అంధకారంలో నిఘా వ్యవస్థ

ABN , First Publish Date - 2020-09-25T10:02:54+05:30 IST

శాంతి భద్రతల దృష్ట్యా మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటులో చూపిన ఉత్సాహం

అంధకారంలో నిఘా వ్యవస్థ

అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు 

ఏర్పాటు ఘనం.. నిర్వహణ శూన్యం..

ఎంసీపల్లిలో నామ్‌కే వాస్తేగా ఏర్పాటు..

పట్టించుకోని పోలీసు అధికారులు.. 

భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు 


శామీర్‌పేట రూరల్‌: శాంతి భద్రతల దృష్ట్యా మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటులో చూపిన ఉత్సాహం నిర్వహణలో చూపడం లేదని ఎంసీపల్లి మండలవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమరాలు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయని ప్రజలు వాపోతున్నారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఎలాంటి నేరాలు జరుగకుండా ఒకవేళ జరిగినా ఎలా జరిగిందనే విషయాలను చేధించడానికి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండలంలోని 13 గ్రామపంచాయతీల్లో దాదాపు 10 గ్రామాల్లో సీసీ సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణ పట్ల శ్రద్ధ చూపడం లేదని పలు గ్రామాల ప్రజలు  వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కోరుతున్నారు.


పని చేయని సీసీ కెమెరాలు..

ఎంసీపల్లి మండలంలో లక్ష్మాపూర్‌లో 10 కెమెరాలకు గానూ నాలుగు కెమెరాలు పనిచేయడం లేదు. ఉద్దెమర్రిలో 15 కెమెరాలకు గానూ ఒకటి, అద్రా్‌సపల్లిలో 15కు గాను నాలుగు, లింగాపూర్‌తాండాలో ఉన్న  నాలుగు కెమెరాలూ పనిచేయడం లేదు. నారాయణపూర్‌లో ఆరు సీసీ కెమెరాలకు గానూ రెండు కెమెరాలు, కొల్తూర్‌లో 16 కెమెరాలకు గానూ తొమ్మిది కెమెరాలు పనిచేయడం లేదు. కేశవరంలో 10 కెమెరాలు పనిచేస్తున్నాయి.  కాగా ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని గ్రామాల్లో కెమెరాలు కిందకు వంగి పడిపోయాయి. కొన్ని చెట్ల కొమ్మల మధ్యలో ఉన్నాయి. దీంతో ఏదైనా నేరం జరిగినప్పుడు సాక్ష్యాధారాలకు సీసీ పుటేజీలు లభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగ్గంగూడ, పోతారం, నాగిశెట్టిపల్లి, ఉషార్‌పల్లి, అనంతారం గ్రామాల్లో ఇప్పటివరకు సీసీ కెమరాల ఏర్పాటు ఊసేలేదు.

Updated Date - 2020-09-25T10:02:54+05:30 IST