీ కెమెరాలు కొనుగోలు నుంచి అమరిక వరకు కేవలం రూ.5వేలలోపు ఖర్చవుతుంది. భవన నిర్మాణ ప్లాన్‌లోనే.. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నదీ వివరించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా వేలాదిగా భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, ఒంటరి ఇళ్లు ఉన్నాయి. వీటి యాజమానులంతా ఇప్పటికైనా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తే చోరీలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 


ఏర్పాటు చేసుకోండి 

శ్రీకాకుళం నగరం సమీపంలో కొద్దిరోజుల కిందట తెల్లటి స్విఫ్ట్‌ డిజైర్‌ కారుతో పయనిస్తున్న వ్యక్తి.. ఓ చోట చోరీకి పాల్పడ్డాడు. ఆ రోజు వెళ్లే తెల్లటి స్విఫ్ట్‌ డిజైర్‌ కార్ల నెంబర్లు ఇవ్వాలని టోల్‌గేట్‌ సీసీ కెమెరా సిబ్బందికి చెప్పాం. వారు పది కార్ల నెంబర్లు ఇవ్వగా, వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. దొంగ ఆచూకీ పట్టుకుని అదుపులోకి తీసుకున్నాం. సీసీ కెమెరాల్లో ప్రతిదీ రికార్డు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ఉండాల్సిందే. ఈ విషయంతో భవన నిర్మాణదారులు వెనకడుగు వేయకుండా ఏర్పాటు చేసుకోవాలి. 

 - అంబేడ్కర్‌, వన్‌టౌన్‌ సీఐ, శ్రీకాకుళం

Updated Date - 2022-01-21T05:28:32+05:30 IST